ఇదిగో.. ఇగో వదిలేసెయ్...బాగుంటావ్ !
నేను అన్నది అహంకారం. అది చాలా మందికి అలంకారం. నేను గొప్ప అన్నది తలకెక్కిన గర్వం. అన్నీ నాకే తెలుసు అన్నది కూడా మితిమీరిన తీరుకు నిదర్శనంగా చూస్తారు.
By: Satya P | 5 July 2026 1:31 PM ISTనేను అన్నది అహంకారం. అది చాలా మందికి అలంకారం. నేను గొప్ప అన్నది తలకెక్కిన గర్వం. అన్నీ నాకే తెలుసు అన్నది కూడా మితిమీరిన తీరుకు నిదర్శనంగా చూస్తారు. ఈ లోకంలో ఎవరికీ అన్నీ తెలియవు. ఇంకా చెప్పాలి అంటే ఎవరికి ఏమి తెలిసినా అది గోరంత మాత్రమే. కొండంత ఉన్న విషయాన్ని తెలుసుకోవాలంటే మనిషి జీవితం ఏ మాత్రం సరిపోదు, ఈ సృష్టి కొన్ని లక్షల కోట్ల ఏళ్ళ నాటిది. మనిషి జీవితం అందులో అత్యల్పం. అలాంటి మనిషి తాను ఉన్న ఈ అతి తక్కువ సమయంలో తనకు అన్నీ తెలుసు అని విర్రవీగితే అంతకంటే హాస్యాస్పదం వేరొకటి ఉండదు. ఇక్కడ మరో చిత్రం చెప్పుకోవాలి. ఈ సృష్టి క్రమంలో ప్రతీ క్షణంలో ఎన్నో మార్పులు వస్తూంటాయి. వాటిని కనిపెట్టి అవగాహన చేసుకోవడానికి మనిషి అన్న వారెవరికీ సమయం కాలం సరిపోదు.
ఒంటరివి అవుతావు :
ఇక అహంకారానికి పోయే వారి తీరు చూస్తే వారు ఎపుడూ ఒంటరిగా ఉంటారు. తాము గొప్పవారిమి అని ఒక కోట కట్టుకుని అందులోనే జీవిస్తూంటారు. పది మందిలో కలవలేరు, అందరితో తమ భావాలను పంచుకోలేరు, నిరంతరం ఎక్కువ తక్కువలను చూస్తూంటారు. వారి మెదడులో నిక్షిప్తం అయి ఉన్న ఈ ఇగో భావజాలంతో తూనికలు కొలతలు వేసుకుంటూ తమకు సరిసాటి ఎవరూ లేరని అందరూ తక్కువే అని భ్రమలలో గడిపేస్తూంటారు. అలాంటి వారు జీవితంలో ఎంత ఎదిగినా ఎవరూ లేని వారుగా ఏమీ కాని వారుగా ఉండిపోతారు.
బంధాలు బలహీనం :
ఇగోలకు పోయే వారి విషయంలో చూస్తే బంధాలు ఎపుడూ వీరికి బలహీనంగా ఉంటాయి. వారి వద్దకు వచ్చేందుకు కూడా ఎవరూ ఇష్టపడరు. ఇగోతోనే వారు హద్దులు పెట్టుకుని ఆ పరిమిత లోకంలో జీవిస్తూంటారు. అందువల్ల వారి దరి చేరేందుకు మిగతా ప్రపంచం ఆసక్తి చూపించదు, ఒక విధంగా వీరిని దూరంగా పెడుతుంది. దాంతో అహంకారం మనస్తత్వంతో ఉండేవారు మానసికంగా కూడా అతి పెద్ద సమస్యలనే ఎదుర్కొంటారు. ఈ తరహా మనుషులకు తమను ఎపుడూ అందరూ పొగడాలని గుర్తించాలని ఉంటుంది. పది మందిలో తొమ్మిది మంది మొహమాటానికి పొగిడినా పదవ వ్యక్తి పట్టించుకోకపోతే వీరి బాధ వర్ణనాతీతం. ఆ వ్యక్తి ఎందుకు తన గురించి పట్టించుకోలేదని నిరంతరం ఆలోచిస్తూ అందులోనే మధన పడుతూ చీకటి గోడల మధ్యనే వేదనతో మునిగిపోతూంటారు.
అదంతా విలువ లేనిదే :
మన పెద్దలు చెబుతారు గుణం మంచిది కావాలని. అది లేకపోతే ఎన్ని ఆభరణాలు ఉన్నా కూడా మెరిసేది ఉండదు, అలా అహంకారం అనే కారాన్ని నిలువెల్లా పూసుకుని అందులో మండుతూ ఇతరులను కూడా మండించే ప్రయత్నం చేసే వారికి జీవితంలో సుఖం అన్నది లేదని చెప్పాల్సి ఉంటుంది. వారు తమ జీవితంలో ఏమి సాధించినా ఎంత చేసినా కూడా వాటికి ఒక విలువ గౌరవం లేకుండా పోతాయి. అహంకారిని ఎవరూ దరి చేరడు, పొరపాటున ముఖం మీద పొగిడినా వెనకాల మాత్రం తిట్టుకుంటాడు. తాను ఏదో పై నుంచి దిగి వచ్చాను అని చేసే అతి చర్యలతో ఇగోయిస్టులు చివరికి తాము ఎంత కోల్పోతున్నామో తెలుసుకోరు. అది తెలిసేసరికి వారి జీవితం కూడా ఒక్కోసారి ముగిసిపోవచ్చు.
హోదాలు అన్నీ తాత్కాలికం :
తాము గొప్ప పదవులు నిర్వహించామని తమను జీవితాంతం గౌరవించాలని కోరుకునే వారు పిచ్చి భ్రమలలో ఉన్నారనే అర్ధం చేసుకోవాలి. ఫలానా టైం లో ఫలానా పీరియడ్ లో మాత్రమే వారు ఆ హోదాలో ఉన్నారు, దానికి గానూ ప్రతిఫలం అందుకున్నారు. అది అక్కడితో ముగిసిన కధ. ఆ హోదాకు వడ్డీలు చక్ర వడ్డీలు కలిపి జీవితాంతం ఆ దర్పం దర్జా చూపిస్తూ అవన్నీ ఎదుటి వారి నుంచి ఆశిస్తే మాత్రం అంతకంటే తెలివిమాలిన ఆలోచనలు వేరొకటి ఉండవు. ఎన్నో ఉన్నత పదవులు వెలగబెట్టి రిటైర్ అయిన వారు చివరికి తేలేది పడక కుర్చీలోనే. అపుడు వారికి ఒక మంచి పలకరింపు కూడా కరువు అవుతుంది. నలుగురితో మంచిగా ఉంటూ కలసిపోయే వారికి మాత్రం జీవితంలో ఎన్నో ఆహ్వానాలు వస్తాయి. అందరూ తమ వారు అనుకుంటారు. అందువల్ల ఎవరైనా గుర్తించాల్సింది ఏంటంటే అహంకారాన్ని వదిలించుకోవడం. దాని వల్ల లాభం ఉండకపోగా నష్టం అధికంగా ఉంటుంది. నేను గొప్ప అని ఒంటరిగా కూర్చోవడం కంటే అందరిలో నేనూ అని కలసిపోతే పదిమందితో ఉంటూ ఉల్లాసంగా గడిపితే ఆ వచ్చే ఆనందం వెలకట్టలేనిది అని తెలుసుకుంటేనే జీవితానికి అర్ధం పరమార్ధం. అపుడే జీవితానికి సార్ధకత కూడా దక్కుతుంది.
