Begin typing your search above and press return to search.

వీధికుక్కల దాడిలో ఎవరైనా మరణిస్తే వారిదే బాధ్యత -సుప్రీం కోర్ట్

వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు రోజువారీ విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   13 Jan 2026 3:22 PM IST
వీధికుక్కల దాడిలో ఎవరైనా మరణిస్తే వారిదే బాధ్యత -సుప్రీం కోర్ట్
X

దేశంలోని పలు ప్రాంతాలలో కోతుల బెడద ఏ విధంగా అయితే ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందో.. అలాగే వీధి కుక్కల దాడులు కూడా అంతేవేగంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్దులపై ఈ వీధి కుక్కల దాడులు బాధిత కుటుంబాలలో విషాదాన్ని నింపుతున్నాయి. ఈ వీధి కుక్కలు వారిపై దాడి చేయడమే కాకుండా అన్యం పుణ్యం తెలియని చిన్నారుల ప్రాణాలను కూడా కబలిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వీధి కుక్కలను సంరక్షణ కేంద్రాలకు తరలించాలని కొంతమంది డిమాండ్ చేస్తుంటే.. వాటి తరపు మాట్లాడేవారు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దేశాన్ని అట్టుడికిస్తున్న ఈ వీధి కుక్కల చర్చ ఏకంగా సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఈ విషయంపై విచారణ జరిపిన ధర్మాసనం వీధి కుక్కల పై పలు కామెంట్లు చేస్తూనే.. ఈ వీధి కుక్కల దాడిలో ఎవరైనా మరణిస్తే వారిదే బాధ్యత అంటూ తెలిపింది.

వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు రోజువారీ విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు జనవరి 13న మంగళవారం నాటి విచారణలో కీలక వ్యాఖ్యలు చేసింది. చిన్నారులు, వృద్ధులపై కుక్కలు దాడి చేసి గాయపరిచినా లేదా ప్రాణాలు తీసినా ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని, అందుకు నష్టపరిహారం కూడా చెల్లించాలని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ముఖ్యంగా కుక్కలకు ఆహారం పెట్టేవారు కూడా ఆ వీధి కుక్కలను తమ ఇళ్ళకే తీసుకెళ్లాలని న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ తెలిపారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

నిజానికి గతంలో బస్ స్టాండ్ లు, క్రీడా ప్రాంగణాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, రైల్వేస్టేషన్ల నుంచి ఈ వీధి కుక్కలను తొలగించి, నిర్దేశిత కేంద్రాలకు వాటిని తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయా ప్రాంతాలలోకి ఈ వీధి కుక్కలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, వాటిని పట్టుకున్న చోటే తిరిగి వదలకూడదు అని కూడా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ వీధికుక్కల దాడుల అంశాన్ని సుమోటోగా సుప్రీంకోర్టు స్వీకరించి.. విచారణ చేపట్టింది.

పైగా నిత్యం అధికారులు క్రమం తప్పకుండా ప్రభుత్వ ప్రజా సంస్థల ప్రాంగణాలలో కుక్కలు లేవని నిర్ధారించుకోవడానికి తనిఖీలు చేయాలి అని, ఇలాంటి చోట్ల కుక్కల దాడులు జరగడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అని కూడా కోర్టు అభిప్రాయపడింది. వీధి కుక్కల సమస్య చాలా తీవ్రంగా ఉందని, వీటిని బయటకు వదలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. ముఖ్యంగా వీటిని తరలించడాన్ని అడ్డుకునే వ్యక్తులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇక అలా నిత్యం జరుగుతున్న దాడులను తగ్గించడానికి ప్రతిరోజు విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ఇకనైనా ప్రజలు, అధికారులు అప్రమత్తమయి ఇకపై వీధి కుక్కల దాడులు జరగకుండా చూడాలని కూడా బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.