మూవీ రివ్యూ : ఆచార్య
నటీనటులు: చిరంజీవి-రామ్ చరణ్-పూజా హెగ్డే-సోనూ సూద్-తనికెళ్ల భరణి-జిష్ణుసేన్ గుప్తా-అజయ్-బెనర్జీ తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: తిరు
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి-అవినాష్ రెడ్డి
రచన-దర్శకత్వం: కొరటాల శివ
అయిదేళ్ల
కిందట రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’తో మురిపించి.. ఆ తర్వాత ‘సైరా’
లాంటి భారీ చిత్రంతో అలరించిన మెగాస్టార్ చిరంజీవి.. మూడేళ్లకు పైగా
ప్రేక్షకులకు దూరంగా ఉన్నారు. అగ్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆయన
నటించిన ‘ఆచార్య’ కరోనా ఇతర కారణాల వల్ల బాగా ఆలస్యం అయి ఎట్టకేలకు
ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిరు-కొరటాల.. చిరు-చరణ్ కాంబినేషన్లు ఈ
సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. మరి ఆ అంచనాలను అందుకునేలా సినిమా
ఉందా..? చూద్దాం పదండి.
కథ:
వందల ఏళ్ల కిందట ఘట్టమ్మ అనే
దేవత వెలసిన ధర్మస్థలి అనే ప్రాంతాన్ని దాన్ని ఆనుకునే ఉండే పాదఘట్టం అనే
గూడేనికి చెందిన ఆదివాసీలు కాపాడుతూ వస్తుంటారు. ధర్మస్థలిలో జరిగే ప్రతి
వేడుకలోనూ వారి భాగస్వామ్యం ఉంటుంది. ఐతే ధర్మస్థలి పెద్ద టెంపుల్ టౌన్ గా
మారడంతో దాన్నుంచి వచ్చే ఆదాయం మీద కన్నేసిన బసవ (సోనూ సూద్).. పాదఘట్టం
మనుషులను ఆలయానికి దూరం చేస్తాడు. ధర్మస్థలిని తన గుప్పెట్లోకి
తీసుకుంటాడు. రాను రాను అతడి అరాచకాలు హద్దు మీరి పోయి అక్కడున్న వాళ్లంతా
అల్లాడిపోతున్న సమయంలో ఆచార్య (చిరంజీవి) అక్కడికి అడుగు పెడతాడు. ఒక
వడ్రంగి లాగా అక్కడికి వచ్చి పాదఘట్టం వారికి అండగా నిలుస్తాడు. బసవకు
అడుగడుగునా అడ్డు తగులుతాడు. తర్వాత ఆచార్య ఓ లక్ష్యంతో అక్కడికి అడుగు
పెట్టాడని అక్కడి జనాలకు తెలుస్తుంది. మరి ఆ లక్ష్యం ఏంటి.. దాన్ని అతను
సాధించాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
‘ఆచార్య’
సినిమాలో విలన్ గ్యాంగ్ అక్రమంగా మైనింగ్ చేస్తుంటే.. చిరు-చరణ్ సెక్యూరిటీ
గార్డుల్లా మారు వేషాలు వేసుకుని అడుగు పెడతారు. ఏంటి ఇంత లేటైంది..
రాత్రి తాగింది దిగలేదా అని విలన్ గ్యాంగులో ఒకడనగానే చిరు కత్తి తీసి
పొడిచేస్తాడు. అదేంటి అలా పొడిచేశారు అని చరణ్ అంటే మందు కొట్టానన్నందుకు
హర్టయ్యా అంటాడు చిరు. ఇంతలో ఇంకో రౌడీ తనను తోశాడని చరణ్ అతణ్ని
పొడిచేస్తాడు. ఇంకొకతను తన వైపు ఉరిమి చూశాడని చిరు అతడి ఒంట్లో కత్తి
దించేస్తాడు. ఇలా చిరు-చరణ్ అక్కడున్న వాళ్లందరినీ సిల్లీ రీజన్స్ చెప్పి
కామెడీగా చంపి పడేస్తారు. మామూలుగా అయితే ఈ సన్నివేశం ఊర మాస్ గా
అనిపించాలి. ఎలివేషన్ అదిరిపోవాలి. చిరు-చరణ్ అభిమానులకు.. మాస్
ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేయాలి. కానీ అది పూర్తిగా ‘నాన్ సింక్’లో
ఉన్నట్లు అనిపిస్తే..? ఆ సీన్ చూసి నవ్వాలో ఏడవాలో తెలియని అయోమయ స్థితి
ఎదురైతే..? అప్పటికి ప్రేక్షకుల మూడ్ ఎలా తయారై ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
‘ఆచార్య’ సినిమా పరిస్థితేంటో చెప్పడానికి ఈ ఉదాహరణ ఒక్కటి చాలు.
