'స్వెట్ డేటింగ్'.. ఇప్పుడు కొత్త ట్రెండ్.. ప్రేమకు చెమట పరీక్ష!
లవర్స్ జిమ్ బాట పట్టడంతో జిమ్ ఓనర్ల పంట పండింది. మార్కెట్లోకి అప్పుడే కొత్త బిజినెస్ ప్యాకేజీలు వచ్చేసాయి.
By: A.N.Kumar | 25 Jun 2026 1:00 AM ISTఒకప్పుడు ప్రేమంటే గులాబీ పువ్వులు.. గిటార్ వాయిద్యాలు, సినిమా థియేటర్‌లో పాప్‌కార్న్ షేరింగ్‌లు ఉండేవి. ఆ తర్వాత కాలంలో "రెస్టారెంట్‌లో బిల్లు ఎవరు కడతారు?" అనే చిన్నపాటి ఐక్యూ టెస్టులు నడిచాయి. కానీ ఇవన్నీ ఇప్పుడు ఔట్‌డేటెడ్ బోరింగ్ ముచ్చట్లు!
కొత్త తరం జెన్ జెడ్ డేటింగ్ ప్రపంచంలోకి ఒక సరికొత్త వైరస్... సారీ, వైరల్ ట్రెండ్ వచ్చింది. దాని పేరే "స్వెట్ డేటింగ్". అంటే ప్రేమకు ఇప్పుడు చెమట పరీక్ష అన్నమాట.. "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అనేది పక్కన పెట్టు... ముందు ఆ ట్రెడ్‌మిల్‌పై 20 నిమిషాలు పరిగెత్తి నీ దమ్ము నిరూపించుకో " ఇదీ ఇప్పటి సరికొత్త లవ్ ఫార్ములా.
కాఫీ షాపులు బంద్... జిమ్‌లే లవ్ స్పాట్లు!
ఈ ట్రెండ్ పుణ్యమా అని ప్రేమికులు ఇప్పుడు కాఫీ షాపులకు వెళ్లడం మానేశారు. నేరుగా జిమ్‌లోనే వాలిపోతున్నారు. డంబెల్స్, బర్పీలు, స్క్వాట్స్ మధ్యే మనసులు కలసిపోతున్నాయి. మేకప్ లేకుండా, చెమటలు కక్కుతూ, ఊపిరి అందక నాలిక బయటపడేసిన స్థితిలో కూడా... ఎదుటి వ్యక్తిని చూసి మీరు ప్రేమగా నవ్వగలిగితే ఇక మీ ఇద్దరి మధ్య అంతకంటే బలమైన కెమిస్ట్రీ ప్రపంచంలోనే లేనట్టే!
సైకాలజిస్టుల వింత లాజిక్కులు!
దీనిపై మానసిక నిపుణులు కూడా తమదైన శైలిలో సీరియస్ రీసెర్చ్‌లు మొదలుపెట్టారు. కలిసి వర్కౌట్ చేస్తే ఒత్తిడి తగ్గుతుందట. కొత్త వ్యక్తిని కలిసినప్పుడు ఉండే టెన్షన్ కరిగిపోతుందట. అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే... బాగా అలసిపోయినప్పుడు మనుషులు అస్సలు నటించలేరు. ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్లు, ఫేక్ స్మైల్స్, "నేను చాలా క్లాస్ అండ్ కూల్" అనే ఓవర్ యాక్టింగులు అన్నీ ఆ చెమటతో పాటే కారిపోతాయి. ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడిపోతుంది.
ఈ స్వెట్ డేటింగ్‌పై నెటిజన్లు ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వేదికగా వదులుతున్న మీమ్స్ మామూలుగా లేవు. "మూడు డిన్నర్ డేట్లలో కూడా తెలియని పార్టనర్ గుణం... ఒక్క లెగ్ డే వర్కౌట్‌లో తెలిసిపోతుంది!" అని ఒకరు... "స్క్వాట్స్ చేయలేక మధ్యలోనే జిమ్ నుండి పారిపోతే... రిలేషన్‌షిప్ భవిష్యత్తు కూడా అదే స్పీడ్‌లో పారిపోతుంది" అని మరొకరు కామెంట్లు పెడుతున్నారు.
జిమ్ ఓనర్లకు పండగ... ట్రైనర్లకు తిప్పలు!
లవర్స్ జిమ్ బాట పట్టడంతో జిమ్ ఓనర్ల పంట పండింది. మార్కెట్లోకి అప్పుడే కొత్త బిజినెస్ ప్యాకేజీలు వచ్చేసాయి. "కపుల్స్ కార్డియో ప్యాకేజ్", "రోమాంటిక్ యోగా", "లవ్ లంజెస్", "హార్ట్‌బీట్ హిట్" అంటూ కొత్త ఆఫర్లు కూడా రెడీ అవుతున్నాయట. ఇక ట్రైనర్లు కూడా ఫిట్‌నెస్ కోచ్‌లా... రిలేషన్‌షిప్ కౌన్సిలర్లా అనే సందేహం వస్తోంది.
డేట్‌కి వెళ్లి భారీ వెయిట్లు ఎత్తే ముందు... ఆ రిలేషన్‌షిప్ బరువును మీరు భవిష్యత్తులో మోయగలరో లేదో ఒకసారి ఆలోచించుకోండి. లేదంటే గుండెల్లో ప్రేమ మొదలవ్వడం పక్కన పెడితే... ఒళ్లంతా కండరాల నొప్పులు మొదలవ్వడం మాత్రం ఖాయం!
ఏదేమైనా... కలిసి చెమటోడ్చిన జంటే... జీవితాన్ని కూడా కలిసి నడిపించగలదు అనే కొత్త సామెత పుట్టుకొచ్చింది. రేపు పొద్దున "సైలెంట్ డేటింగ్" , "స్లీప్ డేటింగ్" లాంటి ట్రెండ్లు వచ్చినా ఆశ్చర్యపోకండి. కాలం మారుతోంది, ట్రెండ్లు మారుతున్నాయి... కానీ ప్రేమ మాత్రం ప్రతి తరాన్ని తనదైన స్టైల్‌లో చెమటలు పట్టిస్తూనే ఉంది.
