Begin typing your search above and press return to search.

అనంత్ అంబానీ వంతారా కేంద్రంపై సుప్రీంకోర్ట్ విచారణ.. అక్రమంగా బంధిస్తున్నారంటూ!

తాజాగా సుప్రీంకోర్టు అనంత్ అంబానికి షాక్ ఇచ్చింది.అనంత్ అంబానీకి చెందిన 'వంతారా' జంతు సంరక్షణపై సిట్ విచారణకి ఆదేశించింది.

By:  Madhu Reddy   |   26 Aug 2025 2:07 PM IST
అనంత్ అంబానీ వంతారా కేంద్రంపై సుప్రీంకోర్ట్ విచారణ.. అక్రమంగా బంధిస్తున్నారంటూ!
X

తాజాగా సుప్రీంకోర్టు అనంత్ అంబానికి షాక్ ఇచ్చింది.అనంత్ అంబానీకి చెందిన 'వంతారా' జంతు సంరక్షణపై సిట్ విచారణకి ఆదేశించింది. అయితే అనంత్ అంబానీకి చెందిన వంతారా అనే జంతు సంరక్షణ కేంద్రంలో ఏనుగులతో సహా కొన్ని జంతువులు అక్రమంగా తరలించబడ్డాయని, విదేశాల నుండి జంతువులను దిగుమతి చేసుకున్నారని, విదేశాల నుండి ఎగుమతి చేసుకునే జంతువుల విషయంలో చట్టాన్ని ఉల్లంఘించారు అంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలు మెయిన్ మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించడంతో తాజాగా సుప్రీంకోర్టు వంతారాపై సిట్ విచారణకు ఆదేశించింది.

గుజరాత్ లోని జామ్ నగర్ లో అనంత్ అంబానీకి చెందిన వంతారా అనే అతిపెద్ద జంతు సంరక్షణ కేంద్రం ఉంటుంది. ఇందులో ఉండే ఎన్నో జంతువులకి పునరావాసం కల్పించడమే కాకుండా సంరక్షిస్తారు. కానీ అలాంటి వంతారా పై తాజాగా సుప్రీంకోర్టులో కేసు వేశారు. చట్టాలను ఉల్లంఘించి విదేశాల నుండి ఏనుగులను దిగుమతి చేసుకుంటున్నారనే ఆరోపణలతో సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు అనంత్ అంబానీ వంతారాకి షాక్ ఇచ్చింది.

విషయంలోకి వెళ్తే.. భారతదేశంలో జంతువులను ఎగుమతి, దిగుమతి చేసుకోవడం అనేది చట్టాన్ని ఉల్లంఘించినట్లే.. ముఖ్యంగా ఏనుగులు వంటి వాటిని దిగుమతి చేసుకోవడం చట్టాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది. అయితే అనంత్ అంబానీ వంతారా పై వస్తున్న ఆరోపణలలో ఉన్న నిజాలు ఏంటి అని తెలుసుకోవడానికి నిజ నిర్ధారణ విచారణ కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. వంతారాలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై జస్టిస్ పంకజ్ మిథల్, పిబి వరలేల,న్యాయమూర్తి చలమేశ్వర్ నేతృత్వంలో సుప్రీంకోర్టు విచారణ జరిపి వంతారాపై నలుగురు సభ్యుల సిట్ విచారణకు ఏర్పాటు చేసింది. ఈ నలుగురు సభ్యులతో కూడిన సిట్ బృందంలో ముంబై మాజీ పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలే, జస్టిస్ చలమేశ్వర్, మాజీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి అనీష్ గుప్తా,రిటైర్డ్ జస్టిస్ రాఘవేంద్ర చౌహన్ లు ఉన్నారు.

భారతదేశంలో జంతువుల ఎగుమతి,దిగుమతి అనేది చట్ట విరుద్ధంగా నేరం..అలాగే చట్టాలను ఉల్లంఘించడమే. కావున వంతారాలోని జంతువుల విషయంలో నిజంగానే అక్రమాలు జరిగాయా.. వంతారా అనుసరిస్తున్న విధివిధానాలు ఏంటి అనే విషయాలను పూర్తిగా తెలుసుకొని, దర్యాప్తు జరిపి పూర్తి నివేదికను సుప్రీంకోర్టుకి సమర్పించాలంటూ సిట్ బృందానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే వంతారాలో జరిగే వాస్తవిక పరిస్థితులు ఏంటి అనేది తెలుసుకుంటే మరొకసారి ఇలాంటి ఆరోపణలు రావు అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది.మరి సిట్ విచారణలో వంతారా గురించి ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి.