ప్లాస్టిక్ కు జుట్టు ఊడిపోవటానికి లింకు?

Wed Jul 29 2015 14:58:04 GMT+0530 (IST)

Use of excessive plastics in daily life can cause hair loss

కొత్త విషయం బయటకు వచ్చింది. ఇంతకాలం జుట్టు ఊడిపోతుందన్న వెంటనే.. తలలో చుండ్రు ఉండటం కానీ.. కాలుష్యం కానీ.. హార్మోన్ల ప్రభావం వల్ల కానీ.. ఇలా రకరకాల కారణాలని భావించటం తెలిసిందే. అయితే.. ఎవరూ దృష్టి సారించని అంశం కారణంగా జుట్టు ఊడిపోతుందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది.ప్లాస్టిక్ బాటిళ్లు.. టిఫిన్ బాక్స్ ల కారణంగా జుట్టు ఊడిపోయే సమస్య ఎక్కువగా ఉంటుందని తేలింది. ఈ అంశంపై నెలల పాటు నిర్వహించిన పరిశోధనలతో ఈ కొత్త విషయం బయటకు వచ్చింది. బెంగళూరుకు చెందిన హెయిర్ లైన్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడిందని వారు చెబుతున్నారు.

ప్లాస్టిక్ లో ఉండే బిస్పెనాల్ ఏ (బీపీఏ) రక్తంలో చేరి హెయిర్ లాస్ కు కారణం అవుతుందని చెబుతున్నారు. ఇందుకోసం ప్లాస్టిక్ బాక్స్ ల్లో ఆహారం తినే వారిపై వారు పరీక్షలు జరిపారు. వారిలో జట్టు ఊడే సమస్య ఎక్కువగా ఉందని.. తమ అధ్యయనం కోసం 20 నుంచి 45 ఏళ్ల మధ్య లోపు వారిని ఎంపిక చేసినట్లు సదరు సంస్థ చెబుతోంది.

తాము పరిశోధన జరిపిన వారిలో జుట్టు రాలే సమస్య ఉన్న వారిలో 90 శాతం మంది రక్తం.. మూత్రం శాంపిల్లలో బీపీఏ ప్లాస్టిక్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. వీలైనంతవరకూ ప్లాస్టిక్ కు దూరంగా ఉంటూ.. స్టీల్ వాడటం వల్ల ఈ సమస్య నుంచి బయట పడొచ్చని చెబుతున్నారు. మారిన జీవనశైలిలో ప్రతి క్షణం ప్లాస్టిక్ తో ముడిపడి ఉండటంతో.. రక్తంలో ప్లాస్టిక్ అవశేషాలు పెరుగుతున్నాయని ఇది జుట్టు రాలిపోవటం.. మిగిలిన ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుందని వారు చెబుతున్నారు. ఎందుకైనా మంచిది.. ప్లాస్టిక్ వస్తువుల వాడకం విషయంలో కాస్తంత జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.