Begin typing your search above and press return to search.

సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీ కొలిక్కి.. కోర్టుకు సంచలన నివేదిక!

విజయవాడలో సంచలనం సృష్టించిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీని పోలీసులు ఛేదించారు.

By:  Tupaki Political Desk   |   24 Jun 2026 3:17 PM IST
సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీ కొలిక్కి.. కోర్టుకు సంచలన నివేదిక!
X

విజయవాడలో సంచలనం సృష్టించిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సిట్ పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. కృష్ణలంక పోలీసు స్టేషన్ కేంద్రంగా సాగిన దర్యాప్తులో సాయికృష్ణ పోలీసుల కస్టడీలోనే మరణించినట్లు సిట్ అధికారులు ప్రాథమిక సాక్ష్యాలు సేకరించారు. ఈ విషయాన్ని సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా రాశారు. సాయికృష్ణ అదృశ్యంపై ప్రభుత్వం ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో సిట్ వేసిన విషయం తెలిసిందే. మంగళవారం సిట్ అధికారులు సీఐ నాగరాజును అరెస్టు చేసి సుదీర్ఘంగా విచారించారు. బుధవారం ఉదయం కోర్టులో ప్రవేశపెట్టగా మేజిస్ట్రేట్ నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు.

సాయికృష్ణ కేసు విచారణలో సిట్ సమర్పించిన రిమాండ్ రిపోర్టు సంచలనం సృష్టిస్తోంది. నాన్-బెయిలబుల్ వారెంట్ పేరుతో సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న కృష్ణలంక పోలీసులు, అతనిని స్టేషన్‌లోనే అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురిచేశారని సిట్ అధికారులు ఆరోపించారు. ఈ క్రమంలో సాయికృష్ణ మరణించాడని సిట్ దర్యాప్తులో తేలిందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పోలీసుల అదుపులో ఉండగా, సాయికృష్ణ మరణిస్తే, ఆ విషయాన్ని కప్పిపుచ్చడానికి సీఐ నాగరాజు కుట్ర చేశారని చెబుతున్నారు. సాయికృష్ణ మృతదేహాన్ని రహస్యంగా తరలించి మాయం చేయడంతో పాటు, స్టేషన్‌లోని సీసీటీవీ డిజిటల్ వీడియో రికార్డులో డేటాను పూర్తిగా తొలగించారని సిట్ వెల్లడించింది. మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు దాదాపు నెలరోజుల సీసీ కెమెరా పుటేజీ మాయం చేశారని, సాక్ష్యాలను తుడిచిపెట్టే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం జరిగిందని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారని సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు.

కోర్టును తప్పుదోవ పట్టించిన వైనం

సాయికృష్ణ ఆచూకీ తెలియడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న సమయంలో, బాధితుడి తల్లి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారని చెబుతున్నారు. అయితే, అప్పటికే కస్టడీలో సాయికృష్ణ మరణించినప్పటికీ, పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని అంటున్నారు. అంతేకాకుండా, స్టేషన్‌కు విచారణ నిమిత్తం వెళ్ళిన సాయికృష్ణ తల్లిని కృష్ణలంక సీఐ నాగరాజు దుర్భాషలాడటం, కేసును తప్పుదోవ పట్టించేలా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు, స్టేషన్ సిబ్బందిని విచారించగా, కీలక సాక్ష్యం లభించింది. కృష్ణలంక స్టేషన్ ఎస్ఐ స్వయంగా ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో ప్రధాన మలుపుగా మారిందని చెబుతున్నారు. సీఐ నాగరాజు ఆధ్వర్యంలోనే సాయికృష్ణ మరణం జరిగిందని, ఆ సమయంలో తాను మృతదేహాన్ని స్టేషన్‌లోనే చూశానని ఎస్ఐ వెల్లడించినట్లు సమాచారం. ఈ సాక్ష్యం ఆధారంగా సిట్ అధికారులు సీఐ నాగరాజును అరెస్టు చేశారు. ప్రస్తుతం నాగరాజును కోర్టు జూలై 8 వరకు రిమాండ్‌కు తరలించింది.

ఈ ఘటనపై సిట్ అధికారులు నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు 17 మందికి పైగా సాక్షులను విచారించి, స్టేషన్‌లోని రికార్డులను సేకరించారు. అసలు సాయికృష్ణ మృతదేహాన్ని ఎక్కడ పారేశారు? ఈ దారుణంలో ఇంకా ఎవరెవరికి సంబంధం ఉంది? అనే కోణంలో అధికారులు సీఐ నాగరాజును తమ కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించేందుకు సిద్ధమవుతున్నారు. పోలీసు శాఖలో జరిగిన ఈ అమానవీయ ఘటన పట్ల ప్రజల్లో, ప్రజా సంఘాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధ్యులైన అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.