డిప్రెషన్ - ప్రాణాలు తీస్తుంది
ఈ రోజులలో అందరికీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. దాంతో విలాసవంతమైన జీవితం అందరూ గడుపుతున్నారని అన్నీ ఆస్వాదిస్తున్నారు అని భావించడం జరుగుతోంది.
By: Satya P | 9 Feb 2026 4:00 AM ISTఈ రోజులలో అందరికీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. దాంతో విలాసవంతమైన జీవితం అందరూ గడుపుతున్నారని అన్నీ ఆస్వాదిస్తున్నారు అని భావించడం జరుగుతోంది. కానీ ఈ ఆధునిక సదుపాయాలు కానీ స్మార్ట్ ఫోన్ల యుగం కానీ ఈ అంది వచ్చిన సాంకేతికత కానీ మనిషిని ఒంటరిగా మార్చేస్తోంది. ఒక్కడిగా చేసి పారేస్తోంది. దాంతో సమస్యలు ఎదురైనపుడు ధైర్యంగా ఎదుర్కోలేక డిప్రెషన్ కి లోను అవుతున్నారు. పది మందికి చెప్పుకోవడం నామోషీగా భావిస్తున్న వారూ ఉన్నారు. దాంతో ఈ డిప్రెషన్ ఎంతటి స్థాయికి తీసుకుని వెళ్తోంది అంటే ఏకంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు.
డిప్రేషన్ తో పెను ముప్పు :
ఎవరికైనా డిప్రెషన్ అన్నది ఉంటే కనుక అది తేలికగా తీసుకునే విషయం కానే కాదు, వారు సాధారణ మనుషుల మాదిరిగా అసలు ఉండలేరు, వారు అందరిలో ఉన్నా ఒంటరిగా కనిపిస్తారు, ఇక వారి ఆలోచనలు వారి తీరు వారి బాడీ లాంగ్వేజ్ అంతా ప్రత్యేకంగా కనిపిస్తుంది. జాగ్రత్తగా చూస్తే కనుక వారు చాలా తేడాగా కనిపిస్తారు. ఈ విషయంలో వారి లక్షణాలను వారి వైఖరిని గమనించి దారికి తెచ్చే ప్రయత్నం చేయకపోతే మాత్రం ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆ కడుపుకోతతో కుటుంబాలని నిండా విషాదంలో ముంచేస్తారు.
దారుణమైన జబ్బు :
చాలా మంది డిప్రెషన్ ని తేలికగా తీసుకుంటారు కానీ మానసిక వైద్య నిపుణులు చెప్పేది ఏంటి అంటే అది చాలా సీరియస్ వ్యవహారం అని. డిప్రెషన్ అనేది తీవ్రమైన జబ్బుగా పరిగణిస్తారు. ఇది సాధారణ మానసిక రుగ్మతగా మొదలై ఆ తరువాత తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే డిప్రెషన్ లో కూరుకుపోయిన వ్యక్తి ఎపుడూ విచారంతో ఉంటాడు, అంతే కాదు ఏ విషయం అయినా ఆసక్తి కోల్పోవడం జరుగుతుంది. అంతే కాదు మనిషిలో ఉత్సాహం శక్తి కాంతి ఇవన్నీ ఒక్కోటిగా తగ్గడం జరుగుతాయి. వీటిని ప్రాధమిక లక్షణాలు గా భావించి వారికి మొదట్లోనే సరైన కౌన్స్లింగ్ ఇప్పిస్తే కనుక ప్రమాదం బారి నుంచి బయటపడతారు.
డిప్రెషన్ ఎందుకు :
నిజానికి డిప్రెషన్ అని అంతా అంటూ ఉంటారు, ఇది ఎందుకు వస్తుంది అన్నది కూడా చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి. మనిషి మెదడులో ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఇక మెదడులో అనేక రసాయనాలు రిలీజ్ అవుతాయి. అయితే ఆయా రసాయనాల అసమతుల్యతతో డిప్రెషన్ అన్న దానికి బీజం పడుతుంది. అంతే కాదు హార్మోన్లలో మార్పులు కూడా స్టార్ట్ అవుతాయి. అలా వారి ఆలోచనలు ప్రవర్తన అన్నీ కలసి వేరేగా ఉంటూ ఏకంగా శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
నిరాశతో నిండిపోతూ :
చాలా మంది తాము కోరుకున్నది జరగకపోతే నిరాశకు లోను అవుతారు. అందరిలో తాము ఒక్కరిమే వెనకబడిపోతున్నామన్న భావనకు గురి అవుతారు అలా నిరాశ మొదటి మెట్టుగా స్టార్ట్ అయి అది కాస్తా నెగిటివ్ ఆలోచనలకు దారి తీస్తుంది. తాను ఒక వైపు మొత్తం సమాజం మరో వైపు అన్న భావన పెంచుకుంటారు దనతో వారి నిరంతరం ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. తరచుగా భావోద్వేగానికి గురి అవుతారు. వారిలో ఎక్కువగా చిరాకు నిరాశ కనిపిస్తాయి. తమకు ఈ లోకంలో విలువ లేదని భావిస్తూంటారు. జీవితం అంతా శూన్యత ఆవహించింది అని మధన పడుతూంటారు.