పెద్ద
హీరోలు నటించే కమర్షియల్ సినిమాల్లో చాలా వరకు సమాజాన్ని ప్రతిబింబించని
కథలే కనిపిస్తాయి. ఆ కథల్లో కనిపించే పరిస్థితులను కానీ.. మనుషులను కానీ
మనం బయట చూడలేం. వాస్తవికతకు చాలా దూరంగా ఉన్నా కూడా వాటికి ప్రేక్షకులు
కనెక్ట్ అవుతారంటే ఆ కథల్లో ఉండే ఏదో ఒక ఎమోషన్. ముందు ఆడియన్స్ ను ఏదో ఒక
పాయింట్ దగ్గర ఎమోషనల్ గా కనెక్ట్ చేయగలిగితే.. సగం పని పూర్తయినట్లే. ఆ
తర్వాత నేలవిడిచి సాము చేసినా.. ఎన్ని విన్యాసాలు చేసినా చెల్లిపోతుంది.
కానీ ‘ఆచార్య’లో ప్రాథమికంగా జరగాల్సిందే జరగలేదు. ప్రశాంతంగా ఉన్న
ప్రాంతంలో విలన్లు అరాచకాలు చేస్తుంటే హీరో ఒక రక్షకుడిలా అక్కడ అడుగు
పెట్టి వారి పని పట్టి ఆ ప్రాంతాన్ని కాపాడటం.. తెలుగులో లెక్కలేనన్ని
సినిమాల్లో చూసిన ఈ లైన్ ఇది. ముఖ్యంగా బోయపాటి చిత్రాల్లో చాలా వరకు
ఇలాంటి కథే కనిపిస్తుంది. ‘ఆచార్య’ కోసం కొరటాల కూడా ఈ లైనునే అనుసరించాడు.
కాకపోతే దీనికి నేపథ్యంగా ధర్మస్థలి అనే వేరే ప్రపంచాన్ని ఎంచుకున్నాడు.
అలాగే హీరోకు నక్సలిజం నేపథ్యాన్ని జోడించాడు. కానీ ఈ రెండు నేపథ్యాల్లో
భారీతనం తప్పితే.. కొత్తదనం రవ్వంత కూడా లేకపోవడమే ‘ఆచార్య’కు అతిపెద్ద
బలహీనత.
కోట్లు ఖర్చు పెట్టి ఎంతో ఆర్భాటంగా తీర్చిదిద్దిన
‘ధర్మస్థలి’ తెరకు భారీతనం తీసుకొచ్చింది కానీ.. సహజంగా మాత్రం అనిపించదు. ఆ
ప్రపంచమే చాలా కృత్రిమంగా అనిపించడం ఒక లోపమైతే.. అక్కడ జరిగే అరాచకాలంటూ
చూపించిన తంతంతా కూడా పరమ రొటీన్ గా అనిపించడం ఇంకో ప్రతికూలత. ఇలా
సాధారణంగా మొదలయ్యే కథలో కథానాయకుడి రంగప్రవేశంతో అయినా ఊపు వస్తుందేమో అని
చూస్తే అదీ లేకపోయింది. ఒక దాని తర్వాత ఒకటి ఫైట్లు వస్తుంటాయి..
వెళ్తుంటాయే తప్ప భావోద్వేగాలకు అసలు అవకాశమే లేకపోయింది. కథలో ఏ మలుపూ
లేకుండా.. కొత్తగా ఒక్క సన్నివేశమూ చూపించకుండా.. కేవలం హీరో విలన్లను
ఇరగదీస్తూ వెళ్లిపోతుంటే.. విలన్ వైపు నుంచి సరైన రియాక్షన్ కూడా లేకుంటే..
ఇక ప్రేక్షకుల్లో కదలిక ఎలా వస్తుంది? భావోద్వేగాలు పండించడంలో తిరుగులేని
చిరంజీవికి ఆ అవకాశమే ఇవ్వకుండా కేవలం ఫైట్లు చేయించడం వల్ల ఉపయోగం ఏంటి?
