Begin typing your search above and press return to search.

కాలానికి కామా లేదు...ప్రేమా లేదు !

అలాంటి కాలాన్ని కొలిచే పని చేసినా గుడికి వెళ్ళి కొలవాలని చూసినా అంతకంటే మూర్ఖత్వం లేదు. కాలం ఎవరి కోసం ఆగదు, తన పని తాను చేసుకుంటూ పోతుంది.

By:  Satya P   |   1 Jan 2026 7:00 PM IST
కాలానికి కామా లేదు...ప్రేమా లేదు !
X

కాలం అనంతరం. అనిర్వచనీయం. రూపం లేనిది పరుగు తప్ప మరొకటిది తెలియనిది. ఆ కాల ప్రవాహంలో మాన జీవితం అతి చిన్న అల కూడా కాదు, కాలానికి ముందూ వెనకా చూస్తే అంతూ పొంతూ లేదు. అలాంటి కాలాన్ని కొలిచే పని చేసినా గుడికి వెళ్ళి కొలవాలని చూసినా అంతకంటే మూర్ఖత్వం లేదు. కాలం ఎవరి కోసం ఆగదు, తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఆదీ అంతం లేని కాల గమనంలో మనిషి చాలా అల్ప జీవి అని చెప్పాలి. అలాంటి మనిషి తన ఆలోచనలతో కాలానికి రూపం వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. కాలాన్ని కట్టిపడేయాలని ఆరాటపడుతున్నాడు. క్యాలెండర్ గా మార్చి ఏర్చి కూర్చి గోడకు తగిలించి తన చుట్టూ తిప్పుకోవాలని చూస్తున్నాడు. కానీ అది జరిగే పనేనా అంటే జవాబు అందరికీ తెలిసిందే.

కాలాన్ని నమ్ముకుంటూ :

ముందే చెప్పినట్లుగా కాలాన్ని నమ్ముకుంటూ సాగే మనిషి ఎపుడూ ఎక్కడా బాగుపడినట్లుగా చరిత్రలో లేదు. అసలు కాలాన్ని నమ్ముకోమని ఎవరు చెప్పారో కానీ మనిషి ఆ వైపే చూస్తూ బతకడం అలవాటు చేసుకున్నాడు. కాలం కలిసి రావడం లేదని తన నిస్సహాయతకు చేతకాని తనానికి పేర్లు పెట్టుకుని నెట్టుకుని రావాలని కూడా చూస్తున్నాడు. కాలం ఊసు అసలు ఎందుకు, నీ పని నీవు చేయి ఫలితం అదే వస్తుంది. నీ జీవితం ఎంతకాలం అంతవరకూ నీవు ఈ జీవితంలో ఏదో ఒకటి సాధించాలని భావించడమే ఉత్తమమైన లక్షణం. అలా కాకుండా కాలమే తనను ఏదో చేస్తుందని నమ్మిన వాడు మాత్రం ఆ కాల ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నట్లే లెక్క.

అన్నింటికీ అతీతం :

మంచి కాలం చెడ్డ కాలం అనేది అసలు ఉండదు, కాలం ఎపుడూ కాలమే. దానికి ఒకరి మీద అపేక్ష కానీ మరొకరి మీద వివక్ష కానీ ఉండదు, ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. మనిషి ఎలా ఉండాలి అంటే అచ్చం కాలం లాగా అని. ఎందుకంటే దానికి ఏ పట్టింపు లేదు, విరామం లేదు, విసుగు లేదు, తన పని తాను చేసుకుంటూ పోతుంది. పైగా వెనక చూపే లేదు, ఎపుడూ ముందుకే చూస్తూ వడివడిగా సాగిపోతుంది. అలాంటి కాలానికి రంగు రుచి వాసన ఉంటాయనుకుని మనిషి పొరబడుతున్నాడు, భ్రమపడుతున్నాడు. అవన్నీ నిజాలు అనుకుని తనను తాను మరచిపోతున్నాడు.

లక్ష్యం పెట్టుకోవాలి :

కొత్త క్యాలెండర్ బాగుంటుంది. రంగులు అదిరిపోతాయి. మంచి ఫోటోలు ఉంటే ఇంకా బాగా ఉంటుంది. దానిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఫలితం ఏముంది. అందులో రోజులు అలా గడిచిపోతూనే ఉంటాయి. ఇక న్యూ ఇయర్ అని ఎన్నో మోసుకొస్తుందని తనను అందలాలు ఎక్కిస్తుందని ఆశలు పడడం కంటే అమాయకత్వం మరోటి ఉండదు. ఎందుకంటే కాలం నీతోనే లేదు, నీకోసమే రాలేదు, నీ ఒక్కరిని ఉద్ధరించడానికే లేదు. ఈ విషయాన్ని తెలుసుకుని తాను చేయాల్సింది ఏంటో గ్రహించాలి. అపుడు కొత్త పాత రోత ఏవీ ఉండవు. అంతా టార్గెట్ మీదనే ఉంటుంది.

విజయాలు అపుడే :

సక్సెస్ ఎవరికి అయినా ఊరకే రాదు, దాని కోసం ఎంతో పరిశ్రమించాలి. పట్టుదల పట్టాలి. గట్టి సంకల్పం ఉండాలి. ఒక తపస్సులా పూర్తి ఏకాగ్రతతో పనిచేయాలి. అపుడే ఘన విజయం దక్కుతుంది. కసి కృషి కలిస్తేనే జయం లభిస్తుంది అన్నది పెద్దల మాట. అందువల్ల కాలానికి గేలం వేయాలనుకుని అతి తెలివి చూపిస్తే అక్కడే ఆగిపోతావు. టైమ్ తో గేమ్ ఆడాలనుకుంటే ఎక్కడికీ కదలకుండా ఉండిపోతావు. సో నీవేంటో తెలుసుకో. నీ శక్తిని పూర్తిగా వినియోగిస్తూ నీవు అనుకున్న రంగంలో విజయాలు నమోదు చేసుకో. అపుడు అనంత కాలంలో నీవు అనే అల కూడా ఎంతో కొంత ఉనికిలో ఉంటావు.