Begin typing your search above and press return to search.

విడాకుల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. అది నేరం కాదని స్పష్టం!

చిన్న చిన్న సమస్యలతో దంపతులు విడిపోతున్న కారణాలు ఇటీవల భారీగా జరుగుతున్నాయి.

By:  Tupaki Political Desk   |   7 Jan 2026 5:45 PM IST
విడాకుల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. అది నేరం కాదని స్పష్టం!
X

చిన్న చిన్న సమస్యలతో దంపతులు విడిపోతున్న కారణాలు ఇటీవల భారీగా జరుగుతున్నాయి. ఇద్దరూ సంపాదకులు కావడంతో విడిపోవాలనే డిషిజన్ కూడా వేగంగా తీసుకుంటున్నారు. భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగాల్లో ఉన్న పరిస్థితుల్లో వంట చేయలేదని, భర్త తల్లికి సహకరించలేదని ఆరోపిస్తూ దాన్ని ‘క్రూరత్వం’గా పరిగణించి విడాకులు మంజూరు చేయలేమని హైకోర్టు స్పష్టంగా తేల్చి చెప్పింది. ఇలాంటి కారణాలు వివాహ బంధాన్ని రద్దు చేసే స్థాయికి చేరవని పేర్కొంది.

తెలంగాణ హైకోర్టులో కేసు..

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి, భార్య కారణంగా తాను హింసకు గురవుతున్నానని, వివాహాన్ని రద్దు చేయాలని కోరుతూ దిగువ కోర్టును ఆశ్రయించాడు. అయితే, ఆ కోర్టు పిటిషన్‌ను తిరస్కరించడంతో అతడు హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య, జస్టిస్‌ నగేశ్‌ భీమపాకలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి తాజాగా తీర్పు వెలువరించింది.

భర్త చేసిన ఫిర్యాదులు..

విచారణ సందర్భంగా భర్త మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 10 గంటల వరకు కార్యాలయ విధుల్లో ఉంటాడని, భార్య ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగం చేస్తుందని ధర్మాసనం గమనించింది. ఈ పరిస్థితుల్లో ఉదయం వంట చేయలేదన్న ఒక్క కారణాన్ని క్రూరత్వంగా పరిగణించలేమని కోర్టు అభిప్రాయపడింది.

తక్కువ సమయం పుట్టింట్లో ఉండడం నేరం కాదు..

భర్త తన వాంగ్మూలంలో భార్య తరచూ పుట్టింటికి వెళ్లి తమతో కలిసి ఉండట్లేదని పేర్కొన్నప్పటికీ, వివాహం జరిగి ఏడాది 9 నెలలు కాగా, అందులో భార్య తనతో కలిసి ఉన్న కాలాన్ని ఒకసారి 5 నెలలని, మరోసారి 3 నెలలని భిన్నంగా చెప్పిన విషయాన్ని కోర్టు గుర్తించింది. ఈ విభిన్న వాంగ్మూలాలు భర్త ఆరోపణలపై సందేహం కలిగిస్తున్నాయని పేర్కొంది.

అలాగే, పెళ్లి అనంతరం గర్భస్రావం జరిగిన నేపథ్యంలో భార్య కొంతకాలం తల్లిదండ్రుల వద్ద ఉండడాన్ని కూడా క్రూరత్వంగా పరిగణించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో భార్య ప్రవర్తనను హింసగా అభివర్ణించడం తగదని పేర్కొంది.

వేరుకాపురం నేరమే అయినా ప్రత్యేకంగా చూడాలి..

వేరు కాపురం పెట్టాలన్న ప్రతిపాదన కొన్ని సందర్భాల్లో క్రూరత్వం కిందికి రావచ్చని సుప్రీంకోర్టు పేర్కొన్నప్పటికీ, అది ఆయా కేసుల వాస్తవాలపై ఆధారపడి ఉంటుందని ధర్మాసనం వివరించింది. ప్రస్తుత కేసులో వేరు కాపురం ప్రతిపాదనను భార్య చేయలేదని, ఆమె తరఫు న్యాయవాది అలా సలహా ఇచ్చిన విషయమేనని కోర్టు గమనించింది. అందువల్ల దీనిని క్రూరత్వంగా పరిగణించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

ఈ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత, భర్త చేసిన ఆరోపణలు విడాకులు మంజూరు చేసే స్థాయిలో క్రూరత్వాన్ని నిరూపించవని తేల్చిన హైకోర్టు, అప్పీల్‌ను కొట్టివేస్తూ దిగువ కోర్టు తీర్పును సమర్థించింది.