మద్యం మత్తులో ఉన్న భార్య.. భర్త మాటలకు గొడ్డలికి పని చెప్పింది!
సాధారణంగా భర్తలకు ఉన్న తాగుడు అలవాటు వల్ల భార్యలు ఇబ్బంది పడుతున్నారనే ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే!
By: Raja Ch | 26 Dec 2025 11:18 PM ISTసాధారణంగా భర్తలకు ఉన్న తాగుడు అలవాటు వల్ల భార్యలు ఇబ్బంది పడుతున్నారనే ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే! తన భర్త తాగి వచ్చి తనను తొడుతున్నాడని, కొడుతున్నాడని చాలా మంది భార్యలు ఫిర్యాదు చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా దీనికి పూర్తి రివర్స్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. తాగి ఇంటికి వచ్చిన భార్యను భర్త ప్రశ్నించగా.. ఆమె గొడ్డలికి పని చెప్పింది!
అవును.. మీరు చదివింది నిజమే! కాలం మారిందని సరిపెట్టుకున్నా.. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అనే పాటను గుర్తు తెచ్చుకున్నా.. తాజాగా జరిగిన ఘటన సంచలనంగా మారింది. ఇందులో భాగంగా... ఫుల్ గా తాగి ఇంటికి వచ్చిన భార్యను చూసిన భర్త... ఇలా నువ్వు తాగి ఇంటికి వస్తే, వంట ఎవరు చేస్తారు అని ప్రశ్నించడంతో.. అతని లైఫ్ అక్కడితో ముగిసింది!
వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో గల బితూర్ లో నివశించే బిటోలా దేవికి పెద్ద కుమారుడు రవిశంకర్ ఉన్నాడు. అతనికి 2019లో వివాహమవ్వగా.. తన భార్య వీరాంగన, ఇద్దరు పిల్లలతో కలిసి విడిగా నివసిస్తున్నాడు. మరోవైపు అతని తల్లి బిటోలా దేవి మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి విడిగా నివసిస్తుంది.
ఈ క్రమంలో... బుధవారం నాడు తన కోడలు వీరాంగన, పాంకిలోని తన సోదరీమణుల ఇంటికి వెళ్లిందని బిటోలా చెప్పింది. ఆమె అక్కడి నుండి తాగి ఇంటికి తిరిగి వచ్చింది. ఈ సమయంలో కొడుకు రవిశంకర్.. ఆమె తాగుడును వ్యతిరేకిస్తూ.. "నువ్వు పిల్లలను ఇంట్లో వదిలి నీ సోదరీమణుల ఇంటికి వెళ్ళావు.. నువ్వు తాగి తిరిగి వచ్చావు.. ఇంట్లో ఎవరు వంట చేస్తారు..?" అని ప్రశ్నించాడు.
ఈ సమయంలో భార్యాభర్తల మధ్యా వాగ్వాదం మొదలైంది. దీంతో ఇంట్లో ఉంచిన గొడ్డలితో తన భర్తపై దాడి చేయడం ప్రారంభించింది వీరాంగన. ఈ సమయంలో ఆమె అతనిపై గొడ్డలితో పదే పదే నరికింది. దీంతో.. అతను నేలపై పడిపోయాడు. ఆ గదంతా రక్తం చిమ్మింది. ఈ సమయంలో.. తన భర్త ప్రమాదంలో ఉన్నాడని అత్తగారు బిటోలా దేవికి చెప్పింది ఈ కోడలు.
దీంతో.. హుటాహుటున పెద్ద కొడుకు నివాసం వద్దకు వచ్చిన బిటోలా దేవి, ఇతర కుటుంబ సభ్యులు.. రవిశంకర్ ను హుటాహుటున ఆస్పత్రికి తరలించారు. ఈ సమయంలో అక్కడ చికిత్స పొందుతూ రవిశంకర్ మరణించాడు. ఇంతలో అత్తగారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కోడలు నేలపై ఉన్న రక్తాన్ని శుభ్రం చేస్తూ కనిపించడంతో.. పోలీసులకు సమాచారం అందించింది.
దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. తన భర్తకు ప్రమాదం జరిగిందని, బయట ఏదో జరిగిందని వీరాంగన బొంకే ప్రయత్నం చేసిందంట. అయితే.. అతడు బయట నుంచే గాయాలతో ఇంటికి వస్తే గుమ్మం ముందు కూడా రక్తం కనిపించేది కానీ.. బ్లడ్ ఇంట్లో మాత్రమే కనిపించింది.. గదంతా చిమ్మింది. దీంతో.. పోలీసులు కాస్త గట్టిగా విచారించడంతో అసలు నిజం బయటకు వచ్చింది.
