కోర్టుకు రండి.. లేదా 20 వేల జరిమానా కట్టండి: టీటీడీకి హైకోర్టు ఆదేశం!
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు.. శ్రీవారు కొలువైన.. తిరుమలలో వైసీపీ హయాంలో జరిగిన పరకామణి చోరీ వ్యవహారంపై తాజాగా హైకోర్టు సీరియస్ అయింది.
By: Garuda Media | 17 Oct 2025 4:09 PM ISTఅఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు.. శ్రీవారు కొలువైన.. తిరుమలలో వైసీపీ హయాంలో జరిగిన పరకామణి చోరీ వ్యవహారంపై తాజాగా హైకోర్టు సీరియస్ అయింది. ఇప్పటికే ఈ కేసును రెండు సార్లు విచారించిన కోర్టు.. గత విచారణ సమయంలో డీజీపీపై నిప్పులు చెరిగింది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పరకామణి వ్యవహారంపై టీటీడీ తరఫున కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. అంతేకాదు.. ఇది ఈవో నిర్లక్ష్యంగానే పరిగణిస్తున్నట్టు తెలిపింది.
ఈ నెల 27న జరిగే విచారణకు టీటీడీ ఈవో ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. రాకుంటే.. కోర్టుకు రూ.20 వేల జరిమానా చెల్లించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈవ్యవహా రం హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి వైసీపీ హయాంలో పరకామణిలో కుంభకోణం జరిగింది. అప్పటి అధికారి ఒకరు పరకామణి నగదు లెక్కింపు సందర్భంగా దొంగతనానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని వైసీపీ ప్రభుత్వంలోనే గుర్తించారు. ఈ క్రమంలో ఆయనపై కేసు నమోదు చేశారు.
అయితే.. ఈ కేసును లోక్ అదాలత్‌లో పరిష్కరించారు. అప్పట్లో తాను రూ.కోటి విలువైనస్వామి వారి డాలర్లను దొంగిలించానని ఒప్పుకొన్న అధికారిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఆయన పరిహారం గా స్వామికి తన ఆస్తుల నుంచి 10 కోట్ల రూపాయలు కూడా ఇచ్చారు. అయితే.. ఇంత పెద్ద కేసును లోక్ అదాలత్‌లో పరిష్కరించడం ఏంటన్నది బీజేపీ నాయకుల సందేహం. అందుకే దీనిపై కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఈ విచారణ కోర్టు పరిధిలో ఉంది. తాజాగా.. ఈ వ్యవహారంపై అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై టీటీడీ ఈవోపై హైకోర్టు సీరియస్ అయింది.
