Begin typing your search above and press return to search.

పరకామణి చోరీ కేసు రాజీ ఎఫెక్ట్.. నిందితులైన ముగ్గురు పోలీసులు

తిరుమల పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ ఉదంతంపై కేసు నమోదు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది.

By:  Tupaki Political Desk   |   6 Jan 2026 5:08 PM IST
పరకామణి చోరీ కేసు రాజీ ఎఫెక్ట్.. నిందితులైన ముగ్గురు పోలీసులు
X

తిరుమల పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ ఉదంతంపై కేసు నమోదు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఈ వ్యవహారంతో సంబంధం ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు పోలీసులను నిందితుల జాబితాలో చేర్చాలని హైకోర్టు తాజాగా సూచించింది. 2023లో తిరుమల పరకామణిలో టీటీడీ ఉద్యోగి సి.రవికుమార్ చోరీ చేస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. నిందితుడుని అప్పటి సీవీఎస్వో సతీష్ కుమార్ రెడ్ హ్యాండెడుగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత నిందితుడి ఆస్తులను శ్రీవారికి కానుకగా సమర్పించి కేసు రాజీ చేసుకున్నాడు.

అయితే పరకామణిలో చోరీ చేసిన నిందితుడు, శిక్ష అనుభవించకుండా రాజీ చేసుకోవడం చట్టవిరుద్ధమంటూ జర్నలిస్టు శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనికి సాక్ష్యంగా పరకామణిలో రవికుమార్ చోరీ చేస్తున్న సీసీ టీవీ పుటేజ్ ను గతంలోనే సమర్పించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు, కేసును రాజీ చేసుకోవడాన్ని తప్పుపడుతూ సీఐడీ విచారణకు ఆదేశించింది. ఈ విచారణ పూర్తయిన తర్వాత సిట్ హైకోర్టుకు నివేదిక సమర్పించగా, సంబంధిత బాధ్యులపై కేసులు నమోదు చేయాల్సిందిగా కొద్దిరోజుల క్రితం హైకోర్టు సూచించింది.

ఇక ఉన్నత న్యాయస్థానం సూచనలతో సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. అప్పటి తిరుమల సీఐ జగన్ మోహన్ రెడ్డి, టూ టౌన్ సీఐ చంద్రశేఖర్, ఎసై లక్ష్మీ రెడ్డికి చోరీ కేసు రాజీలో ప్రమేయం ఉందని గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ ముగ్గురిపై ఆరోపణలకు ఆధారాలు లభించడంతో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు ఏపీ సీఐడీ అధికారులు. ఇదేకేసుకు సంబంధించి కీలక పత్రాలు తారుమారు చేశారనే అభియోగాలు ఎదుర్కొంటున్న వన్‍టౌన్ సీఐ విజయ్ కుమార్ పైనా సీఐడీ చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

సీఐడీ కేసుల నమోదుతో పోలీసులే నిందితులుగా మారినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారం వెలుగు చూసినప్పటి నుంచి అప్పట్లో తిరుమల, తిరుపతిల్లో పనిచేసిన పోలీసు అధికారుల పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే ముగ్గురు పోలీసులను బాధ్యతల నుంచి తప్పించి వీఆర్ కు పంపింది. ఇప్పుడు క్రిమినల్ కేసులు కూడా నమోదు కానుండటంతో సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పరకామణి నిందితుడు రవికుమార్ ఆస్తుల్లో కొన్ని ఈ ముగ్గురు పోలీసు అధికారుల బంధువులు, బినామీల పేరున రిజిస్ట్రర్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.