Begin typing your search above and press return to search.

ఆస్తి హక్కుల పరిరక్షణకు సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు

దేశంలో ఆస్తి హక్కుల పరిరక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.

By:  A.N.Kumar   |   24 Oct 2025 7:00 PM IST
ఆస్తి హక్కుల పరిరక్షణకు సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
X

దేశంలో ఆస్తి హక్కుల పరిరక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. మైనర్ గా ఉన్న సమయంలో వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అనుమతి లేకుండా చేసిన ఆస్తి విక్రయాలు, బదిలీలు మేజర్‌ (18 ఏళ్లు నిండిన తర్వాత) అయిన తర్వాత పిల్లలు తిరస్కరించే హక్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా వేలాది ఆస్తి వివాదాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

* కేసు నేపథ్యం

కర్ణాటకలోని శామనూరు గ్రామానికి చెందిన రుద్రప్ప 1971లో తన ముగ్గురు మైనర్ కుమారులు మహా రుద్రప్ప, బసవరాజ్, మంగేశప్ప పేర్ల మీద కొంత భూమిని కొనుగోలు చేశారు. అయితే కోర్టు అనుమతి లేకుండానే, తండ్రి రుద్రప్ప ఆ ఆస్తిని ఇతరులకు విక్రయించాడు. తరువాత కుమారులు పెద్దవారైన తర్వాత (మేజర్లు అయిన తర్వాత) అదే ఆస్తిని మరోవ్యక్తి అయిన కేఎస్. శివప్పకు అమ్మేశారు. ఇంతలో తండ్రి వద్ద నుంచి ప్లాట్లు కొనుగోలు చేసిన పాత కొనుగోలుదారులు తమకే ఆస్తి హక్కులు ఉన్నాయని కోర్టులో దావా వేశారు. ఈ కేసు వివిధ కోర్టుల్లో విచారణ అనంతరం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.

* సుప్రీంకోర్టు తీర్పు

జస్టిస్ మిత్తల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులో తీర్పు ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. మైనర్‌గా ఉన్నప్పుడు సంరక్షకుడు చేసిన ఆస్తి విక్రయాన్ని మేజర్‌ అయిన తర్వాత ఆ వ్యక్తి తిరస్కరించే లేదా రద్దు చేసే హక్కు కలిగి ఉంటారు. దీని కోసం ప్రత్యేకంగా దావా వేయాల్సిన అవసరం లేదు. ఆస్తి విక్రయం గురించి మైనర్‌కు తెలియకపోవచ్చని, కాబట్టి ముందుగా కోర్టు అనుమతి లేకుండా జరిగిన లావాదేవీలను మేజర్ అయిన తర్వాత నేరుగా సవాలు చేయవచ్చని స్పష్టం చేసింది. తమ ఆస్తిని వారు ఇష్టం వచ్చిన వారికి అమ్ముకోవచ్చు లేదా తమ పేరుమీద తిరిగి బదిలీ చేసుకోవచ్చు అని కూడా పేర్కొంది.

* చట్టపరమైన ప్రాముఖ్యత

ఈ తీర్పు ప్రకారం, మైనర్‌గా ఉన్నప్పుడు సంరక్షకుడు ఆస్తిని అమ్మినా, ఆ అమ్మకం చట్టపరంగా శాశ్వతం కాదు. పిల్లలు పెద్దవారైన తర్వాత ఆ లావాదేవీని సవాలు చేసి తమ హక్కును తిరిగి పొందవచ్చు. దీంతో మైనర్ల ఆస్తులపై జరగుతున్న దుర్వినియోగం, దోపిడీలకు ఇది పెద్ద చెక్‌గా మారనుంది.

* నిపుణుల అభిప్రాయం

చట్ట నిపుణులు ఈ తీర్పును “మైనర్ల ఆస్తి హక్కులకు ఒక రక్షణ కవచం”గా పేర్కొంటున్నారు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ అధికారం దాటి చేసే లావాదేవీలను ఈ తీర్పు పరిమితం చేస్తుందని, ఆస్తి హక్కుల పరిరక్షణలో ఇది మైలురాయి తీర్పుగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.