సుప్రీంలో తెలుగు మాటలు.. విడాకుల కేసులో మాట్లాడిన జడ్జి
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక విడాకుల కేసు సందర్భంగా సుప్రీంకోర్టు జడ్జి తెలుగులో మాట్లాడటం ఆసక్తికరమని చెప్పాలి.
By: Garuda Media | 13 Sept 2025 4:00 PM ISTదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అరుదైన పరిణామం చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక విడాకుల కేసు సందర్భంగా సుప్రీంకోర్టు జడ్జి తెలుగులో మాట్లాడటం ఆసక్తికరమని చెప్పాలి. చాలా కాలం తర్వాత సుప్రీంకోర్టులో తెలుగు మాటలు వినిపించటం ఇదే తొలిసారిగా చెప్పాలి. గతంలో తెలుగు ప్రాంతానికి చెందిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా వ్యవహరించిన సందర్భంగా కేసు విచారణ సందర్భంగా తెలుగులో మాట్లాడారు. మళ్లీ.. ఇన్నాళ్లకు తెలుగు మాటలు వినిపించిన పరిస్థితి.
కేసు విచారణ సందర్భంగా భార్యభర్తలతో తెలుగులో మాట్లాడారు. తాజా కేసు విషయానికి వస్తే.. ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు విడిపోవటానికి తాము సిద్ధమని భార్య స్పష్టం చేయటంతో.. వారిద్దరికి విడాకులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భార్యభర్తల మధ్య వివాద పరిష్కారాన్ని తాము విజయంగా భావించటం లేదని.. ఇలాంటి కేసుల్లో ఉత్తర్వులు ఇచ్చే సమయంలో తమకు ఎంతో బాధ ఉంటుందని.. ఇద్దరి మధ్యా రాజీ కుదిరి ఉంటే నిజంగా సంతోషించేవాళ్లమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పేర్కొంటూ.. ‘ఇదే జీవితం’ అంటూ వ్యాఖ్యానించారు.
ఇంతకూ తెలుగు ప్రాంతానికి చెందిన వారి విడాకుల కేసు సుప్రీంకోర్టు వరకు ఎందుకు వెళ్లింది? ఈ కేసులో ఏముంది? ఆ వివరాల్లోకి వెళితే.. కాకినాడకు చెందిన మధుసూదనరావు కెనడాలో నివాసం ఉంటున్నారు. 2022లో ఆయన భార్య వరకట్నం కేసు నమోదు చేయటంతో పోలీసులు విచారణ జరిపి కాకినాడ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. దీంతో.. మధుసూదనరావుపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
2024 ఫిబ్రవరి 16న ఆయన భారత్ కు వచ్చిన సందర్భంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. అనంతరం కోర్టు నుంచి బెయిల్ పొందారు. అయితే.. ఆయన కెనడా పాస్ పోర్టును మేజిస్ట్రేట్ కోర్టుకు అప్పగించారు. తన పాస్ పోర్టు తనకు ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టును కోరారు. అందుకు నిరాకరిస్తూ.. కేసు విచారణను మూడు నెలల్లో ముగించాలని ట్రయల్ కోర్టును హైకోర్టు ఆదేశించింది.
ఈ తీర్పును సవాలు చేస్తూ.. మధుసూదన్ రావు సుప్రీంకోర్టులో ఎస్ఎల్ పీ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి సుప్రీం.. మధ్యవర్తిత్వానికి పంపింది. ఈ సందర్భంగా తాము పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లుగా భార్యభర్తలు స్పష్టం చేశారు. కొడుకు అవసరాల కోసం భర్త రూ.45 లక్షలు చెల్లించేందుకు అంగీకరించారు. ఈ కేసు విచారణ శుక్రవారం కోర్టు ముందుకు వచ్చినప్పుడు జస్టిస్ ఎస్ వీఎన్ భట్టి పిటిషనర్ మధుసూదనరావును తెలుగులో ప్రశ్నించారు. సెటిల్ మెంట్ మొత్తం ఎంత? ఆ మొత్తం అంతా ఇచ్చేశారా? ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడ ఉంది? అని ప్రశ్నించి.. మధుసూదన్ భార్యను వీడియో కాన్ఫరెస్సు ద్వారా ఆమెను వివరాలు అడిగారు.
సెటిల్ మెంట్ అమౌంట్ తీసుకున్న తర్వాత తాను ఇబ్బంది పెట్టనని మధుసూదన్ భార్య చెబుతూ.. బాబు మేజర్ అయ్యాక అతనేం చేస్తాడో తాను చెప్పలేనని బదులిచ్చారు. ఈ సందర్భంగా డిపాజిట్ చేసిన మొత్తం.. దానిపై వడ్డీ గురించి మధుసూదన్ వివరించే ప్రయత్నం చేయగా.. జస్టిస్ భట్టి జోక్యం చేసుకొని.. ఇప్పటివరకు బిడ్డకు ఏమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. దీనికి బదులుగా తాను ఇచ్చానని మధుసూదన్ చెప్పగా.. జస్టిస్ భట్టి విభేదిస్తూ.. మీరు ఇవ్వలేదని తాను చదివానని.. ఊరికే ఎక్కువ చెబితే విచారణ వాయిదా వేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు.
కెనడాలో కేసులు యాంత్రికంగా నిర్ణయిస్తారని.. భారత్ లో మాత్రం తాము మనసు పెట్టి నిర్ణయిస్తామన్న జస్టిస్ భట్టి.. బిడ్డకు ఏం చేయాలన్నది భారతీయ అమ్మలకు తెలిసినట్లుగా ఎవరికీ తెలీదని వ్యాఖ్యానించారు. సెటిల్ మెంట్ ప్రకారం ముందుకు వెళ్లేందుకు మధుసూదన్ భార్య సంసిద్ధతను వ్యక్తం చేయటంతో ఇరువురికి విడాకులు ఇవ్వటానిక సుప్రీం అంగీకరించింది. రూ.45 లక్షలను తల్లి.. మైనర్ కొడుకు పేరుతో ఉన్న జాయింట్ అకౌంట్ లో జమ చేయాలని చెప్పింది. బాలుడి అవసరాలకే ఆ మొత్తాన్ని వినియోగించాలని కోరింది. మధుసూదన్ పాస్ పోర్టు తిరిగి ఇచ్చేయాలని.. లుక్ అవుట్ నోటీసు ఉపసంహరించాలని నిర్దేశించింది. ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ భట్టి.. తెలుగులో మాట్లాడారు.
