భారతీయ యువకుడిని రష్యన్ ఆర్మీలో చేరమని బలవంతం చేసారా?
స్టూడెంట్ వీసాపై రష్యాకు వెళ్లి అక్కడి సైన్యంలో చేరిన కుమారుడిని భారత్‌కు రప్పించాలంటూ ఓ తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. మానవతా దృక్పథంతో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అవకాశాలను పరిశీలించాలని కేంద్రానికి సూచించింది. అయితే యువకుడు భారత పౌరసత్వాన్ని వదులుకుని రష్యా పౌరసత్వం తీసుకున్నట్లు తెలుస్తోందని పేర్కొంది. తదుపరి విచారణను 2027 జనవరికి వాయిదా వేసింది.
By: Sivaji Kontham | 25 Nov 2026 2:34 PM ISTస్టూడెంట్ వీసాపై రష్యాకు వెళ్లి ఆ దేశ సైన్యంలో చేరిన తన కుమారుడిని తిరిగి భారత్‌కు రప్పించాలంటూ ఒక తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారిస్తూ.. మానవతా దృక్పథంతో ఈ విషయంలో జోక్యం చేసుకునే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని తగిన సూచనలు పొందాలని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను 2027 జనవరికి వాయిదా వేసింది.
అయితే పిటిషనర్ కుమారుడు అభిషేక్ (అభినేష్ గా మారాడు) తన భారత పౌరసత్వాన్ని వదులుకుని రష్యా పౌరసత్వం తీసుకున్నట్లు కనిపిస్తున్నందున భారత అధికారుల జోక్యానికి పరిమితులు ఉంటాయని ధర్మాసనం అభిప్రాయపడింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సైతం ఇదే విషయాన్ని కోర్టుకు వివరిస్తూ.. సదరు యువకుడు రష్యా పౌరసత్వం స్వీకరించాడని రష్యా అధికారులు భారత రాయబార కార్యాలయానికి సమాచారం ఇచ్చారని.. అందువల్ల భారత ప్రభుత్వ జోక్యానికి ఉన్న అవకాశాలు పరిమితమని తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. పిటిషనర్ చిన్న కుమారుడైన అబినేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఒక ఏజెంట్ సహాయంతో మరో ముగ్గురు విద్యార్థులతో కలిసి ఏప్రిల్ నెలలో స్టూడెంట్ వీసాపై రష్యాకు వెళ్లాడు. జులై 19న చివరిసారిగా అతడు కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. ఆ తర్వాత అబినేష్ గానీ.. అతనితో వెళ్లిన మిగిలిన ముగ్గురు విద్యార్థులు గానీ కుటుంబ సభ్యులకు అందుబాటులోకి రాలేదు. ఆందోళన చెందిన అబినేష్ అన్నయ్య అతడి ఈమెయిల్ ఖాతాను పరిశీలించగా.. అందులో రష్యా ఆర్మీ ఐడీ కార్డు.. మిలిటరీ ట్యాగ్‌కు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయి.
తన కుమారుడికి పూర్తిగా అర్థం కాని పత్రాలపై బలవంతంగా లేదా ప్రలోభపెట్టి సంతకాలు చేయించి రష్యా సైన్యంలో చేర్చుకుని ఉంటారని ఆందోళన చెందిన తండ్రి వెంటనే కేంద్ర విదేశాంగ శాఖను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన రష్యాలోని భారత రాయబార కార్యాలయం.. అబినేష్‌ను విడుదల చేయాలని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖను కోరినట్లు తెలిపింది. అయితే అబినేష్ స్వచ్ఛందంగా భారత పౌరసత్వాన్ని వదులుకుని రష్యా పాస్‌పోర్ట్ పొందాడని.. రష్యా పౌరుడిగానే సైన్యంలో చేరాడని రష్యా అధికారులు పత్రాలతో సహా సమాధానమిచ్చినట్లు రాయబార కార్యాలయం వివరించింది. అబినేష్‌ను యుద్ధ క్షేత్రంలోకి పంపే ప్రమాదం ఉందన్న భయంతో ఆ తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. కోర్టు తాజాగా కేంద్ర ప్రభుత్వానికి ఈ మేరకు సూచించింది.
