2.0

Thu Nov 29 2018 GMT+0530 (India Standard Time)

2.0

చిత్రం : 2.0

నటీనటులు: రజనికాంత్ - అమీ జాక్సన్ - అక్షయ్ కుమార్ - సుధాంశు పాండే - ఆదిల్ హుసేన్ - కళాభవన్ షాజాన్ - రియాజ్ ఖాన్
సంగీతం : ఏఆర్ రెహమాన్
ఛాయాగ్రహణం: నీరవ్ షా
ఎడిటింగ్ : అంటోనీ
నిర్మాణం : లైకా
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : శంకర్

సూపర్ స్టార్ రజనీకాంత్-శంకర్ ల కాంబో మీద క్రేజ్ కన్నా విజువల్ ఎఫెక్ట్స్ మీదే ఎక్కువ హైప్ తెచ్చుకున్న 2.0 కనీవినీ ఎరుగని స్థాయిలో రికార్డు స్క్రీన్లలో ఈ రోజు విడుదలైంది. ముందునుంచి దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి. రోబో సీక్వెల్ తో పాటు పూర్తిగా 3డిలో రూపొందించిన మూవీ కావడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. తమిళ్ లో కంటే తెలుగులోనే బాగా ఆడతాయని పేరు తెచ్చుకున్న శంకర్ సినిమాల బాటలోనే 2.0 కూడా ఇక్కడే పెద్ద విడుదలను దక్కించుకుంది. మరి ఊహకందని అంచనాలతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన 2.0 వాటిని నిలబెట్టుకుందో లేదో రివ్యూలో చూద్దాం పదండి

కథ :

చెన్నై నగరంలో హఠాత్తుగా అందరి చేతుల్లో సెల్ ఫోన్లు మాయమవడం మొదలవుతుంది. కారణం ప్రభుత్వానికి అంతు చిక్కదు. ఈ లోపు మొబైల్ షో రూమ్ ఓనర్ ఓ కంపెనీ సీఈఓ మినిస్టర్లు ఆ అదృశ్య శక్తి ద్వారా  హత్య చేయబడతారు.దాన్ని పట్టుకోవడానికి సైంటిస్ట్ వసీకరన్(రజనీకాంత్)సహాయం కోరుతుంది గవర్నమెంట్. తన అసిస్టెంట్ హ్యూమనాయిడ్  రోబో వెన్నెల(అమీ జాక్సన్)సహయంతో డిస్ మ్యాన్టిల్ చేసిన చిట్టి(రజనీకాంత్)కి తిరిగి ప్రాణం పోస్తాడు వసీకరన్. చిట్టి సహయంతో ఇదంతా గతంలో ఉరి వేసుకుని చనిపోయిన పక్షి రాజు(అక్షయ్ కుమార్)చేస్తున్నాడని తెలుస్తుంది తెలివిగా వేసిన స్కెచ్ వల్ల చిట్టి చనిపోయి వశీకరన్ శరీరంలో పక్షిరాజు ప్రవేశించి కుట్రలు చేయడం మొదలు పెడతాడు. అప్పుడు జరుగుతున్న విధ్వంసం ఆపడం కోసం 2.0(రజనికాంత్)బయటికి వస్తాడు. దాని తర్వాత 2.0కు పక్షి రాజు మధ్య భీకర యుద్ధంతో కథ కొత్త మలుపు తీసుకుంటుంది.

కథనం - విశ్లేషణ:

రోబో మొదటి భాగం కేవలం గ్రాఫిక్స్ వల్ల అంత పెద్ద విజయం సాధించలేదు. సాంకేతిక విప్లవానికి సరైన లక్ష్యం దిశా నిర్దేశనం లేనప్పుడు ఏం జరుగుతుంది అనే పాయింట్ చుట్టూ దర్శకుడు శంకర్ అందులో అన్ని అంశాలు ఉండేలా చూసుకున్నాడు. కామెడీ - లవ్ - రొమాన్స్ - యాక్షన్ - ఎమోషన్స్ - సెంటిమెంట్ ఇలా ఒకటేమిటి నవరసాలు నింపి మూడు గంటల సేపు మాయ ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. దీంతో 2.0లో అంతకు మించి ప్రేక్షకులు ఆశించడం సహజం. కానీ శంకర్ ఈసారి విజువల్ మాయాజాలంలో పడిపోయి ఈ దినుసులన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోవడం మాత్రం మిస్ అయ్యింది. అసలు మళ్ళి ఇలాంటి ఎఫెక్ట్స్ చూస్తామా అనే రేంజ్ లో అత్యున్నత సాంకేతిక ప్రతిభ అడుగడుగునా కనిపించినప్పటికీ ఎక్కడో చిన్న థ్రెడ్ మిస్ అయిన ఫీలింగ్ మధ్యమధ్యలో కలుగుతూనే ఉంటుంది. ఎంత వద్దన్నా రోబో సీక్వెల్ కాబట్టి పోలిక రావడం సహజం. 2.0 ఇక్కడే కొంత నిరాశ చెందే ఛాన్స్ ఇచ్చింది.

టేకాఫ్ లో సెల్ ఫోన్స్ అన్ని ఒక వరదలా ముంచుకురావడం ఒక్కొక్కరిని చంపడం లాంటి సీన్స్ లో గ్రాఫిక్స్ మాములుగానే అనిపిస్తాయి. మొదటి సారి చిట్టి భారీ పిచ్చుక రూపంలో ఉన్న పక్షి రాజుతో ఫైట్ మాత్రం అలాగే కళ్ళప్పగించి చూసేలా అనిపిస్తుంది. ఏదేమైనా ప్రమోషన్ లో శంకర్ చెప్పినట్టుగా గ్రాఫిక్స్ క్వాలిటీ విషయంలో తాను పూర్తి సంతృప్తి చెందలేదు అన్న మాట కొన్ని సీన్స్ లో నిజమే అనిపిస్తుంది. కాకపోతే స్టొరీ పరంగా ప్రతి సారి రోబో మేజిక్ రిపీట్ చేయడం సాద్యం కాదు కాబట్టి విడిగా శంకర్ ప్యాషన్ కి మాత్రం సెల్యూట్ చేయోచ్చు. టెక్నాలజి ఆధారంగా చేసుకునే ఇలాంటి కథల్లో ఒక చిక్కు ఉంటుంది.భారతీయ ప్రేక్షకులు హాలీవుడ్ సినిమాలను ఎంత ఎంజాయ్ చేసినా స్పైడర్ మ్యాన్ లాంటి పాత్రల మీద ఎంత అభిమానం చూపించినా దానికి చాలా పరిమితులు ఉంటాయి. అలా కాదని అలాంటి పాత్రల్లో మన హీరోలే కనిపిస్తే  మనవాళ్ళు వాటిని పూర్తిగా చెరిపేసుకుని అంచనాలు పెంచేసుకుంటారు. రాకేశ్ రోషన్ ఈ వాస్తవాన్ని గుర్తించే రాసుకున్నాడు కాబట్టి హృతిక్ రోషన్ మూడు భాగాలు సూపర్ హిట్ అయ్యాయి.

 2.0 అదే కోవలోకి వెళ్లేందుకు అన్ని రకాల వనరులు అంత కంటే ఎక్కువ  సమకూర్చుకుంది కానీ వంటకం కాస్త ఉప్పు తక్కువైనట్టు ఇందులో  ఎమోషన్ మిస్ అయ్యింది. హీరొయిన్ బదులు రోబో రూపంలో అమీని సెట్ చేయడం పాటలు కామెడీ ఎంటర్ టైన్మెంట్ లోపించడం ఇవన్ని సాధారణ ప్రేక్షకులకు 2.0ని పూర్తిగా కనెక్ట్ కాకుండా అడ్డుపడతాయి. ఇలాంటివి ఇందులో ఆశించకూడదు అనే లాజిక్ ఇక్కడ కూడదు. ఇవన్ని రోబోలో ఉన్నాయి కాబట్టి ఇందులో కోరుకోవడం తప్పేమీ కాదు. అసలు పక్షిరాజు ఆత్మ పక్షుల ఆత్మలతో జత కూడి అంత శక్తిమంతంగా ఎలా మారింది అనేది లాజిక్ కి దూరంగా ఉంది. ఇలాంటి సినిమాల్లో అలాంటివి వెతకకూడదు కాని ప్రేక్షకుడు ఆలోచించకుండ ఉండలేడు కదా. ఏదేమైనా శంకర్ మూడేళ్ళ కృషికి హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.

నటీనటులు:

రజినీకాంత్ ఇమేజ్ చట్రం నుంచి బయటికి వచ్చి మాస్ ఫార్ములాకు భిన్నంగా రోబో ఒప్పుకున్నప్పుడు ఎంత వరకు మెప్పించగలుగుతారు అనే దాని మీద కలిగిన అనుమానాలను తన అద్భుతమైన నటనతో దూదిపింజెలా నలిపి పారేశారు. ఇది దానికి ఎక్స్ టెన్షనే తప్ప పాత్ర పరంగా మరీ తేడా అయితే కనిపించదు.ఇంత వయసులోనూ అంత శ్రమను ఓర్చుకుని కష్టపడిన తీరుకి హాట్స్ ఆఫ్ అనే మాట చిన్నదే. వశీకరన్ కంటే రెండు పాత్రల చిట్టిగా మొత్తం వన్ మ్యాన్ షో చేసాడు రజని. గ్రీన్ మ్యాట్ ను ఊహించుకుంటూ తమ చుట్టూ లేని దాన్ని కనిపించని దాన్ని ఊహల్లోనే పునఃసృష్టి చేయాల్సి రావడం అంత సులభం కాదు. ఒకటి రెండు సీన్లు అయితే అదేమంత సమస్యగా అనిపించదు కానీ సినిమా మొత్తం అదే ఫార్మాట్ లో ఉన్నప్పుడు ఆర్టిస్టుల ఇబ్బంది మాములుగా ఉండదు. అందులోనూ 60 ఏళ్ళ వయసు దాటిన రజని లాంటి వాళ్లకు మరీ కష్టం. అయినా కూడా ఇంత ఈజ్ తో మెప్పించడం తలైవాకే చెల్లింది. రజనిని తప్ప చిట్టిగా ఇంకెవరిని ఊహించుకోలేను అన్న శంకర్ మాటకు పూర్తి న్యాయం జరిగింది. అసలు కొన్ని సన్నివేశాల్లో రజని నటన చూస్తే నిజంగా ఇంత ఎనర్జీతో చేసారా లేక గ్రాఫిక్స్ తో మేనేజ్ చేసారా అనేంత అద్భుతంగా చేశారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి 2.0గా మినీ రోబోగా రజని సింప్లీ సూపర్బ్.

ఇక పక్షిరాజు అక్షయ్ కుమార్ విలనీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మేకప్ కోసమే కఠోరమైన శ్రమ పడ్డ అక్షయ్ దీని కోసం శారీరకంగా మానసికంగా పడిన కష్టం మేకింగ్ వీడియోస్ లోనే కాదు తెరమీద కూడా కనిపిస్తుంది. కాకపోతే కొన్ని సన్నివేశాల్లో మేకప్ మరీ ఓవర్ గా చేసినట్టు అనిపించడంతో అక్షయ్ చాలా నిజాయితీగా ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ అందులో కప్పబడిపోయాయి. అంత వికృతంగా అవసరం లేదేమో అనిపించినా లోక వినాశనం కోరే పాత్ర కాబట్టి ఆ మాత్రం తప్పదని ఒప్పిస్తాడు శంకర్. దాని కన్నా ఫ్లాష్ బ్యాక్ లో పక్షుల బాగు కోసం తపించిపోయే వృద్ధుడిగా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అసలు ఈ పాత్రను స్టార్ ఒప్పుకోవడమే సాహసం. అమీ జాక్సన్ నుంచి గ్లామర్ పరంగా  ఆశించకూడదు. తనదీ రోబో పాత్రే కాబట్టి స్కిన్ షో కు ఛాన్స్ దక్కలేదు. ఐలో ఒలకబోసిన మోతాదులో సగం కూడా డిమాండ్ చేసే పాత్ర కాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతారు. వీళ్ళు కాకుండా సినిమాలో గుర్తుండేలా ఏ ఆర్టిస్టు కనిపించరు. రోబో విలన్ డానీ కొడుకు(సుధాంశు పాండే)గా ఓ పాత్రను పెట్టారు కానీ కథనంలోని బలహీనత వల్ల తేలిపోయింది. రోబో తరహాలో సెపరేట్ గా కామెడీ బ్యాచ్ అంటూ ఏదీ లేదు.

సాంకేతిక వర్గం:

తన ప్రతి సినిమాలోనూ అంతర్లీనంగా బలమైన సందేశం ఇస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్ ని పర్ఫెక్ట్ మిక్స్ చేసుకునే శంకర్ ఇందులో మాత్రం కొంత తడబడ్డాడు అని చెప్పక తప్పదు. పక్షులు అంతరించిపోవడం వల్ల మానవాళికి ఎంత ప్రమాదమో హెచ్చరించే పాయింట్ లో మంచి వెయిట్ ఉంది. కాని దాన్ని కాస్త పక్కకు ఏమార్చి పక్షి రాజు మనుషుల మీద ప్రతీకారం తీర్చుకోవడం తప్ప ఇంకే పరిష్కారం లేదు అనేలా కథనం రాసుకోవడంతో ప్రేక్షకులకు కావల్సినంత థ్రిల్ ఇవ్వడంలో కొంత తడబాటు జరిగింది. తనలోని బెస్ట్ టెక్నీషియన్ ని శంకర్ ఇందులో మరోసారి ఆవిష్కరించాడు. అందులో సందేహం లేదు. హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే చూసే టాప్ మేకింగ్ ని తనదైన శైలిని ఇండియన్ స్క్రీన్ మీద ఆవిష్కరించాడు. బాహుబలి అయినా రోబో అయినా విజువల్స్ తో పాటు ఎమోషన్స్ విజయంలో చాలా కీలక పాత్ర పోషించాయి. ఇందులో అవి మిస్ అయిన ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. రోబోలో చూసిన హాస్పిటల్ డెలివరీ సీన్-ఫైర్ యాక్సిడెంట్ ఎపిసోడ్ లాంటివి ఇందులో లేకపోవడంతో ఎంతసేపూ పక్షిరాజు రాక్షస ప్రవర్తన తప్ప అతనిలో సదుద్దేశం ప్రేక్షకుల మెదళ్లలోకి ఎక్కదు. కథలో టెంపో లేదే అనే ఫీలింగ్  కలిగిస్తాడు శంకర్. ఆయన మీద గౌరవం కొన్ని లోపాలను ఒప్పుకోనివ్వదు కాని విడిగా చూస్తే మాత్రం 2.0 సగటు గ్రాఫిక్ మూవీలా అనిపించినా ఆశ్చర్యం లేదు.

అయినా శంకర్ కు దర్శకత్వ పాఠాలు నేర్పడం అంటే గుర్రానికి నడక నేర్పడం లాంటిది. తన సినిమాల్లో ఏదో ఒక సోషల్ మెసేజ్ తప్పకుండా ఉండేలా చూసుకునే శంకర్ ఇందులో కూడా మంచి పాయింట్ తీసుకున్నాడు. కాకపోతే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే బ్లాక్ ఏదీ లేకపోవడంతో ఏదో హాలీవుడ్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో ప్రీ ఇంటర్వెల్ దాకా కథ ముందుకు వెళ్ళకపోవడం కొంత మైనస్ అయ్యింది. సెల్ ఫోన్స్ మాయం కావడానికి అదృశ్య రూపంలో పక్షిరాజుకి బిల్డప్ ఇచ్చే సీన్స్ చాలా సేపు సాగదీసినట్టు అనిపిస్తుంది. స్థూలంగా చూస్తే 2.0-పక్షిరాజు మధ్య పోరాటం తప్ప ఇందులో కథేమీ లేదు. కాకపోతే ఇంత గ్రాండియర్ స్కేల్ మీద హాలీవుడ్ స్థాయిలో గ్రాఫిక్స్ ప్రెజెంట్ చేయాలన్న శంకర్ తపన మెచ్చదగినదే కానీ ఫస్ట్ పార్ట్ లాగా ఎమోషన్స్ కూడా సరైన పాళ్ళలో మిక్స్ చేసుకుని ఉంటె దీని రేంజ్ వేరుగా ఉండేది .

ఏఆర్ రెహమాన్ సంగీతంలో విశేషమంతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లోనే ఉంది. ఉన్న రెండు పాటల్లో ఒకటి ఎండ్ టైటిల్ కార్డ్స్ లో వస్తుంది కాబట్టి దాని గురించి చెప్పడానికి ఏమి లేదు. ఇక రెండో పాట అక్షయ్ కుమార్ ఫ్లాష్ బ్యాక్ లో పాథోస్ గా వస్తుంది కనక అదీ ప్రత్యేకంగా ప్రస్తావించదగినది కాదు. సో తన పనితనం మొత్తం బిజిఏంలోనే చూపించారు రెహమాన్. మెయిన్ ట్రాక్ ని రోబోదే రిపీట్ చేసినప్పటికీ దీనికి ప్రత్యేకంగా సౌండ్ ని సెట్ చేయడంలో రసూల్ పూకుట్టి పనితనం చాలా కనిపిస్తుంది. నీరవ్ షా కెమెరా పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. క్లైమాక్స్ ని చిత్రీకరించిన తీరు నభూతో అని చెప్పొచ్చు. రియాలిటీ కంటే గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండే క్లైమాక్స్ లో ఆయన పనితనాన్ని చూడొచ్చు. ఫైట్లు అదిరిపోయాయి. అంటోనీ ఎడిటింగ్ చాలా క్రిస్పిగా ఉంది. పాటలు లేకుండా రెండున్నర గంటల్లో విసుగు రాకుండా లాగించేసాడు. లైకా నిర్మాణ విలువలు మరీ ఆరు వందల కోట్లు అయ్యాయా అనిపించేలా ఉన్నా యాక్షన్ ఎపిసోడ్లలో మాత్రం పైసా పైసా తెరమీద కనిపిస్తుంది

రోబో సీక్వెల్ అనే ప్రచారంతో పాటు హీరోతో సహా సెటప్ మొత్తం దానినే పోలి ఉండటంతో 2.0 మీద హైప్ కు తగ్గట్టు ప్రేక్షకులు విపరీతమైన అంచనాలు పెట్టుకుని రావడం సహజం. 2.0 దాన్ని మరిపించేలా ఉండాలని కోరుకోవడమూ తప్పు కాదు. ఆ కోణంలో చూస్తే 2.0 హాఫ్ మీల్స్ తిన్న ఫీలింగే కలిగిస్తుంది. కాని టెక్నాలజీ బడ్జెట్ పరంగా చాలా పరిమితులు ఉండే భారతీయ సినిమాలో ఇలాంటి ప్రయత్నం ముమ్మాటికి మెచ్చుకోదగినదే. వాటి కోసమే చూస్తే కనక 2.0 అప్ గ్రేడేడ్ వెర్షన్ గా వచ్చిన ఈ చిట్టి నిరాశ పరచడు. అరుదైన ప్రయత్నానికి సాటిస్ ఫ్యాక్షన్ తో సంబంధం లేకుండా ప్రేక్షకుల అండదండలు అవసరం

చివరిగా -  టెక్నికల్లీ బ్రిలియంట్ - ఎమోషన్స్ వీక్

రేటింగ్ : 2.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
   

LATEST NEWS