‘అదిరింది’

Thu Nov 09 2017 GMT+0530 (IST)

‘అదిరింది’

చిత్రం : ‘అదిరింది’

నటీనటులు: విజయ్ - కాజల్ అగర్వాల్ - సమంత - నిత్యా మీనన్ - ఎస్.జె.సూర్య - వడివేలు - సత్యరాజ్ తదితరులు
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
ఛాయాగ్రహణం: జి.కె.విష్ణు
స్క్రీన్ ప్లే: విజయేంద్ర ప్రసాద్
నిర్మాత: శరత్ మరార్ - రామస్వామి - హేమ రుక్మిణి
కథ - దర్శకత్వం: అట్లీ

ఈ మధ్య కాలంలో దక్షిణాదిన తీవ్ర చర్చనీయాంశమైన సినిమా ‘మెర్శల్’. దీపావళికి తమిళనాట విడుదలై సంచలన విజయం సాధించిన ఈ చిత్రం చుట్టూ కొన్ని వివాదాలు ముసురుకోవడం దీని గురించి పెద్ద చర్చే నడిచింది. ఈ చిత్రం ఇప్పుడు ‘అదిరింది’ పేరుతో తెలుగులోకి వచ్చింది. విజయ్ కథానాయకుడిగా విజయేంద్ర ప్రసాద్ స్క్రీన్ ప్లేతో అట్లీ రూపొందించిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

భార్గవ్ (విజయ్) కేవలం ఐదు రూపాయలు మాత్రమే ఫీజుగా తీసుకుని పేదలకు వైద్యం చేసే వైద్యుడు. అతడి సేవలకు గుర్తింపు లభించి.. విదేశాలకు వెళ్లి పురస్కారం కూడా అందుకుంటాడు భార్గవ్. ఐతే ఆ పురస్కారం అందుకున్న సమయంలోనే అతను అక్కడ మెజీషియన్ అవతారమెత్తి ఓ వైద్యుడిని హత్య చేస్తాడు. దీంతో పాటు అతను నలుగురిని కిడ్నాప్ కూడా చేస్తాడు. దీంతో పోలీసులు భార్గవ్ ను అరెస్టు చేస్తారు. కానీ తీరా చూస్తే పోలీసులు అరెస్టు చేసింది భార్గవ్ ను కాదని తేలుతుంది. ఇంతకీ అతనెవరు? అతడికి భార్గవ్ కు సంబంధమేంటి? అతడీ హత్య.. కిడ్నాపులు ఎందుకు చేశాడు.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

మంచి కోసం పాటు పడే హీరోను తన స్వార్థం కోసం అన్యాయంగా ఒక విలన్ చంపేస్తాడు. ఆ విలన్ తర్వాత కోట్లకు పడగలెత్తి సొసైటీని శాసిస్తుంటాడు. చనిపోయిన హీరో కొడుకు తిరిగొచ్చి అతడిపై ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇలాంటి కథలు ఎన్ని వందల సినిమాల్లో చూసి ఉంటాం? ‘అదిరింది’ కథ కూడా అచ్చం ఇలాంటిదే. ఇది ఒక సగటు రివెంజ్ స్టోరీ. ఇందులో కొత్తగా అనిపించే విషయం. ప్రతీకారం తీర్చుకునేది ఒకడు కాదు.. ఇద్దరు. ఆ ఇద్దరూ ఒకరే అనిపించేలా ఆడే దోబూచులాటతో స్క్రీన్ ప్లే పరంగా కొంచెం మాయ చేసే ప్రయత్నం చేశారు. ఇక దీనికి ఎంచుకున్న నేపథ్యం కూడా కొత్తదేమీ కాదు. ‘ఠాగూర్’ సినిమాలో చూసిన హాస్పిటల్ ఎపిసోడ్ ను ఒక పెద్ద కథకు విస్తరిస్తే.. అది ‘అదిరింది’ సినిమా అయింది. కథ పరంగా ఏ కొత్తదనం కనిపించదు ఇందులో.

