Begin typing your search above and press return to search.

దేశంలో ఫ‌స్ట్‌: హీరా గోల్ఢ్ కేసులో సుప్రీం కోర్టు సంచ‌ల‌న తీర్పు..!

ఆర్థిక‌ప‌ర‌మైన మోసాల‌కు పాల్ప‌డే కంపెనీల‌కు.. సింహ‌స్వ‌ప్నంగా భావించేలా సుప్రీంకోర్టు తాజాగా సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది.

By:  Garuda Media   |   28 July 2026 4:25 PM IST
దేశంలో ఫ‌స్ట్‌: హీరా గోల్ఢ్ కేసులో సుప్రీం కోర్టు సంచ‌ల‌న తీర్పు..!
X

ఆర్థిక‌ప‌ర‌మైన మోసాల‌కు పాల్ప‌డే కంపెనీల‌కు.. సింహ‌స్వ‌ప్నంగా భావించేలా సుప్రీంకోర్టు తాజాగా సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. 'హీరా గోల్డ్‌' పేరుతో 2009లో ఏర్ప‌డిన ఓ సంస్థ‌.. మ‌హారాష్ట్ర‌, ఏపీ, తెలంగాణ‌, క‌ర్ణాట‌క స‌హా ప‌లు రాష్ట్రాల్లో సామాన్యుల ను ఆక‌ర్షించి.. డిపాజిట్లు సేక‌రించింది. ఈ సంస్థ డైరెక్ట‌ర్ షేక్‌ నౌహీరా (మ‌హిళ‌). త‌క్కువ పెట్టుబ‌డితో ఎక్కువ లాభాల ఆశ‌చూపిన ఆమె.. సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి వేల కోట్ల‌రూపాయ‌ల‌ను డిపాజిట్ రూపంలో తీసుకుంది. చివ‌ర‌కు.. స్వ‌ల్ప కాలంలో కంపెనీని ఎత్తేసింది. ఏకంగా 36 శాతం వ‌డ్డీల‌ను ఆశ చూప‌డంతో హీరా గోల్డ్ కంపెనీలో పెద్ద ఎత్తున ప్ర‌జలు పెట్టుబ‌డులు పెట్టారు.

ఈ క్ర‌మంలో నౌహీరా.. మొత్తం 3వేల నుంచి 5 వేల కోట్ల రూపాయ‌ల మేరకు ప్ర‌జ‌ల నుంచి సేక‌రించిన‌ట్టు గుర్తించారు. ఈ వ్య‌వ‌హారం ప‌లు రాష్ట్రాల్లో ముడిప‌డి ఉండ‌డం.. మ‌నీ లాండ‌రింగ్ ఆరోప‌ణ‌లు వెల్లువెత్త‌గ‌డంతో ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్‌(ఈడీ) రంగంలోకి దిగి.. విచార‌ణ‌చే ప‌ట్టింది. మ‌నీలాండ‌రింగ్ స‌హా.. ప‌లు ఆర్థిక చ‌ట్టాల కింద‌కేసులు న‌మోదు చేసి హీరాను ప‌లు మార్లు అరెస్టు చేసింది. అయితే.. ఆమె అరెస్టు అయిన ప్ర‌తిసారీ.. ఏదో ఒక రూపంలో బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌స్తూనే ఉన్నారు. తాజాగా ఈ ఏడాది మేలో మ‌రోసారి ఆమె అరెస్ట‌యింది.

ఇక‌, ఈ కేసులు సుప్రీంకోర్టు వ‌ర‌కు వెళ్లాయి. నిజానికి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం హీరా గోల్డ్ భాదితుల కేసును విచార‌ణ‌కు స్వీక‌రించినా.. సుప్రీంకోర్టు మొత్తం కేసును ఒకే ఫైలుగా న‌మోదు చేసి విచార‌ణ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలోనే హీరా ఆస్తుల‌ను సొంతం చేసుకోవాల‌ని.. గ‌తంలోనే ఈడీకి ఆదేశాలు చేసింది. దీంతో అధికారులు 45 ప్రాంతాల్లోని హీరా స్థిరాస్తులు.. చ‌రాస్తుల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం వాటిని వేలం వేసి.. వ‌చ్చిన సొమ్మును బాధితుల‌కు పంచాల‌న్న‌ది సుప్రీంకోర్టు ఆదేశం. కానీ, స‌ద‌రు ఆస్తుల‌ను స్వాధీనం చేసుకునే వ‌ర‌కు ఓకే.. వేలం వేయ‌డం వ‌ర‌కు ఓకే.. అన్న‌ట్టుగా ఈడీ వ్య‌వ‌హారం జ‌రిగింది. కానీ, వేలంలో ద‌క్కించుకున్న ఆస్తుల‌ను రిజిస్ట‌ర్ చేయించే విష‌యంలో హీరా యూట‌ర్న్ తీసుకున్నారు.

సంచ‌ల‌న ఆదేశం..

ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టు దేశంలోనే తొలిసారి సంచ‌ల‌న ఆదేశాలు ఇచ్చింది. హీరా పేరుతో ఉన్న ఆస్తుల‌ను వేలంలో సొంతం చేసుకున్న‌వారికి.. ఆమెకు బ‌దులుగా.. తెలంగాణ హైకోర్టు ప్రోటోకాల్ రిజిస్ట్రార్ వెంక‌టేశ్వ‌రరావు రిజిస్ట‌ర్ చేసి ఇవ్వాల‌ని ఆదేశించింది. అంటే.. స్థిరాస్తుల విష‌యంలో స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో జ‌రిగే రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌లో నౌహీరాకు బ‌దులుగా వెంక‌టేశ్వ‌ర‌రావు ఆమె త‌ర‌పున సంత‌కాలు చేయ‌నున్నారు.(సుప్రీంకోర్టు ఆదేశం ప్ర‌కారం.. ఆయ‌నే వాటికి హ‌క్కుదారు కానున్నారు) ఇలా.. జ‌ర‌గ‌డం దేశంలో ఇదే తొలిసారి అని న్యాయ‌వాదులు చెబుతున్నారు. కాగా.. హీరా గోల్డ్ భాదితుల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని అంటున్నారు.