Begin typing your search above and press return to search.

భార్య జీవితభాగస్వామి.. పనిమనిషి కాదు: సుప్రీంకోర్టు

విడాకుల కేసుకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్య ఇప్పుడు సంచలనంగా మారింది.

By:  Garuda Media   |   21 March 2026 10:20 AM IST
భార్య జీవితభాగస్వామి.. పనిమనిషి కాదు: సుప్రీంకోర్టు
X

విడాకుల కేసుకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్య ఇప్పుడు సంచలనంగా మారింది. భార్యను జీవితభాగస్వామిగా చూడాలే తప్పించి ఇంటి పనిమనిషిలా చూడకూడదని తేల్చింది. ఇంటి పనుల్లో భర్తలు కూడా సమానంగా బాధ్యతల్ని పంచుకోవాలని స్పష్టం చేసింది. భార్యభర్తల సంబంధాల్లో సమానత్వం ముఖ్యమన్న సుప్రీంకోర్టు.. ‘‘పెళ్లి చేసుకున్నది జీవితభాగస్వామి కోసమే కానీ సేవలు చేయించుకోవటానికి కాదు’’ అని స్పష్టం చేసింది. ఇంతకూ ఈ విడాకుల కేసు నేపథ్యం ఏంటి? ఏ సందర్భంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది? ఇప్పుడు ఈ జంట ఎలా ఉన్నారు? విడాకులకు సంబంధించి సుప్రీం తుది తీర్పును ఎప్పుడు ఇవ్వనుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.

మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తన భార్య నుండి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. స్కూల్ టీచర్ గా పని చేసే అతడి భార్య కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తుంటారు. 2017లో వీరికి పెళ్లి కాగా.. 2019నుంచి విడిగా ఉంటున్నారు. వీరికి ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నాడు. తన భార్యతో తనకు విడాకులు కావాలన్న అతడు.. భార్య మీద అతడికున్న ఫిర్యాదుల్ని చూస్తే.. ‘‘ఆమె ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తుంది. సరిగ్గా వంట చేయడం లేదు. ఇంటి పనులు సక్రమంగా నిర్వహించడం లేదు. నా భార్య ప్రవర్తన నా పట్ల "క్రూరత్వం" కిందకు వస్తుంది’ అని తన తరఫు న్యాయవాది చేత వాదనలు వినిపించాడు.

ఈ వాదనలపై తొలుత ఫ్యామిలీ కోర్టు.. తర్వాత బాంబే హైకోర్టు సైతం భర్త వాదనను తోసిపుచ్చాయి. భార్య ఇంటి పనులు చేయకపోవటం విడాకులు ఇవ్వటానికి తగిన కారణం కాదని పేర్కొన్నాయి. విడాకులు ఇవ్వటానికి తగిన కారణం కాదని తేల్చటంతో చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసం భర్త వినిపించిన వాదనను తప్పు పడుతూ.. భర్త విడాకుల పిటిషన్ ను కొట్టివేశాయి. ఈ సందర్భంగా భర్తను ఉద్దేశంచి సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

‘‘నువ్వు పెళ్లి చేసుకున్నది జీవితభాగస్వామిని. పనిమనిషిని కాదు. భార్య కేవలం ఇంటి పనులు చేయటానికే ఉందనే ఆలోచనా ధోరణి తప్పు. ఆధునిక కాలంలో భర్తలు వంట, శుభ్రం చేయటం లాంటి పనుల్లో భార్యకు తోడుగా ఉండాలని.. అది కేవలం ఆమె బాధ్యతే కాదు. భర్త వంట చేయకపోవటం.. పనులు చేయకపోవటంతో భర్తకు మానసిక.. శారీరక క్రూరత్వం జరిగినట్లు భావించలేం. భార్య ప్రవర్తనలో ఎలాంటి క్రూరత్వం లేదు. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును మేం సమర్థిస్తున్నాం’’ అని పేర్కొంది.

భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు.. దంపతులు తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకొని కలిసి ఉండాలన్న సూచన చేసింది. కలిసి ఉండే విషయంపై భర్త సానుకూలంగా లేరు. భార్య మాత్రం తన ఎనిమిదేళ్ల కొడుకు భవిష్యత్తు కోసం కలిసి ఉండేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. ఈ కేసును తదుపరి విచారణను ఏప్రిల్ 27కు వాయిదా వేశారు. అప్పటికి కోర్టు ముందుకు దంపతులు ఇద్దరు హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ విడాకుల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. తుది తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.