Begin typing your search above and press return to search.

ఫ్రెండ్ తాగే సిగరెట్ మీ ప్రాణాలు తీస్తుంది బాస్

ఇదంతా ఒక ఎత్తు అయితే..సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కారణంగా జరిగే నష్టం ఊహకు అందనిది. ఇంతకూ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే ఏమిటంటారా?

By:  Garuda Media   |   4 Oct 2026 9:12 AM IST
ఫ్రెండ్ తాగే సిగరెట్ మీ ప్రాణాలు తీస్తుంది బాస్
X

సరదాసరదా సిగరెట్.. ఇది దొరలు తాగే సిగరెట్ అంటూ పాత కాలంలో మాగొప్పగా పాడే పాట విన్నంతనే ఒకసారి ట్రై చేద్దామా? అనిపిస్తుంది. అది గతకాలం నాటి మాట. ఇప్పుడు కాలం మారింది. తరం ఛేంజ్ అయ్యింది. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా సిగిరెట్ తాగటం ఒకజీవనశైలిగా మార్చేస్తున్నారు. అబ్బాయిలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో అమ్మాయిల్లోనూ సిగిరెట్ తాగే కల్చర్ మన దేశంలో పెరిగింది.

బాగా చదువుకొన్నవారు..కార్పొరేట్ లోని వారు సైతం స్టైల్ గా సిగరెట్ తాగే సీన్లు ఇప్పుడు కామన్ గా మారిపోయాయి. స్మోకింగ్ తో ఆరోగ్యం దెబ్బ తింటుందన్న విషయాన్ని పట్టించుకోని పరిస్థితి. వార్నింగ్ మెసేజ్ ఇస్తూనే అవసరం ఉన్నా లేకున్నాసినిమాల్లో కీలక పాత్రల చేత సిగరెట్ ను స్టైలీష్ గా తాగించటం ఒక ఎత్తు అయితే.. ఓటీటీ వెబ్ సిరీస్ లో ఇలాంటివి మరింత ఎక్కువగా కనిపిస్తుంటాయి.

ఈ ధూమపానం కారణంగా ప్రతి ఏడాది మన దేశంలో మరణిస్తున్న వారి సంఖ్య అక్షరాల 13.5 లక్షల మంది. ధూమపానం మాత్రమే కాదు నమిలే పొగాకుతోనూ ఇంత భారీగా ప్రాణాలు పోతున్నాయి. ఒక వ్యక్తి మరణిస్తే.. దాదాపు ఆ వ్యక్తి కుటుంబానికి చెందిన ఎంతోమంది ప్రభావితం అవుతారు. ఈ లెక్కన 13.5 లక్షల మంది అంటే.. అన్ని కుటుంబాలకు జరిగే నష్టం ఎంతన్నది ఆలోచిస్తే వణుకు ఖాయం.

ఈ షాకింగ్ నిజాల్నిటుబాకో ఫ్రీ ఇండియా సిటిజన్ ఫోరమ్ తో పాటు పలు ఆరోగ్య సంస్థలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలో నమిలే పొగాకు వాడే వారిలో అత్యధికం మన దేశంలోనే ఉన్నారు. దీని కారణంగా వచ్చే నోటి క్యాన్సర్లలో 90 శాతం కేవలం నమిలే పొగాకు ఉత్పత్తుల కారణంగానే వస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే పొగాకు కారణంగా వచ్చే రోగాలు.. వాటికి అయ్యే వైద్య ఖర్చులకారణంగా దెబ్బ తినే ఉత్పాదకత కారణంగా దేశం ఏటా నష్టపోయేది రూ.1.7లక్షల కోట్లు. ఈ మొత్తం ఎంత భారీ అన్నది ఒక ఉదాహరణతో చెప్పొచ్చు. ప్రతి ఏటా కేంద్రం సమర్పించే వార్షిక బడ్జెట్ లో ఆరోగ్య శాఖకు జరిపే కేటాయింపులకు ఈ మొత్తంమూడు రెట్లు ఉంటుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే..సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కారణంగా జరిగే నష్టం ఊహకు అందనిది. ఇంతకూ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే ఏమిటంటారా? ఎవరో సిగరెట్ తాగి వదిలే పొగను పీల్చటం ద్వారా ఎంతోమంది అమాయకులు బలి అవుతున్నారు. దీన్నే పాసివ్ స్మోకింగ్ అని కూడా అంటారు. సిగరెట్ పొగను అలా వదిలేసి.. దాన్ని తెలీకుండానే పీల్చేసే అమాయకులు రోగాన బారిన పడుతున్నారు. ఈ కారణంగా ఏటా మన దేశంలో మరణించే వారు 3.25 లక్షల మంది అన్న షాకింగ్ నిజాన్ని ల్యాన్సెట్ పబ్లిక్ హెల్త్ తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ భయంకర నిజం తెలీక.. ఎవరో సిగరెట్ తాగితే మనకు పోయేదేముందని చాలామంది భావిస్తారు. కానీ.. అదేమాత్రంనిజం కాదన్నది మర్చిపోకూడదు.

1990లో ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్ కారణంగా ఏటా చనిపోయే వారు 2.17 లక్షలు ఉంటే.. అదిప్పుడు యాభై శాతం పెరిగి ఏకంగా 3.25 లక్షలకు చేరింది. మన దేశంలో సుమారు 44.4 కోటల మంది ప్రజలు ఇళ్లు.. పని ప్రదేశాలు.. పబ్లిక్ స్థలాల్లో నిరంతరం ఉఫ్ మని ఊదే కారణంగా ఎంతోమంది రోగాల బారిన పడుతున్నారన్నది నిజం. ఇంట్లో పురుషులు తాగే పొగ కారణంగా ఇంట్లోని మహిళలు.. పిల్లలు ఎక్కువగా అనారోగ్యం పాలవుతారన్నది నిజం. మరో షాకింగ్ నిజం ఏమంటే.. ఈ పాసివ్ స్మోకింగ్ కారణంగా చనిపోయే వారిలో సుమారు 1.5 లక్షలమందిమహిళలే ఉండటం గమనార్హం.

నిజానికి సిగరెట్ తాగే వారి కంటే.. ఆ పొగను పీల్చే వారికే ప్రమాదం ఎక్కువ అన్న విషయం చాలామందికి తెలీదు. సిగరెట తాగే వారు ఫిల్టర్ ద్వారా పొగను పీల్చుకుంటారు. కానీ.. నోటి నుంచి విడుదలయ్యే సిగరెట్ పొగ గాల్లో ప్రయాణిస్తుంది. దానికి ఎలాంటి ఫిల్టర్ ఉండదు. దీంతో క్యాన్సర్ కుకారణమయ్యే ప్రమాదకర రసాయనాలు.. కార్బన్ మోనాక్సైడ్ లాంటి విషాలు ఈ పొగలో ఎక్కువగా ఉంటాయన్నది మర్చిపోకూడదు. మొత్తంగా చెప్పాలంటే ధూమపానం చేయటం ఎంత తప్పో.. ధూమపానం చేసే వారి పరిసరాల్లో ఉండటం అంతకు మించిన ఖరీదైన తప్పు.