దళపతికి కలిసొస్తున్న కాలం.. హైకోర్టు కీలక తీర్పు
తమిళనాడు రాజకీయాలను మలుపు తిప్పేలా హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.
By: Tupaki Political Desk | 13 Oct 2026 10:00 PM ISTతమిళనాడు రాజకీయాలను మలుపు తిప్పేలా హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. గతంలో ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన ఆరుగురి విషయంలో ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించిందని అంటున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా మిత్రపక్షాల బెదిరింపుల నడుమ భయం భయంగా ప్రభుత్వాన్ని నడుపుతున్న దళపతి విజయ్ ప్రభుత్వం త్వరలో పూర్తి మెజార్టీ సంపాదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని అంటున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో అనుకూలంగా ఓటు వేసిన ఆరుగురు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ విప్ కృష్ణమూర్తి స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో విశ్వాస పరీక్షలో ఓటువేసిన ఎమ్మెల్యేలు ఆరుగురు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. అయితే తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్ పెండింగులో ఉండగా, స్పీకర్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అన్నాడీఎంకే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై తాజాగా తీర్పునిచ్చిన హైకోర్టు స్పీకర్ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని వెల్లడించింది. దీంతో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామాపై వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లైంది. ఇక రాజీనామా ఆమోదానికి సంబంధం లేకుండా అన్నాడీఎంకే వేసిన అనర్హత పిటిషన్ పై రెండు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం వెలువరించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
ఇక హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్యేలు రాజీనామా స్థానాలు ఖాళీ అయినట్లుగా భావిస్తున్నారు. మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా, ఇప్పటికే రెండు చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలే తిరిగి టీవీకే ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇప్పుడు మిగిలిన నాలుగు స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహణకు రూట్ క్లియర్ అయిందని అంటున్నారు. అంతేకాకుండా తాజా తీర్పుతో అన్నాడీఎంకే నుంచి మరికొన్ని వలసలు ఉండే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
నిజానికి విజయ్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్నాడీఎంకేలో భారీ చీలిక వచ్చింది. ఒక వర్గం టీవీకే ప్రభుత్వంతో చేతులు కలపడానికి సిద్ధం అవగా, అందులో కొందరు ముందే రాజీనామాలు చేయడంతో విభేదాలు తలెత్తి చీలిక వర్గం మళ్లీ అన్నాడీఎంకేతో చేతులు కలిపిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో టీవీకేలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారి ఎన్నికకు అవాంతరాలు ఏర్పాడ్డాయని చెబుతున్నారు. అయితే హైకోర్టు తాజా తీర్పుతో ప్రస్తుతం మిగిలిన నాలుగు స్థానాలు ఖాళీ అయినట్లు ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో త్వరలో ఈ స్థానాలకు ఎన్నికలు జరిగే చాన్స్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీవీకే కు ఈ పరిణామం లాభిస్తుందని అంచనా వేస్తున్నారు.