ఈ కారణాల వల్ల కూడా :
ఇదిలా ఉంటే శారీరక లేదా మానసికంగా వేధింపులకు గురి అయినా అలాగే లైంగిక వేధింపుల బారిన పడినా ఇక తమకు ఎంతో ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం జరిగినా అలాగే తీవ్రమైన ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినా అదే విధంగా మోయలేని ఒత్తిడితో కూడిన జీవితం సాగిస్తున్నా ఇవన్నీ కూడా డిప్రెషన్ కి దారి తీస్తాయి. అంతే కాదు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడే వారు కూడా డిప్రెషన్ లోకి వెళ్తారు
పదే పదే ఆలోచనలు :
ఈ విధంగా డిప్రెషన్ కి గురి అయిన వారు పదే పదే ఆత్మ హత్యల గురించే ఆలోచిస్తూంటారు. తాము ఈ లోకం వీడిపోవాలని అనుకుంటారు. తమ బాధలను ఎవరితోనూ పంచుకోరు. ఎందుకంటే వారు అంతా తమకు వ్యతిరేకులను తమ బాధ తీర్చలేరని భావించడమే కారణం. అంతే కాకుండా తక్కువగా నిద్ర పోతారు, దేని మీద ఫోకస్ పెట్టలేరు, ఈ జన్మ తమకు వేస్ట్ అన్న మాటలను కూడా మాట్లాడుతూంటారు.
అత్యధిక శాతం ఆత్మహత్యలు :
ఈ దేశంలో జరిగే ఆత్మహత్యలలో నూటికి అరవై నుంచి అరవై అయిదు శాతం డిప్రెషన్ వల్లనే జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. తమకు ఈ జీవితం చాలు అని అనుకుంటూ ఆ వైపుగా వీరు అడుగులు వేస్తూంటారు. తమకు చావు మాత్రమే పరిష్కారం అని అక్కడే తమకు స్వాంతన కలుగుతుందని భావిస్తారు. అంతే కాదు వీరిలో మరో ఆలోచన కూడా ఉంటుంది. ఈ జన్మ ఇక్కడితో స్టాప్ బటన్ నొక్కి ఆపేస్తే తమకు నచ్చిన విధంగా అన్నీ కలసి వచ్చిన విధంగా మరో కొత్త జన్మ ఉంటుందని దాని కోసం ఈ జీవితం ముగించడమే బెస్ట్ అని చాలా గట్టిగా తీర్మానించుకుని మరీ ఆంత్య హత్యలు చేసుకుంటారు అని నిపుణులు చెబుతారు.
మొదట్లోనే ఆపితేనే :
డిప్రెషన్ లక్షణాలు కనుక ఎవరికైనా ఉంటే వారిని మొదట్లోనే ఆపే ప్రయత్నం చేయాలి, అసలు ఒంటరిగా ఉంచకూడదు, సరైన కౌన్సిలింగ్ ఇప్పించాలి. వారితో పాటుగానే ఉంటూ నిరాశ నుంచి బయటపడేలా చేయాలి అని అంటున్నారు. ఈ వ్యాధి తీవ్రమైన సందర్భాలలో ప్రత్యేకమైన మానసిక ఆరోగ్య సంరక్షణ చర్యలు కూడా చేపట్టాలి. అంత కాదు వారి జీవన శైలిలో మార్పు తేవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో దినచర్యను మొదలెట్టేలా చూడాలి. ఇతరులతో సన్నిహితంగా ఉండటం అన్నది తెలియజేయాలి. మద్యపానానికి దూరంగా ఉండటంతో పాటు ఒంటరితనానికి బైబై చెప్పేలా వారిని మార్చాలి. ఇక ఈ తరహా లక్షణాలతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారిని వెంటనే మానసిక నిపుణుల వద్దకు చేర్చే ప్రయత్నం చేస్తే కనుక వారు కూడా మామూలు మనుషులు అవుతారు.
