ఏడేళ్లు న్యాయవాది.. నేరుగా జిల్లా జడ్జి.. సుప్రీం కీలక తీర్పు
సమాజంలో అత్యంత ప్రభావవంతమైన ప్రొఫెషన్లలో ఒకటి లాయర్. మహాత్మా గాంధీ మొదలు ఎందరో మహానుభావులు న్యాయవాదులే కావడం గమనార్హం.
By: Tupaki Political Desk | 10 Oct 2025 10:00 PM ISTసమాజంలో అత్యంత ప్రభావవంతమైన ప్రొఫెషన్లలో ఒకటి లాయర్. మహాత్మా గాంధీ మొదలు ఎందరో మహానుభావులు న్యాయవాదులే కావడం గమనార్హం. తమ వాదనా పటిమతో కీలక, సంచలన కేసులను గెలిపించిన లాయర్లు ఎందరో ఉన్నారు. ఇక పేదల పక్షాన నిలిచి కేసులు తలకెత్తుకున్న గొప్ప ఆశయవాదులూ ఉన్నారు. లాయర్ గా అనుభవంతో తదుపరి జడ్జిలుగా అయి చరిత్రాత్మక తీర్పులు ఇచ్చారు చాలామంది. అయితే, లాయర్లలో ఎవరు జడ్జిలుగా అర్హులు? అనే అంశంపై సుప్రీం కోర్టు తాజాగా కీలక తీర్పు ఇచ్చింది.
ఆసక్తితో ఎంచుకుని...
జడ్జిలు రెండు విధాలుగా ఎంపికవుతుంటారు. ఒకటి నేరుగా నియామక పరీక్ష రాసేవారు, రెండోది న్యాయవాదులుగా కొనసాగుతూ జడ్జిలు అయ్యేవారు. అయితే, ఎన్నేళ్లు న్యాయవాదిగా ఉంటే జడ్జి అవుతారు? అనేదానిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. న్యాయాధికారుల కోటాలో జిల్లా జడ్జీలుగా, అదనపు జడ్జీలుగా నేరుగా నియామకానికి న్యాయవాదులకు ఏడేళ్ల అనుభవం ఉంటే సరిపోతుందని పేర్కొంది. ఏడేళ్ల సీనియారిటీ ఉన్న లాయర్లు సబార్డినేట్ జ్యుడిషీయల్ సర్వీస్ కిందకు వస్తారు. ఇలాంటివారు జిల్లా జడ్జి పదవికి నేరుగా జరిపే నియామకాలకు అర్హులని స్పష్టం చేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పునిచ్చింది.
ఇవే అర్హతలు...
న్యాయవాదులకు జిల్లా జడ్జి నియామకానికి దరఖాస్తు చేసేనాటికి ఉన్న అర్హతలనే ప్రామాణికంగా తీసుకోవాలని సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం తీర్పుచెప్పింది. కనీస వయసు 35 ఏళ్లు ఉండాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో అర్హత నిబంధనలను రూపొందించాలని సూచించింది. ప్రభుత్వ సర్వీసులో ఉంటున్నవారు జిల్లా జడ్జీలుగా నేరుగా నియమితులు కావడానికి అనర్హులు అంటూ గతంలో దాఖలైన కేసులో వెలువడిన తీర్పును కొట్టివేసింది. తమ తాజా తీర్పు గురువారం నుంచే అమల్లోకి వస్తుందని, గతంలోని నియామకాలకు వర్తించదని తేల్చి చెప్పింది.
పెరుగుతున్న ఆదరణ..
సమాజంలో ప్రస్తుతం లాయర్ ప్రొఫెషన్ కు ఆదరణ పెరుగుతోంది. అవకాశాలు కూడా బాగా అధికంగా ఉంటున్నాయి. ఉన్నత స్థాయి సంస్థలలో లా చదివినవారికి అద్భుతమైన ప్యాకేజీలతో బహుశ జాతి సంస్థలు ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఇక కోర్టుల్లో లా ప్రాక్టీస్ చేసేవారికి సుప్రీం కోర్టు తాజా తీర్పు మరింత ఉత్సాహం ఇవ్వడం ఖాయం.
