Begin typing your search above and press return to search.

కాస్తా లౌక్యం నేర్చుకో బ్రో !

జీవితం అనేది అతి పెద్ద పాఠశాల. అది ఎన్నో నేర్పిస్తుంది. ప్రతీ సవాల్ ఒక పాఠం అయితే దానిని ఎదుర్కొంటూ ముందుకు సాగడమే మనమిచ్చే జవాబు.

By:  Satya P   |   26 Jan 2026 9:26 AM IST
కాస్తా లౌక్యం నేర్చుకో బ్రో !
X

జీవితం అనేది అతి పెద్ద పాఠశాల. అది ఎన్నో నేర్పిస్తుంది. ప్రతీ సవాల్ ఒక పాఠం అయితే దానిని ఎదుర్కొంటూ ముందుకు సాగడమే మనమిచ్చే జవాబు. జీవితంలో ప్రతీ వారికీ ఎన్నో సవాళ్ళూ సమస్యలు ఉంటాయి. కాలు తడపకుండా సాగర ప్రయాణం, కన్నీరు పెట్టకుండా జీవన ప్రయాణం సాగదని పెద్దలు ఏనాడో చెప్పారు. అందువల్ల ప్రతీ వారి లైఫ్ లో సమస్యలు ఉంటాయి. కానీ తమ ఒక్కరికే సమస్యలు ఉన్నాయని భావించడం కృంగిపోవడమే తప్పు. ఏ సమస్యని ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నావు అన్న దానిని బట్టే నీ జీవిత సారం ఆధారపడి ఉంటుంది.

ఫిల్టర్ చేసుకో :

మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. అన్నీ బయటకు చెప్పాలని లేదు, దాని వల్ల ఇబ్బంది పడేది నీవే. ఎక్కడ ఓపెన్ అవాలో ఎక్కడ గుట్టుగా మెలగాలో తెలుసుకోవాలి. దాన్నే లౌక్యం అంటారు. ఈ లౌక్యం గురించి తెలియకపోతే జీవితంలో బిగ్ ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నేను చాలా ఓపెన్ అని కుండబద్ధలు కొట్టినట్లుగా మట్లాడుతాను అని చెప్పుకోవడానికి గొప్పగానే ఉంటుంది. కానీ నిజంగా లైఫ్ లో అలాంటి వారు ఎన్ని సమస్యలు పడ్డారు అన్నది వారికే తప్ప ఎవరికీ అర్ధం కాదు, యధార్ధ వాది లోక విరోధి అన్న సామెత కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి.

నటించాల్సిందే :

జీవితం అన్నది కూడా ఒక నటన లాంటిదే. ఇది ఒక రంగ స్థలం. నీకు ఇక్కడ ఎన్నో పాత్రలు ఉంటాయి. ఏ పాత్రకు ఆ పాత్రే నటించాలి, అందులో రాణించాలి. దేనినీ మరో దానిలో కలపకూడదు, అందువల్ల నటన రాదు అంటే అసలు కుదరదు, నటించాలి. ఏడవాల్సిన చోట ఏడిస్తే అది సహజం. కానీ అక్కడ నవ్వితేనే జీవితం ఏంటో నీవు తెలుసుకున్నట్లు. చాలా సార్లు నవ్వు రాదు, కానీ నవ్వాల్సిందే. ముఖానికి పౌడర్ రాసుకున్నట్లుగా నీ ముఖ కవలికలను మార్చుకోవాల్సి ఉంటుంది. అంతే కాదు ఎప్పటికి తగినట్లుగా అపుడు నిన్ను నీవు మార్చుకోవాల్సి ఉంటుంది.

నచ్చకపోయినా :

అన్నీ నీకు నచ్చాలని లేదు, నీ కోసమే అవి మారాలని కూడా లేదు, ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటి అంటే నీవు మారడమే. ఎదుటి వారు మారుతారని అది కూడా నీ కోసం అని నీవు భావిస్తే పప్పులో కాలేసినట్లే. అందువల్ల నీవు ముందుకు సాగాలీ అన్నా జీవితంలో వేగంగా అడుగులు పడాలి అన్నా కూడా నీవే మారాల్సి ఉంటుంది. నచ్చని విషయాలను నచ్చినట్లుగా చేసుకోవాలి. అంతా బాగుంది అన్న ఫీలింగ్ నీ ఫేస్ లో కనిపించాలి. అపుడే అనుకున్న దాంట్లో చేస్తున్న దాంట్లో సక్సెస్ అవుతావు.

ఫైనల్ గా చెప్పేదేంటంటే :

మొత్తానికి చివరాఖరున చెప్పేది ఒక్కటే. నీ జీవితానికి నీవే నిర్మాత, దర్శకుడివి, స్క్రిప్ట్ రైటర్ వి, మేకప్ మాన్ వి కూడా. గ్లిజరిన్ లేకుండా కూడా కన్నీరు పెట్టడం నేర్చుకోవాలి. పొట్ట చక్కలు అయ్యేలా నవ్వాలి, కడుపు నొప్పి వచ్చేంతగా నవ్వి హ్యాపీగా ఉన్నాను అని చెప్పాలి. నీకు నీవే బాస్ వి కావచ్చు, కానీ నీకు ఎందరో బాసులు ఉంటారు, వారి సంతృప్తి కోసం నీవు చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. అందుకే జీవితం పూల పానులు అసలు కాదు, అలా అనుకోవడం అంటే అవివేకం అనే పాఠం మొత్తం నీవు కంఠస్థం పట్టేసినట్లే. సో నీ తీరు నుంచి రూపు నుంచి అన్నీ టోటల్ గా చేంజ్ చేసుకుంటేనే ఈ లోకంలో నీవు ఒకడిగా ఉంటారు, కనీసం నీ కోసం అయినా జీవిస్తూ ఉంటారు. ఫైనల్ గా చెప్పేది ఒక్కటే. కాస్తా లౌక్యం నేర్చుకో బ్రో. లేకపోటే లైఫ్ లో దెబ్బడిపోతుంది. ఆ మీదట వగచి వాపోయినా ఒరిగేది జరిగేది ఏమీ ఉండదంతే.