Begin typing your search above and press return to search.

టీవీ చూస్తూ సెల్ ఫోన్ స్క్రోల్ చేస్తున్నారా .. అయితే ఇది చ‌ద‌వండి

టెక్నాల‌జీ ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. మాన‌వ జీవితాన్ని సులువుగా, సౌక‌ర్య‌వంతంగా మార్చింది. ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఆజ్యం పోసింది. కానీ మాన‌వ జీవ‌న విధానంలో మాత్రం స‌మ‌స్య‌ల‌ను సృష్టించింది.

By:  A.N.Kumar   |   8 Feb 2026 1:00 AM IST
టీవీ చూస్తూ సెల్ ఫోన్ స్క్రోల్ చేస్తున్నారా .. అయితే ఇది చ‌ద‌వండి
X

టెక్నాల‌జీ ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. మాన‌వ జీవితాన్ని సులువుగా, సౌక‌ర్య‌వంతంగా మార్చింది. ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఆజ్యం పోసింది. కానీ మాన‌వ జీవ‌న విధానంలో మాత్రం స‌మ‌స్య‌ల‌ను సృష్టించింది. అవి చూడ‌టానికి చిన్న‌విగానే ఉంటాయి. ప్ర‌భావం మాత్రం తీవ్రంగా ఉంటుంది. మ‌నిషి న‌డ‌వ‌డిక‌లో మార్పులు వ‌చ్చాయి. ఫోక‌స్ పై ప్ర‌భావం చూపాయి. ఒక‌ప్పుడు కంప‌ల్స‌రీగా మారిన అంశాలు .. ఇప్పుడు ఆప్ష‌న‌ల్ గా మారాయి.

సెల్ ఫోన్ ప్రపంచం

టీవీ రావ‌డం విప్ల‌వాత్మ‌క మార్పు. రేడియో, న్యూస్ పేప‌ర్ కు ప‌రిమిత‌మైన రోజుల‌ను టీవీ మార్చేసింది. జీవితాల్లో కీల‌క భాగ‌స్వామి అయింది. టీవీ లేకుంటే బ‌త‌కడం ఎలా అన్న స్థాయికి మ‌నిషిని తీసుకెళ్లింది. అలా ఓ ద‌శాబ్ధం టీవీతో సంసారం చేస్తుండ‌గా.. కంప్యూట‌ర్, ఇంట‌ర్నెట్ వ‌చ్చింది. ఇది టీవీకి తాత. ఆ త‌ర్వాత సెల్ ఫోన్. సోష‌ల్ మీడియా. టెక్నాల‌జీలో వచ్చిన మార్పులు మాన‌వ జీవితాన్ని చుట్టేశాయి. అవి లేకుండా బ‌త‌క‌లేని స్థాయికి తీసుకెళ్లాయి. దీంతో మ‌నిషి బిహేవియ‌ర్ మారిపోయింది. మ‌నిషితో మాట్లాడ‌టం మనిషి మానేశాడు. సెల్ ఫోన్, కంప్యూట‌ర్ తో కాలం గ‌డిపేస్తున్నాడు. ఎప్పుడో సెల్ ఫోన్ వ‌ల్ల తీర‌ని స‌మ‌స్య ఉంటేనే.. మ‌నిషి మ‌నిషి క‌లిసి మాట్లాడుతున్నారు. లేదంటే సెల్ ఫోనే స‌మ‌స్య‌ల‌న్నింటికి ప‌రిష్కారం వెతికే సాధనం. ఏ స‌మ‌స్య వ‌చ్చినా ఫ‌స్ట్ గూగుల్ లో వెత‌కడం. ఓ అంచ‌నాకు రావ‌డం. అప్ప‌టికీ తీర‌క‌పోతే.. నిపుణుల‌ను సంప్ర‌దించ‌డం. ఇది ఇప్పుడున్న మాన‌వ జీవ‌నం.

సెకండ్ స్క్రీన్ వీవింగ్

టీవీ, సెల్ ఫోన్ ఇవి రెండు వేర్వేరు సాధ‌నాలు. వీటి వినియోగం పీక్ లెవెల్ చేరాక‌.. ఆ రెండింటి మధ్య మ‌నిషి ..దేనిని చూడాలో స్ప‌ష్ట‌త కోల్పోతున్నాడు. ఒక్కోసారి ఒకే స‌మ‌యంలో రెండూ చూడ‌టానికి ప్ర‌య‌త్నిస్తాడు. లేదా రెండింటిలో ఒక‌టి అలా చూస్తూ.. ఇలా ఇంకోటి స్క్రోల్ చేస్తున్నాడు. రెండింటిపై శ్ర‌ద్ధ పెట్ట‌లేక‌పోతున్నాడు. దీనినే సెకండ్ స్క్రీన్ వీవింగ్ అంటున్నారు. సెల్ ఫోన్ కున్న అడ్వాంటేజ్ టీవీకి లేదు. కాబ‌ట్టి టీవీ బ్యాగ్రౌండ్ నాయిస్ గా మారింది. సెల్ ఫోన్ లో ఎప్పుడంటే అప్పుడు ఆపొచ్చు. చూడొచ్చు. మ‌ధ్య‌లో వెళ్లిపోవ‌చ్చు. మ‌ళ్లీ చూడొచ్చు. కానీ టీవీ అలా కాదు. దానికో టైం ఉంటుంది. ఆ టైం మిస్ అయితే మ‌ళ్లీ చూడాలంటే చాలా వెయిట్ చేయాల్సి వ‌చ్చేది గ‌తంలో. కానీ సెల్ ఫోన్, యూట్యూబ్, డిజిట‌ల్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్స్ వ‌చ్చాక టీవీతో ప‌నిలేకుండా పోయింది. టీవీ చూస్తూ సెల్ ఫోన్ స్క్రోల్ చేయ‌డాన్ని సెకండ్ స్క్రీన్ వీవింగ్ అని పేరు పెట్టారు కానీ సెల్ ఫోన్ చూస్తూ చాలా పనులు చేసేస్తున్నాం. ఏ ప‌ని పైనా ఏకాగ్ర‌త లేదు. దృష్టి లేదు. అన్నింటిలోనూ సెకండ్ స్రీనింగ్ వీవింగే క‌నిపిస్తుంది. దీని వ‌ల్ల ఫోక‌స్ దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. భ‌విష్య‌త్తులో ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాలి.