డైలీ 5 కి.మీ పరుగు.. అయినా 2 స్టెంట్లు... ప్రాణాలను కాపాడిన పాఠాలివిగో!
అయినప్పటికీ ఆయన గుండె సంబంధిత సమస్యలకు గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత అనుభవం చాలా మందికి ఆచరణాత్మక పాఠాలను అందిస్తుందనే చెప్పాలి!
By: Raja Ch | 17 Oct 2025 9:51 AM ISTకమ్యూనికేషన్ ప్రొఫెషనల్ అయిన కార్తీక్ శ్రీనివాసన్ ఇటీవల జాతీయ మీడియాలో తన ఊహించని గుండె జబ్బు గురించి, సరళమైన జీవనశైలి మార్పులు తనకు జీవితంలో రెండవ అవకాశాన్ని ఎలా ఇచ్చాయనే విషయం గురించి లోతైన వ్యక్తిగత ప్రయాణాన్ని పంచుకున్నారు. దీంతో.. ఆయన అనుభవం ఆరోగ్య స్పృహతో జీవించే వారు కూడా గుండె సమస్యలకు అతీతులు కారనే విషయాన్ని గుర్తు చేస్తుంది.
అవును... నేను ప్రతిరోజూ వ్యాయామం చేస్తాను.. ధూమపానం చేయను.. సరైన ఆహారపు అలవాట్లే కలిగి ఉన్నాను.. సమయానికే అవి పూర్తి చేస్తాను అని చాలామందిలాగానే కార్తీక్ శ్రీనివాసన్ కూడా భావించారు! అయినప్పటికీ ఆయన గుండె సంబంధిత సమస్యలకు గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత అనుభవం చాలా మందికి ఆచరణాత్మక పాఠాలను అందిస్తుందనే చెప్పాలి!
2011 లో కార్తీక్ కు ఛాతీలో స్వల్ప అసౌకర్యం కలిగింది.. దీంతో, యాంజియోగ్రామ్ చేయించుకున్నాడు. ఆ రిజల్ట్స్ భరోసానిచ్చాయి. నాటి నుంచి జీవితం వేగంగా ముందుకు సాగుతూనే ఉంది. ఈ క్రమంలో... 2025లో అధిక వేగంతో పరిగెత్తేటప్పుడు మరోసారి అసౌకర్యం కలిగింది. అయితే ఈ సారి అది చాలా తీవ్రమైన విషయాన్ని వెల్లడించింది.
ఇందులో భాగంగా... యాంజియోప్లాస్టీ, రెండు స్టెంట్లు వేయించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో కార్తీక్ ఆశ్చర్యపోయాడు. దాదాపు ప్రతిరోజూ 5 కి.మీ పరిగెత్తినప్పటికీ, సరిపడా సమయానికి నిద్రపోతున్నప్పటికీ, తిండి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, ధూమపానం మానేయడంతో పాటు ఫ్యామిలీలో ఎవరికీ గుండె జబ్బుల చరిత్ర లేనప్పటికీ.. 'నాకే ఎందుకు?' అనే ప్రశ్న అతనిని వెంటాడింది.
దీంతో... గుండె ఆరోగ్యం అనేది కేవలం వ్యాయామం, ఆహారం, స్ట్రెస్ మేనేజ్మెంట్ కు మించి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని కార్తీక్ అనుభవం నొక్కి చెబుతుంది. ఈ సమయంలో.. గుండె జబ్బును సమయానికి గుర్తించి, నివారించినందుకు అతను కృతజ్ఞతతో ఉన్నప్పటికీ.. తన జీవితాన్ని ఆప్టిమైజ్ చేసుకోవడానికి ఇది రెండవ అవకాశంగా కూడా అతను గుర్తించాడు.
ఇంట్లో వండిన భోజనమే మేలు!:
తన యాంజియోప్లాస్టీ తర్వాత కార్తీక్ తన ఆహారపు అలవాట్లను పూర్తిగా పునఃపరిశీలించుకున్నాడు. ఈ క్రమంలో... అప్పుడప్పుడు టేక్ అవేలు, అల్ట్రా-ప్రాసెస్డ్ ప్యాక్ చేసిన ఫుడ్ కి బదులుగా ఇంట్లో వండిన ఆహారమే నిజమైన లగ్జరీ అని అతను ఇప్పుడు నమ్ముతున్నాడు. ఇంట్లో తయారుచేసిన తాజా, ఆరోగ్యకరమైన భోజనంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించబడినట్లు చెబుతున్నాడు.
ఈ మార్పు అతని గుండెకు సహాయపడటమే కాకుండా జీర్ణక్రియ, శక్తి స్థాయిలు, మొత్తం ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిచింది. ఈ కార్తీక్ అనుభవం ప్రాసెస్, రెస్టారెంట్ ఆహారాన్ని తగ్గించడం దీర్ఘకాలిక హృదయనాళ ఆరోగ్యానికి చాలా ముఖ్యమనే విషయాన్ని స్పష్టంగా చెబుతుంది.
వ్యాయామం చేసినప్పటికీ....!:
శస్త్రచికిత్స తర్వాత కార్తీక్ కనుగొన్న మరో కీలకమైన విషయం ఏమిటంటే... క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారికి కూడా, ఎక్కువసేపు కూర్చోవడం నుండి బయటపడటం చాలా ముఖ్యం. అతను రోజూ 5 కి.మీ పరిగెత్తినప్పటికీ, అతని పనిలో ల్యాప్ టాప్ ముందు ఎక్కువ గంటలు కూర్చోవడం జరిగింది. ఇది గుండె సమస్యలకు దోహదం చేస్తుంది.
ఈ సమస్యను ఎదుర్కోవడానికి అతను తన స్మార్ట్ వాచ్ లో ఒక కదలిక హెచ్చరిక యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్నాడు. ఇది ప్రతి గంటకు కనీసం 250 అడుగులు వేయమని కోరుతుంది.
వీటితో పాటు లోతైన శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుంది.. రోజువారీ ఒత్తిడిని తగ్గిస్తుంది.
