Begin typing your search above and press return to search.

13 రోజులు మాట్లాడకపోతే క్రూరత్వమా? బాబోయ్.. మరి వాట్సాప్‌లో ‘బ్లూ టిక్స్’ పడినా రిప్లై ఇవ్వకపోతే ఏ శిక్ష వేయాలి బాస్!

ఈ తీర్పు చూశాక సోషల్ మీడియాలో నెటిజన్లు, ముఖ్యంగా భర్తలు ఊపిరి పీల్చుకుంటూ వదులుతున్న సెటైర్లు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

By:  A.N.Kumar   |   13 Jun 2026 10:45 AM IST
13 రోజులు మాట్లాడకపోతే క్రూరత్వమా? బాబోయ్.. మరి వాట్సాప్‌లో ‘బ్లూ టిక్స్’ పడినా రిప్లై ఇవ్వకపోతే ఏ శిక్ష వేయాలి బాస్!
X

మొగుడు-పెళ్లాల మధ్య యుద్ధాలు కొత్తేమీ కాదు. యుద్ధం అంటే తుపాకులు, కత్తులతో కాదులెండి... అప్పుడప్పుడూ వాడే ‘మౌనాస్త్రం’ గురించి. అయితే భార్యతో కేవలం 13 రోజులు మాట్లాడకపోతే అది ‘క్రూరత్వం’ అయిపోతుందా? దీనికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు "అబ్బే.. అలా ఎలా అవుతుంది?" అంటూ భర్తలకు భారీ ఊరటనిచ్చే తీర్పునిచ్చింది. ఈ తీర్పు చూశాక సోషల్ మీడియాలో నెటిజన్లు, ముఖ్యంగా భర్తలు ఊపిరి పీల్చుకుంటూ వదులుతున్న సెటైర్లు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

కథేంటంటే.. ఒమన్ మొగుడు.. ఇండియా పెళ్లాం

కేసు వివరాల్లోకి వెళ్తే.. భర్తగారు ఒమన్‌లో ఉద్యోగం చేసుకుంటుంటే భార్య ఇక్కడ ఇండియాలో ఉంటోంది. అయితే సదరు భర్త గారు తరచూ ఫోన్ చేయట్లేదని వరుసగా ఒక 13 రోజులు అసలు మాట్లాడనేలేదని భార్య మనస్తాపానికి గురైంది. దీనిపై కింది కోర్టు సదరు భర్తకు ఐపీసీ సెక్షన్ 498A కింద శిక్ష కూడా ఖరారు చేసింది. కానీ సుప్రీంకోర్టు ఎంటర్ అయ్యాక సీన్ మారింది. "దాంపత్య జీవితంలో అప్పుడప్పుడూ అలకలు, మౌన వ్రతాలు సహజం. కేవలం 13 రోజులు మాట్లాడనంత మాత్రాన భర్తను ‘క్రూరుడు’ అని ముద్ర వేయలేం" అంటూ ట్రయల్ కోర్టు తీర్పును కొట్టేసింది.

భర్తల రిలాక్స్.. భార్యల కౌంటర్లు!

ఈ లీగల్ రిలీఫ్ చూశాక సోషల్ మీడియాలో మీమ్స్ పండగ మొదలైంది. కొందరు భర్తలయితే.. "హమ్మయ్య ఇకపై ఆఫీస్ పనిలో ఉండి భార్య ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా జైలుకు వెళ్లే భయం లేదు" అంటూ స్టేటస్‌లు పెట్టేసుకుంటున్నారు. అయితే భార్యలు ఊరుకుంటారా? వాళ్లు కూడా గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు: "సరే 13 రోజులు మాట్లాడకపోవడం ఓకే.. మరి వాట్సాప్‌లో మెసేజ్ చూసి, బ్లూ టిక్స్ పడ్డాక కూడా రిప్లై ఇవ్వకుండా తిరిగే భర్తలపై ఏ సెక్షన్ కింద కేసు పెట్టాలి యువరాజ్?" అని ఒకరు. "13 రోజులు మాట్లాడకపోతే క్రూరత్వం కాదన్నారు సరే.. మరి 13 నెలలు మాట్లాడకపోతే దాన్ని ఏమనాలి? అంతర్జాతీయ మౌన వ్రతాల పోటీలనాలా?" అని మరొకరు ప్రశ్నిస్తున్నారు.

గృహ ‘శాంతి’ యుద్ధాలు

నిజానికి ప్రతి ఇంట్లోనూ ఈ మౌన యుద్ధాలు కామనే. భార్య కోపంగా ఉంటే భర్త సైలెంట్.. భర్త కోపంగా ఉంటే భార్య సైలెంట్ . ఎవరికి వారే "నువ్వే ముందు మాట్లాడాలి.. లేదు నువ్వే తగ్గాలి" అంటూ ఇగోల పోటీ పెట్టుకోవడం సహజం. ఈ ‘నువ్వా-నేనా’ పోటీ కాస్తా సుప్రీంకోర్టు వరకు వెళ్లడం విశేషం.

చివరగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నీతి ఏంటంటే ప్రతి చిన్న దాంపత్య విభేదాన్ని క్రిమినల్ కేసుగా చూడలేం. మొగుడు పెళ్లాల మధ్య జరిగే కోపతాపాలు, అలకలు, ఈ 13 రోజుల గ్యాప్‌లు అన్నీ సంసారంలో సరిగమలే కానీ చట్టపరమైన క్రూరత్వం కాదు.

కాబట్టి భర్తల్లారా.. చట్టం మిమ్మల్ని కాపాడింది సరే కానీ ఇంట్లో ‘హోమ్ మినిస్టర్’ ఆగ్రహం నుండి తప్పించుకోవాలంటే మాత్రం 13 రోజులు కాదు కదా.. 13 నిమిషాలు కూడా సైలెంట్‌గా ఉండకపోవడమే మీ ఆరోగ్యానికి ఐశ్వర్యానికి క్షేమకరం..