భారతదేశపు పురుషుల జీవితం ఇంత కఠినమా.. ఆశ్చర్యపరుస్తున్న నగ్నసత్యం!
భారతీయ పురుషుడి జీవితం అంటే కేవలం ఒక ప్రయాణం కాదు, అదొక అలుపెరుగని పోరాటం. పుట్టిన దగ్గరి నుండి చివరి శ్వాస వరకు బాధ్యతల మోత మోయడమే తన విధిగా మారిపోయింది.
By: Madhu Reddy | 26 Feb 2026 10:37 PM ISTభారతీయ పురుషుడి జీవితం అంటే కేవలం ఒక ప్రయాణం కాదు, అదొక అలుపెరుగని పోరాటం. పుట్టిన దగ్గరి నుండి చివరి శ్వాస వరకు బాధ్యతల మోత మోయడమే తన విధిగా మారిపోయింది. తన ఇష్టాలను చంపుకుని, తన కలలను త్యాగం చేస్తూ కుటుంబం కోసం అహర్నిశలు శ్రమించే ఒక సగటు భారతీయుడి జీవిత చక్రం ఎలా ఉంటుందో, వయసుతో పాటు అతను ఎదుర్కొనే సవాళ్లు ఏంటో లోతుగా చూద్దాం.
బాల్యం నుంచే మొదలయ్యే పరుగు పందెం:
ఇక మన భారతదేశం లో ఒక మగపిల్లాడు ఇంట్లో పుట్టిన ఐదేళ్ల నుంచే అతనిపై అంచనాల భారం మొదలవుతుంది. కొందరు మరీ మూడు ఏళ్ల నుండే స్కూల్ కు పంపుతున్నారు ఇక ఆడుకోవాల్సిన వయసులో పుస్తకాల సంచి భుజాన పడుతుంది. ఇక్కడ హాబీలకు, ఆటపాటలకు సమయం ఉండదు, కేవలం ర్యాంకులు, మార్కుల వేటలోనే బాల్యం కరిగిపోతుంది. 15 నుండి 22 ఏళ్ల వయసు వచ్చేసరికి లక్షలాది మందితో పోటీ పడుతూ కాలేజీ సీటు కోసం, ఆపై ఒక మంచి ఉద్యోగం కోసం రాత్రింబవళ్లు కష్టపడాలి. సమాజం, టీచర్లు చూపించే కఠిన వైఖరి,నెంబర్ వన్ కావాలి అంటూ అతన్ని ఒక యంత్రంలా మారుస్తుంది. తనకంటూ ఒక కల ఉన్నా, అది రేపటి కెరీర్‌కు పనికిరాదని తెలిస్తే అక్కడే ఆ కలని పాతిపెట్టేసి మంచి భవిష్యత్ కోసం భరోసా ఇచ్చే దారిలో నడవాల్సి వస్తుంది.
పెళ్లి.. పిల్లలు.. బాధ్యతల చక్రబంధం:
ఇక 25 ఏళ్లు దాటాక ఉద్యోగం సంపాదించడమే ఆలస్యం, వెంటనే పెళ్లి, సంసారం అనే మరో పెద్ద బాధ్యత ఎదురవుతుంది. ఇక అప్పటి నుంచి అతని జీవితం తనది కాదు. 30 నుండి 50 ఏళ్ల మధ్య కాలంలో భార్య అవసరాలు, పిల్లల చదువులు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ఆరోగ్యం.. ఇలా అన్నింటినీ తన భుజాలపైనే మోయాలి. సొంతానికి ఒక చొక్కా కొనుక్కోవాలన్నా పది సార్లు ఆలోచించే సగటు తండ్రి, పిల్లల ఫీజుల కోసం మాత్రం అప్పులు చేయడానికైనా వెనకాడడు. ఈ క్రమంలో తన పాత హాబీలు, పర్యటనలు, చిన్ననాటి సరదాలన్నీ మరుగున పడిపోతాయి. కుటుంబం చిరునవ్వులో తన ఆనందాన్ని వెతుక్కునే త్యాగశీలిగా అతను మారిపోతాడు.
అలుపెరుగని శ్రమ.. నిశ్శబ్ద మరణం:
60 ఏళ్లు దగ్గరపడుతున్నా విశ్రాంతి అన్న మాట అతని డిక్షనరీలో ఉండదు. రిటైర్మెంట్ తర్వాత కూడా పిల్లల సెటిల్మెంట్, మనవళ్ల భవిష్యత్తు అంటూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. ఇక జీవితాంతం ఎండనక, వాననక కష్టపడి సంపాదించినదంతా ఇతరుల కోసమే ఖర్చు చేస్తాడు. అనారోగ్యం వచ్చినా, ఒళ్లు సహకరించకపోయినా "నాకేం కాలేదులే" అని అబద్ధం చెబుతూ బాధ్యతల నుంచి తప్పుకోడు. చివరికి తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా, తన త్యాగాలను ఎవరికీ చెప్పుకోకుండా నిశబ్దంగా ఈ లోకాన్ని విడిచి వెళ్తాడు. భారతీయ పురుషుడి జీవితం అంటే ఒక నగ్న సత్యం.. అది అంతులేని బాధ్యతల నిరంతర ప్రవాహం అన్నది నిజం.
