Begin typing your search above and press return to search.

'మేమూ మనుషులమే'... సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు!

ఓ అత్యంత కీలకమైన, సున్నితమైన కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

By:  Raja Ch   |   15 Jan 2026 11:07 PM IST
మేమూ మనుషులమే... సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు!
X

ఓ అత్యంత కీలకమైన, సున్నితమైన కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా... 'మేమూ మనుషులమే.. ఎవరు బతికి ఉండాలో? ఎవరు చనిపోవాలో నిర్ణయించేందుకు మనం ఎవరం..? అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో ఈ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఇంతకూ సర్వోన్నత న్యాయస్థానం ఏ కేసులో, ఏ సందర్భంలో, ఎందుకు ఈ వ్యాఖ్యలు చేసిందనేది ఇప్పుడు చూద్దామ్...!

అవును... ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల హరీశ్ రాణా 2013 ఆగస్టు 20న చండీగఢ్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. ఇందులో భాగంగా.. నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడిపోవడంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. ఈ క్రమంలో శరీరం చలనం లేని స్థితికి చేరుకోవడంతో.. ప్రముఖ ఆసుపత్రుల్లో చికిత్స అందించినా పరిస్థితిలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అప్పటి నుంచి అతడి పరిస్థితి అలానే ఉంది!

అలా అప్పటినుంచి అతడు కోమాలోనే ఉండిపోగా.. అప్పటి నుంచి అతడి తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంచి చూసుకుంటున్నారు. ఈ క్రమంలో... తమ కుమారుడి చికిత్స కోసం తాము ఆర్థికంగా, మానసికంగా చితికిపోయామని.. అతడికి కారుణ్య మరణానికి అనుమతించాలని.. 2024లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వారి పిటిషన్‌ ను హైకోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించినా వారికి నిరాశే ఎదురైంది.

అయితే.. హరీశ్ ఇక కోలుకునే అవకాశం ఏమాత్రం లేదని వైద్యులు మరోసారి నివేదికలు ఇవ్వడంతో అతడి కుటుంబం మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సమయంలో.. అతడికి సంబంధించిన మెడికల్‌ రిపోర్ట్‌ లను పరిశీలించిన సుప్రీంకోర్టు.. హరీశ్ కేసును విచారించేందుకు అంగీకరించింది. ఈ మేరకు ఈ అంశంపై గురువారం విచారణ జరిపి.. కారుణ్య మరణం అంశంపై తీర్పు రిజర్వ్‌ చేసింది.

ఈ నేపథ్యంలోనే ధర్మాసనం ఒకింత ఆవేదన వ్యక్తంచేసింది. ఇందులో భాగంగా... ఈ కేసులో కారుణ్య మరణం అనే పదాన్ని తాము ఉపయోగించలేమని.. తాము నిత్యం ఎన్నో కేసులు విచారిస్తామని.. కానీ, ఇది చాలా సున్నితమైన అంశమని.. తాము మనుషులమే అని.. ఎవరు బతికి ఉండాలో? ఎవరు చనిపోవాలో నిర్ణయించేందుకు మనం ఎవరిమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

పెద్దలు కుదిర్చిన పెళ్లిలోనే ప్రేమ...!:

మరో కేసులో సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా.. పెద్దలు కుదిర్చిన పెళ్లిలోనే ప్రేమ పెరుగుతోందని వ్యాఖ్యానించింది. ఓ మ్యాట్రిమోనియల్‌ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.వి.నాగరత్న స్పందిస్తూ... 'ప్రేమించి పెళ్లి చేసుకునేవారిలో వివాహం తర్వాత దంపతుల మధ్య ప్రేమ ఉండటం లేదు. అదే పెద్దలు కుదిర్చిన పెళ్లిలో వివాహం తర్వాత ఆ జంట మధ్య ప్రేమ పెరుగుతోంది' అని అన్నారు.