నైట్ పార్టీ హ్యాంగోవర్... వివాహాల్లో IV డ్రిప్స్ వాడకం పెరిగిందా?
ఈ క్రమంలో... ఇటీవల ఈ తరహా వివాహ వేడుకలు రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉన్నాయి. మాంచి టిప్ టాప్ గా, సందడిగా తయారైన అతిథులు సోఫాల్లో దిగాలుగా కూర్చుని ఈ IV డ్రిప్స్ తీసుకుంటూ కనిపిస్తున్నారు.
By: Raja Ch | 23 Nov 2025 10:05 AM ISTపెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే ఆ సందడే వేరు! ఆ నాలుగు రోజులూ సరదాలు, సందడులు, కావాల్సిన స్పెషల్ ఫుడ్, అన్ లిమిటెడ్ మద్యంతో నిండిన సందడిలో అన్ లిమిటెడ్ డ్యాన్స్ అనేది ఇప్పుడు అత్యంత సహజమైపోయిన పరిస్థితి! ఈ నేపథ్యంలో పెళ్లికి ముందు భారీ మద్యం పార్టీలు, కాక్టెయిల్ రాత్రుల జాగారాలు రోటీన్ అనే చెప్పాలి! ఈ సమయంలో.. IV డ్రిప్ వాడకం అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అవును... సాధారణంగా భారతదేశంలో వివాహాల ముహూర్తాలు తెల్లవారుజామున ఉంటుంటాయి. అయితే అంతక ముందు నైట్ పార్టీలో మునిగి తేలడంతో.. హ్యాంగోవర్ కారణంగా చాలా మంది అతిథులు బద్ధకంగా, అలసటగా, అంతకు మించిన ఎక్స్ ప్రెషన్స్ తో కనిపిస్తుంటారు. పైకి అందరికీ చెప్పుకోలేక, లోలోన తట్టుకోలేక పడే బాదల్లో ఈ హ్యాంగోవర్ ఒకటని అనుభవం ఉన్నవాళ్లు చెబుతుంటారు.
ఈ నేపథ్యంలో.. ఈ సమస్యను పరిష్కరించడానికి వివాహ వేదికపై IV డ్రిప్ బార్ లు ఇప్పుడు పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చి హల్ చల్ చేస్తున్నాయని అంటున్నారు. ఈ సందర్భంగా... ఇన్ ఫ్లుయెన్సర్ అలన్నా పాండే తన 2023 మెహందీ వేడుకల్లో IV థెరపీ బూత్ ను కలిగి ఉన్న వీడియో నెట్టింట హల్ చల్ చేసింది. ఇది హ్యాంగోవర్ నుంచి ఉపశమనం ఇచ్చి, శక్తిని పెంచుతుందని చెబుతున్నారు.
ఈ క్రమంలో... ఇటీవల ఈ తరహా వివాహ వేడుకలు రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉన్నాయి. మాంచి టిప్ టాప్ గా, సందడిగా తయారైన అతిథులు సోఫాల్లో దిగాలుగా కూర్చుని ఈ IV డ్రిప్స్ తీసుకుంటూ కనిపిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ డెస్టినేషన్ వెడ్డింగులో గెస్ట్ లు ఈ డ్రిప్స్ తీసుకుంటున్న వీడియో వైరల్ గా మారింది. దీంతో... ఈ తరహా వ్యవహారాలపై మరోవైపు ఆందోళనలు ఎక్కువవుతున్నాయి.
దీనిపై స్పందించిన వైద్యులు... IV డ్రిప్స్ ద్రవాలు, పోషకాలను నేరుగా రక్తప్రవాహంలోకి సరఫరా చేస్తాయని.. ఇవి శరీరం ఒక సాధారణ ప్రక్రియలో వేగంగా మెరుగ్గా అనిపించడానికి సహాయపడతాయని చెబుతున్నారు. ఇవి దీ హైడ్రేషన్ ను త్వరగా పరిష్కరిస్తాయని.. వాంతులు, విరేచనాలు, ఆపరేషన్ తర్వాత త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయని అంటున్నారు.
అయితే వీటిని కొంతమంది వివాహాల్లో చురుకుగా ఉండటానికి కూడా ఉపయోగిస్తున్నారని.. ఆరోగ్యకరమైన వ్యక్తులకు ఇది ఎల్లప్పుడూ సురక్షితం కాదని, అవసరం లేదని నొక్కి చెబుతున్నారు. ఈ డ్రిప్స్ ను ప్రధానంగా డీహైడ్రేషన్, అనారోగ్యం వంటి వైద్య కారణాలకు మాత్రమే ఉపయోగించాలి కానీ.. కేవలం జీవనశైలి అవసరాల కోసం కాదని.. సరైన వైద్య సలహాలు లేకుండా ఉపయోగించడంవల్ల ఇన్ ఫెక్షన్స్ రావొచ్చని హెచ్చరిస్తున్నారు!
ప్రధానంగా.. సరైన వైద్య అవసరం లేకుండా, నిపుణులు లేకుడా ఈ డ్రిప్ లను ఉపయోగించినప్పుడు అవి ప్రమాదకరం కావొచ్చని.. ఆ సమయంలో జరిగే చిన్న చిన్న తప్పులు పెద్ద పెద్ద సమస్యలు కలిగిస్తాయని వైద్యులు చెబుతునారు. కొన్ని సందర్భాల్లో.. ఎక్కువ ద్రవం గుండె లేదా ఊపిరితిత్తులపై ఒత్తిడి తెస్తుందని.. దీని వల్ల శాస్వ తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుందని చెబుతున్నారు.
మరోవైపు... భారతీయ వివాహాలు ఆచారాలు, పూజల గురించి ఉండాల్సింది పోయి.. ఆ ఆచారల నుంచి మారి మద్యం ప్రధాన స్రవంతిలోకి వచ్చేంతగా ఎక్కడ పట్టాలు తప్పిందో, ఈ IV డ్రిప్స్ ఏమిటో అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు.
