Begin typing your search above and press return to search.

యూజీసీపై సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు.. చదవాలి అందరూ!

అవును... ఉన్నత విద్యా సంస్థలలో సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

By:  Raja Ch   |   29 Jan 2026 5:17 PM IST
యూజీసీపై సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు.. చదవాలి అందరూ!
X

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ)పై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దర్నాలు, ర్యాలీలూ, తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదని అంటున్నారు. ఈ సమయంలో.. ఈ నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిల్ పై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది.

అవును... ఉన్నత విద్యా సంస్థలలో సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో ఈ మేరకు తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై గురువారం స్టే విధించింది. ఈ సందర్భంగా.. చట్టంలోని వివక్షతకు సంబంధించిన వివాదాస్పద నిర్వచనంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిబంధనను సుప్రీంకోర్టు నిలిపివేసింది. తదుపరి నోటీసులు ఇచ్చేంతవరకు నిబంధనలపై స్టే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

తాజా నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి జోయ్‌ మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా అటు కేంద్రానికి, ఇటు యూజీసీకి నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా... స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని దశాబ్దాల తర్వాత.. కులవివక్ష లేని సమాజం కోసం మనం ఏం సాధించాం అని ప్రశ్నిస్తూ.. ఈ విషయంలో మనం మళ్లీ సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్నామా అనే భావన కలుగుతోందని సుప్రీం అభిప్రాయపడింది!

ఈ సందర్భంగా... దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు ఇలా దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు తమ సంప్రదాయాలకు అనుగుణంగానే వ్యవహరిస్తారని.. అలాంటివారిని ర్యాగింగ్‌ పేరుతో కొందరు అవహేళన చేస్తుండటం అత్యంత బాధాకరమని.. వాటిని అరికట్టేందుకు ప్రత్యేక హాస్టళ్లు ఉండాలని మాట్లాడుతున్నారని చెప్పిన ధర్మాసనం... మరోవైపు ప్రస్తుతం సమాజంలో కులాంతర వివాహాలే జరుగుతున్నాయని.. హాస్టళ్లలోనూ అందరూ కలిసే ఉంటున్నారని తెలిపింది.

కాగా... రోహిత్‌ వేముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యూజీసీ నిబంధనలు-2012 స్థానంలో కొత్త నిబంధనలను ఈనెల 13 నుంచి అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే, కొత్త నిబంధనలలోని కులవివక్ష నిర్వచనాన్ని ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికే పరిమితం చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే... కొత్త నిబంధనలలోని కులవివక్ష నిర్వచనాన్ని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికే పరిమితం చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ఇదే క్రమంలో... కులం ఆధారంగా జనరల్‌ లేదా నాన్‌ రిజర్వుడు కేటగిరీ విద్యార్థులు కూడా వివక్షను ఎదుర్కొనే అవకాశం ఉందని.. కులానికి తావివ్వనిరీతిలో వివక్ష అనే పదాన్ని నిర్వచించేలా యూజీసీకి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌ పిల్‌ లో కోరారు. ఈ నేపథ్యంలోనే... విద్యా సంస్థలలో స్వేచ్ఛాయుతమైన, సమానమైన, సమ్మిళిత వాతావరణాన్ని తాము కోరుకుంటున్నామని చెబుతూ.. సుప్రీంకోర్టు స్టే విధించింది.

ఢిల్లీ యూనివర్సిటీలో నిరసనలు!:

మరోవైపు... ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని నార్త్ క్యాంపస్‌ లో.. కొత్తగా నోటిఫై చేయబడిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జనరల్ కేటగిరీకి చెందిన విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా స్పందించిన విద్యార్థులు.. క్యాంపస్‌ లలో నిబంధనలు సమానత్వానికి బదులుగా వివక్షను ప్రోత్సహిస్తాయని పేర్కొన్నారు. జనరల్ కేటగిరీ విద్యార్థుల ప్రాతినిధ్యానికి కట్టుబడి ఉండే ఎటువంటి నిబంధన లేదని వారు ఎత్తి చూపారు.

బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు రాజీనామా!:

ఇదే సమయంలో... కొత్త యూజీసీ విధానాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాయ్‌ బరేలి లోని సలోన్ నియోజకవర్గం నుండి బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు శ్యామ్ సుందర్ త్రిపాఠి తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాసిన లేఖలో త్రిపాఠి తన రాజీనామాను వెల్లడించారు. అగ్రవర్ణ పిల్లలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన రిజర్వేషన్ బిల్లు లాంటి నల్ల చట్టం కారణంగా, తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ చట్టం సమాజానికి అత్యంత ప్రమాదకరమైనదని అభిప్రాయపడ్డారు.