బ్యాట్ పట్టలేనివాడు క్రికెట్ అసోసియేషన్‌లోనా? సుప్రీం ప్రశ్న!
ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇంతకాలం లేదు. కానీ మునుముందు దీనికి సమాధానం దొరుకుతుందన్న ఆశ కనిపిస్తోంది.
By: Sivaji Kontham | 4 Feb 2026 9:50 AM ISTనిపుణులు కానివాళ్లు క్రికెట్ సంఘాలను నిర్వహించకూడదని సుప్రీంకోర్టు తీర్పుతో సగం దరిద్రం వదిలినట్టేనా?
భారతదేశంలో క్రికెట్ ని భ్రష్టు పట్టించింది ఇలాంటి నైపుణ్యం లేని క్రీడలతో సంబంధం లేని వ్యక్తులేనా? రాజకీయ దళారీలను క్రికెట్ లోకి ఎందుకు రానిస్తున్నారు? కేవలం దుర్మార్గపు రాజకీయాల కారణంగా, సిఫారుసుల కారణంగా భారతీయ క్రికెట్ కి ఎలాంటి అన్యాయం జరుగుతోంది? ఇలాంటి వ్యక్తుల వల్ల ప్రతిభావంతులైన యువ క్రికెటర్లకు అన్యాయం జరగడం లేదా? భారతదేశంలోని పూర్తి స్థాయి క్రికెట్ నైపుణ్యాన్ని వెలికి తీయలేకపోవడం వల్లనే సచిన్ టెండూల్కర్ లు, సెహ్వాగ్, ద్రవిడ్ లు లేదా ఎం.ఎస్.ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యవంశీ లాంటి ప్రతిభావంతులను మరింతమందిని గుర్తించలేకపోతున్నామా? ప్రపంచ క్రికెట్ లో భారతదేశం అజేయమైన శక్తిగా ఎదగాలంటే క్రికెట్ సంఘాల్లో అవ్యవస్థను నిర్మూలించాల్సిందేనా?
ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇంతకాలం లేదు. కానీ మునుముందు దీనికి సమాధానం దొరుకుతుందన్న ఆశ కనిపిస్తోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అలాంటి ఒక కొంగొత్త ఆశ చిగురిస్తోంది. అసలింతకీ సుప్రీంకోర్టు ఏమని తీర్పునిచ్చింది....? ఎవరి విషయంలో....?
క్రికెట్ కేవలం ఆట మాత్రమే కాదు.. ఇది భారతీయులకు ఒక ఎమోషన్. అందుకే ఈ క్రీడలో ప్రతిభావంతులకు ఎదురయ్యే రాజకీయాలు, అవకతవకలు సగటు అభిమానిని బాధిస్తాయి. అయితే ప్రతిభావంతులకు అన్ని సందర్భాల్లో అన్యాయం జరుగుతుందని అనడానికి లేదు. నేడు భారత క్రికెట్ టీమ్ ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో ఒకటిగా ఉంది అంటే, కచ్ఛితంగా ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించడం వల్లనే. కానీ క్రీడారంగాన్ని వెంటాడే చీకటి నీడ విస్మరించలేనిది. టీమిండియా ప్రగతి పథానికి అడ్డుగోడ లాంటిది.
తాజాగా సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం... ఇకపై క్రీడారంగంలో సంబంధిత మాజీ క్రీడాకారులతో కూడుకున్న సంఘాలు మాత్రమే పని చేయాలి. ఆటలో అనుభవం లేని వ్యక్తులు సంఘాలను ప్రభావితం చేయకూడదని సుప్రీం స్పష్టంగా తీర్పును వెలువరించింది. ముఖ్యంగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసిఏ) ఎన్నికల వ్యవహారంలో కోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
కనీసం బ్యాట్ పట్టడం కూడా తెలియని వారు క్రికెట్ సంఘాల్లో సభ్యులుగా ఉండటం ఏమిటి? అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. జనవరి 6న జరగాల్సిన ఎంసీఏ ఎన్నికలపై బాంబే హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవడం అవసరమని కోర్టు భావించింది.
నిజానికి క్రికెట్ సంఘాల్లో ఇష్టానుసారం సభ్యుల పెరుగుదల విరుగుడుకు కారణమైంది. 1986 నుండి 2023 వరకు కేవలం 164 మంది సభ్యులు ఉన్న అసోసియేషన్‌లో, ఒక్కసారిగా 400 మంది కొత్త సభ్యులను చేర్చుకోవడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సంఘాల్లోకి పనికిమాలిన చెత్త చేరిందని కోర్టు చాలా స్పష్ఠంగా వ్యాఖ్యానించింది. ఈ చెత్తను వెంటనే తొలగించకపోతే అది ఘోరమైన దుర్వ్యవస్థగా మారుతుందని కూడా కోర్టు ఆందోళన చెందింది. రాజకీయ నాయకులు, వారి అనుచరులు, బంధువులు, స్నేహితులు వీళ్లు క్రికెట్ సంఘాలను నడిపిస్తారా? అనేది కోర్టు ప్రశ్న.
రాజకీయ నాయకుల బంధువులకు, అనుచరులకు సభ్యత్వాలు ఇచ్చారనే ఆరోపణలపై మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ వేసిన పిటిషన్ ఆధారంగా సుప్రీంలో ఈ విచారణ జరిగింది. తాజా తీర్పుతో ఇకపై క్రికెట్ సంఘాల్లో కేవలం పదవీ విరమణ చేసిన మాజీ ఆటగాళ్లు మాత్రమే ఉండాలి. కేవలం ఓట్ల కోసం, అధికారం కోసం క్రీడతో సంబంధం లేని వారిని చేర్చుకోవడం వల్ల ఆట నాణ్యత దెబ్బతింటుందని కోర్టు హెచ్చరించింది. సంఘంలో సభ్యత్వాల విషయంలో పారదర్శకత లోపిస్తే అది క్రీడాకారుల భవిష్యత్ ని దెబ్బ తీస్తుందని కూడా సుప్రీం వ్యాఖ్యానించింది. క్రికెట్ రంగంలో రాజకీయ నాయకుల పీడ వదిలించడానికి సుప్రీంకోర్టు తీర్పు సహకరిస్తుందని మీరు కూడా భావిస్తున్నారా? మీ అభిప్రాయం ఏమిటి?