‘అదిరింది’లో మనసును తట్టే ఒకట్రెండు ఎపిసోడ్లు ఉన్నప్పటికీ.. కమర్షియల్ హంగులకూ ఢోకా లేకపోయినప్పటికీ.. ప్రతి సన్నివేశంలోనూ గుప్పుమనే తమిళ నేటివిటీ ఓవైపు అడ్డం పడుతుంటే.. అవసరానికి మించి విపరీతమైన సాగతీతతో సాగే కథనం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. తమిళ ప్రేక్షకులకు విజయ్ స్టార్ కాబట్టి అతడిని చూస్తూ అతడి విన్యాసాలకు అక్కడివాళ్లు మురిసిపోతూ మైమరిచిపోయారేమో కానీ.. మన ప్రేక్షకులకు మాత్రం ఇందులోని నేటివిటీ.. సాగతీత చాలా పెద్ద అడ్డంకులు అవుతాయి. దీనికి తోడు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచిన జీఎస్టీ డైలాగుల్ని ఇక్కడ మ్యూట్ చేసేశారు. నిజానికి అవేమంత ప్రత్యేకమైన డైలాగులు కాకపోయినా.. ఆ డైలాగుల విషయంలో ప్రేక్షకుల్లో ఉన్న క్యూరియాసిటీ ప్రకారం చూస్తే నిరాశే కలుగుతుంది.

హీరో ఓ పల్లెటూరి వాడు. ఆ ఊర్లో గుడి కట్టాలనుకుంటారు. కానీ అంతలోనే ఓ ప్రమాదం జరిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోతారు. దీంతో గుడి ఆపించి హాస్పిటల్ కట్టిస్తాడు హీరో. కానీ దాన్ని ఓ డాక్టర్ తన సొంతం చేసుకోవాలనుకుంటాడు. హీరో అడ్డు తొలగిస్తాడు. ‘అదిరింది’లో రొటీన్ గా సాగిపోయే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఇది. ఈ కథను చెప్పడానికి ఎంత సమయం పడుతుంది. పావుగంట..? అరగంట..? కానీ అట్లీ మాత్రం ఈ కథను చెప్పడానికి దాదాపు గంట సమయం తీసుకున్నాడు. ప్రథమార్ధంలో ఓ మోస్తరు వేగంతో సాగిపోతూ.. ఓకే అనిపించే ‘అదిరింది’.. ద్వితీయార్దంలో ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టి అప్పటిదాకా సినిమాపై కలిగిన ఇంప్రెషన్ ను తగ్గించేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ముగింపు కోసమే చాలా సేపు నిరీక్షించాల్సి రావడంతో ఇక సినిమా ఎప్పుడు ముగుస్తుందనే విషయంలో ప్రేక్షకుల ఫ్రస్టేషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ‘అదిరింది’లో ప్రధమార్ధం అదిరింది అనిపించకపోయినా.. ఓకే అనిపిస్తుంది కానీ.. ద్వితీయార్ధం మాత్రం ప్రేక్షకుల్ని బెదరగొట్టేదే.

ఐతే ఒక స్టార్ హీరో నటించే కమర్షియల్ సినిమాలో ఏయే అంశాలు కోరుకుంటారో.. అవన్నీ ఈ కథలో పొందుపరిచాడు అట్లీ. హీరోయిజం ఎలివేట్ చేసే ఫైట్లు.. డ్యాన్సులు.. ఒకరికి ముగ్గురు హీరోయిన్ల రొమాన్స్.. కామెడీ.. అన్ని మసాలాలూ అద్దాడు. కాకపోతే మనం చూసేది ఒక తమిళ స్టార్ హీరోను. అతడికి మనం ఎంత వరకు కనెక్టవుతామన్నది సందేహం. ప్రథమార్ధంలో యూరప్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. హీరోది డబుల్ రోల్ అనే విషయం దాచిపెట్టి.. ప్రేక్షకుల్లో కొంచెం ఉత్కంఠ రేకెత్తిస్తూ ఈ ఎపిసోడ్ ను నడపించాడు దర్శకుడు. ముఖ్యంగా మ్యాజిక్ షో సీన్ ఆకట్టుకుంటుంది. సమంత పాత్రతో సాగే సన్నివేశాలు కొంతమేర ఎంటర్టైన్ చేస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తి రేకెత్తిస్తుంది. కానీ ‘అదిరింది’ ట్రాక్ తప్పేది ద్వితీయార్ధంలోనే. అసలు కథేంటో తెలిసిపోయాక సినిమా మొత్తం ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. ఏ ప్రత్యేకతా లేకుండా సాగతీతగా అనిపించే ఫ్లాష్ బ్యాక్ మైనస్ అయింది. క్లైమాక్స్ చాలా రొటీన్ అనిపిస్తుంది. ప్రథమార్ధంలో ఓ అమ్మాయి యాక్సిడెంట్ చుట్టూ నడిపిన ఎపిసోడ్.. ఫ్లాష్ బ్యాక్ లో నిత్యామీనన్ పాత్రన ముగించే సీన్ మాత్రం ఎమోషనల్ గా కదిలిస్తాయి. ఓవరాల్ గా ‘అదిరింది’లో వినోదం పంచే కొన్ని అంశాలున్నప్పటికీ.. రొటీన్ కథ.. హద్దులు దాటిపోయిన తమిళ నేటివిటీ.. సాగతీతగా అనిపించే కథనం నిరాశపరుస్తాయి.

