పెరిగిన జీతం.. తరిగిన పొదుపు: 'లైఫ్‌స్టైల్ క్రీప్' ఉచ్చులో పడకండి!
ఆదాయం పెరిగే కొద్దీ.. మనకు తెలియకుండానే మన జీవన ప్రమాణాలు పెంచుకుంటూ పోవడాన్ని ‘లైఫ్ స్టైల్ క్రీప్’ అంటారు.
By: A.N.Kumar | 26 Dec 2025 4:00 AM ISTఇప్పుడంతా ఈఎంఐల కాలం.. జీతం ఎంతో ఈఎంఐలు అన్ని ఉంటున్నాయి. లగ్జరీ లైఫ్ కు అలవాటు పడ్డ యువత హోం లోన్, కార్ లోన్, ఇంట్లో టీవీ, ఖరీదైన ఫోన్లు ఇలా అన్నింటిని క్రెడిట్ కార్డులపై, బ్యాంకుల్లో లోన్లుగా తీసుకొని ఈఎంఐలు కడుతూ బతుకును ఇన్ స్టాల్ మెంట్లలో పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే.. పెరిగిన జీతం చేతికి రాగానే కొత్త ఫోన్ కొనేద్దామా? కారు మార్చేద్దామా? అనే యువత ఆలోచిస్తోంది. ఇదే అయితే మీరు ‘లైఫ్ స్టైల్ క్రీప్’ అనే మాయలో పడినట్టే.. ఆదాయం పెరుగుతున్నా ఆర్థికంగా ఎదగలేకపోవడానికి అసలు కారణం ఇదే.
చాలా మంది ఉద్యోగుల పరిస్థితి ఇప్పుడు ఒకేలా ఉంటోంది. ఏటా ఇంక్రిమెంట్లు వస్తున్నాయి.. ప్రమోషన్లు వస్తున్నాయి. కానీ నెలాఖరు వచ్చేసరికి బ్యాంకు ఖాతాలో మాత్రం నిల్వపెరగడం లేదు. ‘అప్పట్లో తక్కువ జీతం ఉన్నప్పుడే ఎక్కువ సేవ్ చేసేవాళ్లం.. ఇప్పుడు జీతం పెరిగినా చేతిలో చిల్లి గవ్వ మిగలడం లేదు’ అన్నది సగటు మధ్యతరగతి జీవి ఆవేదన.. దీనికి ప్రధాన కారణం లైఫ్ స్టైల్ క్రీప్.
ఏమిటీ లైఫ్ స్టైల్ క్రీప్?
ఆదాయం పెరిగే కొద్దీ.. మనకు తెలియకుండానే మన జీవన ప్రమాణాలు పెంచుకుంటూ పోవడాన్ని ‘లైఫ్ స్టైల్ క్రీప్’ అంటారు. ఒకప్పుడు లగ్జరీ అనుకున్న వస్తువులు, ఆదాయం పెరగగానే ‘అవసరాలు’గా మారిపోతాయి.. సాధారణ ఫోన్ స్థానంలో ఖరీదైన ఫోన్ వస్తుంది. నడిచే కారు ఉన్నా, హోదా కోసం కొత్త మోడల్ కారు కొంటారు. వారానికి ఒకసారి బయట తినే అలవాటు కాస్తా, వారానికి మూడు సార్లుగా మారుతుంది.. అవసరం లేని ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, బ్రాండెడ్ దుస్తులపై వ్యామోహం పెరుగుతుంది.
కనిపించని శత్రువు.. కరిగిపోయే సంపద..
లైఫ్ స్టైల్ క్రీప్ అనేది నెమ్మదిగా పాకే శత్రువు. ఇది మీ సంపద సృష్టిని అడ్డుకుంటుంది. పెరిగిన ఆదాయం అంతా ఖర్చులకే సరిపోవడంతో రిటైర్మెంట్ కోసం లేదా అత్యవసర నిధి కోసం డబ్బు దాచలేరు. విలాసవంతమైన జీవనశైలిని మెయింటైన్ చేయడానికి క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లపై ఆధారపడాల్సి వస్తుంది. ఎక్కువ సంపాదిస్తున్నా రేపటి గురించి భయం వెంటాడుతూనే ఉంటుంది.
ఈ ఉచ్చు నుంచి బయటపడాలంటే?
ఆర్థిక స్వేచ్ఛను పొందాలంటే జీవనశైలిని కాదు.. మీ ఆస్తులను అప్ గ్రేడ్ చేయాలి. జీతం పెరిగిన వెంటనే ఖర్చులు పెంచకండి. పాత బడ్జెట్ నే మరికొన్నాళ్లు కొనసాగించండి.. పెరిగిన జీతం నుంచి కొంత మొత్తాన్ని వెంటనే ఎస్ఐపీలు లేదా ఆర్డీ ల ద్వారా పెట్టుబడిగా మళ్లించండి. ఏదైనా ఖరీదైన వస్తువులు కొనాలనుకున్నప్పుడు 48 గంటల నియమం పాటించండి.. ఆ సమయం తర్వాత కూడా అది అవసరమే అనిపిస్తేనే కొనండి. విలాసాల కంటే ఆర్థిక భద్రతకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి
ఖరీదైన వస్తువులు క్షణికమైన ఆనందాన్ని ఇస్తాయి. కానీ తెలివైన పెట్టుబడులు జీవితాంతం స్వేచ్ఛను ఇస్తాయి. జీతం పెరిగినప్పుడు మీ కారు మోడల్ మారడం కంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం ముఖ్యం. ‘లైఫ్ స్టైల్ క్రీప్’ బారిన పడకుండా జాగ్రత్త పడితేనే నిజమైన సంపద మీకు సాధ్యమవుతుంది.
