కరూర్ టెన్షన్లో విజయ్.. హైకోర్టు తీర్పు పై సుప్రీంకోర్టుకు టీవీకే
తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ ను తమిళనాడు పోలీసులు టెన్షన్ పెడుతున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
By: Tupaki Political Desk | 8 Oct 2025 1:50 PM ISTతమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ ను తమిళనాడు పోలీసులు టెన్షన్ పెడుతున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు తీర్పుతో కరూర్ తొక్కిసలాటపై సిట్ దర్యాప్తును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తమ పార్టీకి వ్యతిరేకంగా సిట్ పక్షపాత వైఖరి అవలంబిస్తోందని విజయ్ ఆరోపించారు. దీంతో తమిళ రాజకీయాల్లో ఈ అంశం మరోసారి హాట్ డిబేట్ కు వేదికగా మారింది. గత నెలలో కరూర్ లో విజయ్ రోడ్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
తొక్కిసలాట తర్వాత విజయ్ వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆయన వ్యవహరించిన తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి అస్రాగార్గ్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసింది. అయితే తన పర్యటన సమయంలో పోలీసులు సరైన భద్రత కల్పించలేదని, అదేవిధంగా పోలీసుల దర్యాప్తు, అధికారుల పాత్రపై తమ అనుమానాలను ఇదివరికే లేవనెత్తినప్పటికీ రాష్ట్ర పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటును హైకోర్టు అనుమతించడంపై టీవీకే అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
తమ పార్టీపై సిట్ పక్షపాతంతో వ్యవహరిస్తోందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన టీవీకే.. తమ పార్టీ అధినేతపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సిట్ దర్యాప్తును ప్రభావితం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. టీవీకే పార్టీ అధినేత విజయ్ కు నాయకత్వ లక్షణాలు లేవని, ఘటన జరిగిన వెంటనే ఆయన పారిపోయారని వ్యాఖ్యానించిన మద్రాసు హైకోర్టు కరూర్ ఘటనపై టీవీకే పార్టీ తీరును తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే.
తొక్కిసలాట తర్వాత అన్ని పార్టీలూ సహాయక చర్యలు చేపడితే నిర్వాహకులు వెళ్లిపోయారని తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని టీవీకే పార్టీ తన పిటిషన్ లో ప్రస్తావించింది. తమ ర్యాలీలో ఇబ్బందులు స్రుష్టించేందుకు ముందస్తు కుట్రలను తోసిపుచ్చలేమని అనుమానం వ్యక్తం చేసింది. మరోవైపు తొక్కిసలాటలో మరణించిన 13 ఏళ్ల బాలుడి తండ్రి సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన కోరాడు.
