వాట్సప్ చాట్ ఆధారంగా నో విడాకులు.. బాంబే హైకోర్టు
భార్య నుంచి విడాకులు కోరుతు ఒక వ్యక్తి నాసిక్ కోర్టును గతంలో ఆశ్రయించాడు ఒక వ్యక్తి. ఈ సందర్భంగా భార్యతో చేసిన వాట్సప్ చాట్ వివరాల్ని కోర్టుకు సమర్పించారు.
By: Garuda Media | 5 March 2026 10:54 AM ISTవిడాకుల మంజూరు విషయంలో బాంబే హైకోర్టు కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. వాట్సప్ చాట్ ఆధారంగా క్రూరత్వాన్ని నిర్దారించి.. విడాకులు ఇవ్వలేమని స్పష్టం చేయటమే కాదు కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవరించిన ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. ఆసక్తికరంగా మారిన ఈ విడాకుల కేసు వివరాల్లోకి వెళితే..
భార్య నుంచి విడాకులు కోరుతు ఒక వ్యక్తి నాసిక్ కోర్టును గతంలో ఆశ్రయించాడు ఒక వ్యక్తి. ఈ సందర్భంగా భార్యతో చేసిన వాట్సప్ చాట్ వివరాల్ని కోర్టుకు సమర్పించారు. అందులో నాసిక్ నుంచి ఫుణె కు కాపురాన్ని మార్చాలన్న డిమాండ్ చేసిందని పేర్కొంటూ భార్యతో చాట్ చేసిన వివరాల్ని ఇవ్వటంతో పాటు.. వాటి ఆధారంగా తన వాదనల్ని వినిపించారు. చాట్ లో అత్త.. వదినలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లుగా పేర్కొన్నారు.
ఈ ఆధారాల్ని పరిగణలోకి తీసుకున్న నాసిక్ కోర్టు.. వాట్సప్ చాటింగ్ తో భర్తపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారని.. ఎమోషనల్ బ్లాక్ మొయిల్ కు పాల్పడినట్లుగా పేర్కొనటంతో పాటు.. అసభ్యకరమైన భాషను ఉపయోగించినట్లుగా నిర్దారిస్తూ.. క్రూరత్వం కింద అతను వడాకులకు అర్హుడిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భర్త వాదనల్ని సవాలు చేస్తూ.. ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
తన వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకుండా నాసిక్ ఫ్యామిలీ కోర్టు ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్న ఆమె.. తన వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో ఆమె అభ్యర్థనపై బాంబే హైకోర్టు స్పందించింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. భర్త సమర్పించిన వాట్సప్ చాట్ లను ఖండించేందుకు ఫ్యామిలీ కోర్టు ఆమెకు అవకాశం ఇవ్వలేదని.. కేవలం వాట్సప్ చాట్ లపై ఆధారపడి.. విడాకులను మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఈ కేసును మళ్లీ విచారించాలని పేర్కొంటూ ఫ్యామిలీ కోర్టుకు పంపింది. భార్య వాదనలు వినాలని, సాక్ష్యాల్నిపరిశీలించాలని పేర్కొంటూ కోర్టును ఆదేశించారు. అదే సమయంలో ఇరువురు కలిసి ఉండేందుకు మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నించాలని పేర్కొన్నారు.