అసలు చిరుతో సినిమా అంటే ఏ దర్శకుడైనా ఆయన ఎనర్జీని అన్ని రకాలుగా ఎలా
వాడుకోవాలని చూస్తాడు. కానీ కొరటాల ఆ ప్రయత్నమే చేయలేదు. చిరు కూడా
కొరటాలకు సరెండర్ అయిపోయి సటిల్ గా కనిపించడానికే ప్రయత్నించాడు. కథలో
దమ్ముంటే.. పాత్రలో విషయం ఉంటే.. ఇలా సటిల్ గా చేసినా ఓకే. కానీ కథ
సాధారణంగా మారిపోయినపుడు.. పాత్ర బలహీనంగా తయారైనపుడు చిరు మార్కు అయినా
చూపించి ఉంటే.. ప్రేక్షకుల్లో అంతో ఇంతో ఉత్సాహం వచ్చేది. అది లేకపోవడంతో
నీరసం తప్పలేదు.
ఇటు కథ.. అటు చిరు పాత్ర నిస్సారంగా ఉండడంతో
ప్రథమార్ధంలో ‘ఆచార్య’ తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. ఇక ద్వితీయార్ధంలో
సిద్ధ పాత్ర మీద.. చిరు-చరణ్ కాంబినేషన్ మీదే ఆశలన్నీ నిలుస్తాయి. కానీ
సిద్ధ పాత్ర కూడా భిన్నమేమీ కాదని తెలియడానికి ఎంతో సమయం పట్టదు.
నీలాంబరితో అతడి ప్రేమాయణం మరీ నీరసంగా సాగి.. సినిమా గ్రాఫ్ ను మరింత కింద
పడేస్తుంది. సిద్ధ ధర్మస్థలిలో ఉన్నంతసేపు చెప్పుకోదగ్గ ఒక్క సన్నివేశం
పడలేదు. హీరో పక్కనే ఉండే విలన్ అతడికి వెన్నుపోటు పొడవడం అనే పాయింట్ తో
ప్రేక్షకులు ఎగ్జైట్ అవడానికి ఏముంటుంది? ‘ఆచార్య’ మొత్తంలో
ప్రేక్షకుల్లో.. ముఖ్యంగా మెగా అభిమానుల్లో ఉత్సాహం తెచ్చింది ఏమైనా
ఉందంటే.. సిద్ధ వెళ్లి నక్సల్ నాయకుడైన చిరును కలవడం.. అక్కడ ఇద్దరూ కలిసి
చేసే పోరాటం మాత్రమే. ఇక్కడ కూడా కథ పరంగా కొత్తదనం ఏమీ కనిపించదు కానీ..
చిరు-చరణ్ కలయికలో వచ్చే కొన్ని దృశ్యాలు.. ఫైట్లు.. భలే బంజారా పాట.. ఇవి
ప్రేక్షకులను ఓ మోస్తరుగా ఎంగేజ్ చేస్తాయి. సిద్ధ పాత్రకు ఇచ్చిన ముగింపు..
ఆ తర్వాత వర్తమానంలో పతాక ఘట్టం ఇవన్నీ కూడా రొటీనే. చిరు-చరణ్ జోడీ
ఆకట్టుకున్నా.. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశాలన్నీ ఔట్ డేటెడ్
గా అనిపిస్తాయి. వర్తమానంలో వచ్చే కథలోనూ కొత్తదనం రవ్వంత కూడా లేదు.
చిరంజీవి పాత్ర చాలా వరకు ప్యాసివ్ గా కనిపించడం వల్ల ఆయన కూడా సినిమాను
కాపాడలేకపోయారు. ఫాంలో ఉన్న చరణ్ సైతం ఏమీ చేయలేని నిస్సహాయుడైపోవడంతో
‘ఆచార్య’ పాఠం ఏమాత్రం ఎక్కని పరిస్థితి తలెత్తింది.
