రూ.20ల లంచం కేసు.. 30 ఏండ్లకు తుది తీర్పు
భారత న్యాయ వ్యవస్థలో న్యాయం జరగడానికి ఆలస్యం కావచ్చు కానీ, న్యాయం మాత్రం పక్కాగా జరుగుతుందని అంటారు.
By: Ramesh Palla | 20 Aug 2026 3:11 PM ISTభారత న్యాయ వ్యవస్థలో న్యాయం జరగడానికి ఆలస్యం కావచ్చు కానీ, న్యాయం మాత్రం పక్కాగా జరుగుతుందని అంటారు. అయితే న్యాయం జరగడానికి రెండు మూడు ఏళ్లు లేదా అయిదు ఏళ్ళు అయితే పర్వాలేదు కానీ ఒక కేసులో నిందితులకు ఏకంగా 30 ఏళ్లకు న్యాయం జరగడం తో మరోసారి భారత న్యాయ వ్యవస్థ గురించి చర్చ జరుగుతోంది. గుజరాత్ లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 1996లో నమోదు అయిన ఒక అవినీతి ఆరోపణ కేసు 2026 లో అంటే ఏకంగా 30 ఏళ్ల తర్వాత పరిష్కారం అయింది. ఇన్నాళ్లు ఆ కేసు ఎన్నో మలుపులు తిరిగింది, కేసుకు సంబంధించిన వారు, కేసు ఆరంభంలో ఉన్న వారు చాలా మంది ఇప్పుడు కనీసం లేచి నిల్చునే పరిస్థితి లేదు. ఇన్నాళ్ల తర్వాత అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఇద్దరు నిర్ధోషులు అని కోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది.
గుజరాత్ అవినీతి కేసులో తీర్పు...
ఈ అవినీతి కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే... గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా బెచారి గ్రామ మంచాయతీ కార్యాలయంలో ఒక విద్యార్థి ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఆ సర్టిఫికెట్ ఇవ్వడానికి క్లర్క్ రూ.120లు లంచం డిమాండ్ చేసినట్లుగా విద్యార్థి ఆరోపించాడు. ఆ రూ.120ల్లో క్లర్క్‌కి రూ.100లు, ప్యూన్ కి రూ20లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారట. ఈ విషయాన్ని సదరు విద్యార్థి ఏసీబీ వారికి తెలియజేశాడు. అవినీతి నిరోధక శాఖ వారు వల వేసి విద్యార్థి డబ్బులు ఇస్తున్న సమయంలో క్లర్క్, ప్యూన్ ను పట్టుకున్నారు. ఆ సమయంలో ఏసీబీ వారికి ప్యూన్ వద్ద కేవలం రూ.20 లు మాత్రమే లభించాయి. క్లర్క్ కి డబ్బులు ఇచ్చినట్లుగా ఆధారాలు లభించలేదు, అంతే కాకుండా ఆ క్లర్క్ వద్ద డబ్బులు కూడా ఏసీబీ వారు పట్టుకోలేకపోయారు. అయినా కూడా అవినీతి ఆరోపణల కేసులో క్లర్క్, ప్యూన్‌లపై కేసు నమోదు చేయడం జరిగింది.
సుప్రీం కోర్ట్ విచారణ తర్వాత...
సుదీర్ఘ విచారణ కొనసాగిన తర్వాత కేసును కోర్ట్‌కు తీసుకు వెళ్లారు. కింది స్థాయి కోర్ట్ అవినీతి జరిగిందని తీర్పు ఇవ్వడంతో పాటు, ఆ ఇద్దరిపై చర్యలకు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే క్లర్క్, ప్యూజ్ న్యాయపోరాటం చేయడం మొదలు పెట్టారు. గత కొంత కాలంగా సుప్రీం కోర్ట్‌లో ఈ కేసు విచారణ కొనసాగుతూ వస్తోంది. ఎట్టకేలకు సుప్రీం కోర్ట్ ధర్మాసనం ఈ కేసులో తుది తీర్పు వెలువరించి ఆ ఇద్దరు ఉద్యోగుల తరఫున తీర్పు ఇచ్చింది. 2015 లో గుజరాత్ హైకోర్ట్ ఇచ్చిన కన్విక్షన్ తీర్పున కొట్టి వేస్తూ సుప్రీం కోర్ట్ అవినీతి జరగలేదు అని తీర్పు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. 30 ఏళ్లుగా వారు అవినీతిపరులు అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వారు అవినీతిపరులు కారు అంటూ తీర్పు రావడం, అది కూడా సుప్రీం కోర్ట్ ఆ తీర్పును ఇవ్వడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు..
క్లర్క్‌ను విచారించిన సమయంలో తనకు ఆ విద్యార్థి ఇన్‌కమ్ సర్టిఫికెట్ ఇచ్చిన సందర్భంగా సంతోషంగా ఇచ్చినట్లుగా చెప్పాడు. అంతే కాకుండా ఆ విద్యార్థి సైతం విచారణ సమయంలో తాను రూ.20లు మాత్రమే ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు. క్లర్క్ ఈ సందర్భంగా డబ్బులు తీసుకున్నట్లు ఎలాంటి ఆధారం లేదు. పైగా అతడి వద్ద డబ్బు నోట్లు కూడా స్వాధీనం చేసుకోలేదు. విద్యార్థి ఇచ్చిన వాంగ్మూలం లో తప్పులు ఉన్నాయి. వేరు వేరు సందర్భాల్లో వేరు వేరుగా అతడు తన మాట మార్చడంను బట్టి చూస్తూ ఉంటే క్లర్క్, ప్యూన్ లపై అతడు ఉద్దేశపూర్వకంగా అవినీతి ఆరోపణలు చేశాడా అనే అనుమానాలు సైతం కలుగక మానవు. అందుకే సుప్రీం కోర్ట్ వారిద్దరినీ నిర్ధోషులుగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ 30 ఏళ్లలో ఆ ఇద్దరు పడిన మానసిక నరక యాతనకు పరిష్కారం ఏంటీ అనేది మాత్రం కోర్ట్ చెప్పలేదు. ఇలా ఎన్నో కేసుల్లో చిక్కుకున్న నిర్దోషులు తమకు ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుందని ఏళ్లకు ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు.
