Begin typing your search above and press return to search.

వైరల్.. భారతీయ న్యాయ వ్యవస్థ చరిత్రలో అత్యంత అరుదైన కేసు ఇది!

సదరు మహిళకు 23 ఏళ్ల తర్వాత పరిహారం అందింది. భారతీయ న్యాయ వ్యవస్థ చరిత్రలో అత్యంత అరుదైన ఈ కేసు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

By:  Raja Ch   |   23 Oct 2025 6:00 PM IST
వైరల్.. భారతీయ న్యాయ వ్యవస్థ చరిత్రలో అత్యంత అరుదైన కేసు ఇది!
X

భారతదేశ న్యాయవ్యవస్థ ఎంతో గొప్పది.. పది మంది దోషులు తప్పించుకున్న పర్లేదు కానీ, ఒక్క నిర్దోషికి కూడా శిక్షపడకూడదనే సిద్ధాంతం మన సొంతం! ఇదే సమయంలో నిజంగా అన్యాయం జరిగిన వారికి పరిహారం అందించడం కూడా అంతే ముఖ్యమనే విషయన్ని బలపరుస్తూ ఓ ఆసక్తికర వ్యవహారం తాజాగా తెరపైకి వచ్చింది. దీంతో.. దీన్ని భారతీయ న్యాయ వ్యవస్థ చరిత్రలో అత్యంత అరుదైన కేసుగా అభివర్ణిస్తున్నారు.

అవును... 2002లో రైలు ప్రమాదంలో భర్తను కోల్పోయిన విషాదంలో మునిగిపోయిన ఒక వితంతువుకు, సంవత్సరాల తరబడి చేసిన పోరాటం తర్వాత.. రైల్వే ఆమెకు తగిన పరిహారం చెల్లించేలా సుప్రీంకోర్టు అదనపు కృషి చేసింది. సదరు మహిళకు 23 ఏళ్ల తర్వాత పరిహారం అందింది. భారతీయ న్యాయ వ్యవస్థ చరిత్రలో అత్యంత అరుదైన ఈ కేసు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సంయుక్త దేవి భర్త విజయ్‌ సింగ్‌ 2002 మార్చి 21న భాగల్పూర్‌–దానాపూర్‌ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో కంపార్టుమెంట్‌ నుంచి హఠాత్తుగా జారిపడి, మృతిచెందారు. ఈ నేపథ్యంలో.. పరిహారం కోసం ఆయన భార్య సంయుక్త దేవి న్యాయ పోరాటం ప్రారంభించారు. ఇందులో భాగంగా పాట్నా హైకోర్టును ఆశ్రయించారు!

అయితే... ప్రమాదం వెనుక రైల్వేశాఖ నిర్లక్ష్యం లేదని, అతడికి మతిస్థిమితం లేదని, ఎవరో అతడిని నెట్టివేయడం వల్లే రైలు నుంచి కిందపడ్డాడని.. అందువల్ల పరిహారం ఇవ్వడం సాధ్యం కాదని రైల్వే క్లెయిమ్స్‌ ట్రిబ్యునల్, పాట్నా హైకోర్టు తేల్చిచెప్పాయి. ఈ న్యాయపోరాటం సుమారు రెండు దశాబ్ధాలపాటు సాగింది. అనంతరం ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో... 2023లో సుప్రీంకోర్టు రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్, పాట్నా హైకోర్టు ఇచ్చిన వాదనను తిరస్కరించింది. వాటిని పూర్తిగా అసంబద్ధం, ఊహాత్మకం, రికార్డులోని వివాదాస్పద వాస్తవాలకు విరుద్ధం అని పేర్కొంటూ ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. విజయ్‌ సింగ్‌ కు మతిస్థిమితం లేకపోతే రైలు టికెట్‌ ఎలా కొనుగోలు చేశాడని ప్రశ్నించింది!

ఇదే సమయంలో... క్లెయిం పిటిషన్ దాఖలు చేసిన తేదీ నుంచి బాధితురాలు సంయుక్త దేవికి రూ.4 లక్షల పరిహారాన్ని ఏటా 6 శాతం వడ్డీతో కలిపి రెండు నెలల్లోగా చెల్లించాలని రైల్వేశాఖకు ఆదేశాలు జారీ చేసింది.

సంయుక్తదేవి చిరునామా కోసం...!:

అయితే.. ఈ పరిహారం అందజేయడానికి సంయుక్తి దేవి చిరునామా అందుబాటులో లేకుండా పోయింది. జీవనోపాధి కోసం ఆమె ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తుండడం వల్లే ఆమె ఎక్కడున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో.. న్యాయమూర్తులు సూర్యకాంత్, దీపాంకర్ దత్తా, ఎన్ కోటీశ్వర్ సింగ్‌ లతో కూడిన ధర్మాసనం స్పందించింది.

ఆ మహిళకు ఉపశమనం కలిగించడానికి, ఆమె నివసిస్తున్న ప్రాంతంలో విస్తృతంగా సర్క్యులేషన్ ఉన్న రెండు ప్రముఖ వార్తాపత్రికలలో (ఇంగ్లీష్, హిందీ) పబ్లిక్ నోటీసు జారీ చేయాలని కోల్‌ కతాలోని తూర్పు రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌ ను సుప్రీంకోర్టు కోరింది. ఫైనల్ గా ఆమె నివసిస్తున్న గ్రామాన్ని స్థానిక పోలీసులు కనుగొన్నారు.

ఈ నేపథ్యంలో... స్థానిక పోలీసుల సహాయంతో ఆ మహిళకు పరిహారం మొత్తాన్ని చెల్లించాలని రైల్వే అధికారులను ఆదేశించిన ధర్మాసనం.. స్థానిక ఎస్.హెచ్.ఓను రైల్వే అధికారులతో కలిసి వెళ్లి ఆమె బ్యాంకు ఖాతాలో పరిహారం మొత్తాన్ని జమ చేయాలని ఆదేశించింది.. ఆ ప్రక్రియ మొదలైంది.