నటీనటులు:
చిరు
కెరీర్లోనే ఆచార్య పాత్ర అత్యంత నిస్సారమైన..నీరసం తెప్పించే పాత్ర అనడంలో
సందేహం లేదు. లుక్ పరంగా 66 ఏళ్ల వయసులో చిరు కనిపించిన తీరుకు ఫిదా
అయిపోతాం కానీ.. ఆయన ఇంత డల్లుగా కనిపించిన పాత్ర కెరీర్ మొత్తంలో వెతికినా
కనిపించకపోవచ్చు. ఫ్లాప్ సినిమాల్లో కూడా తన వరకు బాగా హైలైట్ అవుతాడు..
ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడు చిరు. కానీ ఈ సినిమాలో అది మిస్సయింది.
డ్యాన్సుల వరకు తన గ్రేస్ చూపించినా.. చిరు నుంచి ఆశించే మిగతా విషయాలేవీ
కనిపించవు ఇందులో. చిరు చేసిన ఆచార్య పాత్రతో పోలిస్తే సిద్ధ క్యారెక్టరే
కొంచెం నయం అనిపిస్తుంది. అలాగని దాని వరకు చూసుకుంటే అది కూడా అంతగా
హైలైట్ అవ్వలేదు. చరణ్ పెర్ఫామెన్స్ ఓకే. తండ్రితో కలిసి చేసిన
సన్నివేశాల్లో చరణ్ మెరిశాడు. పూజా హెగ్డే పాత్ర పూర్తిగా వృథా అయింది. ఆమె
కనిపించే ఎపిసోడ్ సినిమాలో మోస్ట్ బోరింగ్ పార్ట్ గా చెప్పొచ్చు.
కనిపించినంత సేపూ పూజా అందంగా మాత్రం అనిపిస్తుంది. సోనూ సూద్ విలన్ పాత్ర
పేలవం. ఇలాంటి పాత్రలు లెక్కలేనన్ని చూశాం. సోనూ పెర్ఫామెన్స్ కూడా మామూలే.
జిష్ణుసేన్ గుప్తా పాత్ర.. నటనలో కొత్తదనం లేదు. మామూలుగా జగపతిబాబు చేసే
పాత్రను అతను చేసినట్లు అనిపిస్తుంది. తనికెళ్ల భరణి ఉన్నంతలో బాగా చేశాడు.
అజయ్ ఓకే.
సాంకేతిక వర్గం:
మణిశర్మ మంచి అవకాశాన్ని
ఉపయోగించుకోలేకపోయాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ కింగ్ గా పేరున్న ఆయన ‘ఆచార్య’కు
ఇచ్చిన ఔట్ పుట్ ఆశ్చర్యపరుస్తుంది. ఎలివేషన్ సీన్లలో ఆయన ఆర్ఆర్ ఏమాత్రం
ఉత్సాహం తెప్పించలేకపోయింది. అసలే సన్నివేశాలు నీరసంగా సాగుతుంటే.. మణిశర్మ
నేపథ్య సంగీతం కూడా అందుకు తగ్గట్లే సాగడంతో ప్రేక్షకుల్లో ఇక ఉత్సాహం
ఎక్కడొస్తుంది? పాటల వరకు మణిశర్మ ఓకే అనిపించాడు. లాహే లాహే.. భలే బంజారా
బాగున్నాయి. కానీ ఇంకా మెరుగైన పాటలు పడి ఉండాల్సింది అనిపిస్తుంది. తిరు
ఛాయాగ్రహణానికి వంక పెట్టడానికేమీ లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ధర్మస్థలి కోసం అవసరానికి మించే ఖర్చు పెట్టారు. కానీ దాని వల్ల పెద్దగా
ప్రయోజనం లేకపోయింది. ఇక దర్శకుడు కొరటాల శివ తన మీద అందరూ పెట్టుకున్న
నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. కొరటాలకు ఎప్పుడూ రచనే బలం. ఈసారి అదే
అతి పెద్ద బలహీనతగా మారింది. కథ దగ్గరే ఆయన పెద్ద తప్పు చేసేశారు. దానికి
కట్టుబడి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్లిపోయారు. ఎన్నో పరిమితులన్న
రొటీన్ కథను ఎంచుకోవడంతో దాన్ని అనుసరించి ముందుకు వెళ్లిపోయినట్లున్నారు.
రొటీన్ ట్రాక్ నుంచి బయటికి రాలేక సినిమాను నిస్సారంగా తయారు చేశాడు.
చివరగా: ఆచార్య.. తట్టుకోలేని పాఠం
రేటింగ్- 1.75/5
Disclaimer
: This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The
Movie Based On This Review And Watch Movie in Theatre