నటీనటులు:

త్రిపాత్రాభినయంలో విజయ్ ఓకే అనిపించాడు. అతడి నటన మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా సాగుతుంది. లుక్ పరంగా చూస్తే వర్తమానంలో కనిపించే రెండు పాత్రల్లో వైరుధ్యం ఏమీ లేదు. ఐతే ఫ్లాష్ బ్యాక్ పాత్రలో లుక్.. నటన భిన్నంగా అనిపిస్తాయి. హీరోయిన్లలో నిత్యా మీనన్ క్యారెక్టర్ పర్వాలేదు. ఆమె ఎప్పట్లాగే తన నటనతో ఆకట్టుకుంది. కాజల్.. సమంత అందంగా కనిపించారు. నటన పరంగా పెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు. సినిమాలో లుక్.. యాక్టింగ్.. స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో అందరి కంటే ఎక్కువ మార్కులు విలన్ పాత్ర చేసిన ఎస్.జె.సూర్యకే పడతాయి. అతడి పాత్ర ప్రత్యేకంగా ఏమీ లేదు కానీ.. సూర్యానే దానికి ప్రత్యేకత తీసుకొచ్చాడు. సత్యరాజ్.. వడివేలు ఓకే.

సాంకేతికవర్గం:

‘అదిరింది’ సాంకేతిక హంగులు బాగానే అనిపిస్తుంది. ఎ.ఆర్.రెహమాన్ నేపథ్య సంగీతం సినిమాకు ఆకర్షణ. పాటలు తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. ఏ పాటలోనూ లిరిక్స్ వినిపించవు. పాటల్లో తమిళ వాసనలు కూడా ఎక్కువయ్యాయి. చిత్రీకరణ కూడా తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగానే సాగింది. కానీ రెహమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం ప్రత్యేకంగా అనిపిస్తుంది. జి.కె.విష్ణు ఛాయాగ్రహణం కూడా టాప్ క్లాస్ గా సాగింది. డబ్బింగ్ కొంచెం శ్రద్ధ పెట్టే చేశారు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. అట్లీ ఎంచుకున్న కథ రొటీనే అయినా.. విజయేంద్ర ప్రసాద్ స్క్రీన్ ప్లేతో దానికి కొంచెం బలం చేకూర్చే ప్రయత్నం చేశాడు. దర్శకుడిగా అట్లీ పనితనం ఎమోషనల్ సీన్లలో కనిపిస్తుంది. ఐతే అసలే రొటీన్ కథను ఎంచుకున్న అట్లీ.. దాన్ని చాలా సుదీర్ఘంగా చెప్పాడు. దీంతో చాలా చోట్ల ప్రేక్షకుల ఆసక్తి సన్నగిల్లిపోతుంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అతను నిరాశ పరిచాడు.

చివరగా: అదిరింది.. రొటీన్ గా సా....గే ఆరవ సినిమా

రేటింగ్- 2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS