Begin typing your search above and press return to search.

ఓటు వేయకుంటే శిక్ష వేయాలన్న పిటిషన్ కొట్టివేత.. ధర్మాసం ఏం చెప్పిందంటే..!

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది వరం. దాన్ని చట్టబద్ధంతో నిర్బంధంగా మార్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టత హేతుబద్ధంగా ఉంది.

By:  Tupaki Political Desk   |   17 April 2026 11:19 AM IST
ఓటు వేయకుంటే శిక్ష వేయాలన్న పిటిషన్ కొట్టివేత.. ధర్మాసం ఏం చెప్పిందంటే..!
X

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది వరం. దాన్ని చట్టబద్ధంతో నిర్బంధంగా మార్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టత హేతుబద్ధంగా ఉంది. బలవంతంగా ఓటు వేయించడం వల్ల ఓటింగ్ శాతం పెరగవచ్చు కానీ, అది ‘స్వేచ్ఛాయుత ఎన్నికల’ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని న్యాయస్థానం భావించింది. భారతదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు.. పోలింగ్ శాతంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా విద్యావంతులు ఉండే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉండడం పట్ల మేధావుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే, ఓటు వేయడం తప్పనిసరి చేయాలని, వేయని వారికి సంక్షేమ పథకాలు కట్ చేయడంతో పాటు జైలు శిక్ష విధించాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశమైంది. ఒక వ్యక్తిని బలవంతంగా పోలింగ్ బూత్‌కు పంపడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది.

పోలీసులను పంపమంటారా?

పిటిషనర్ తన వాదనలో ‘నిర్బంధం ఉంటేనే జనం బయటకు వస్తారు’ అని పేర్కొనగా, సీజేఐ తనదైన శైలిలో స్పందించారు. ఒక పౌరుడు ఓటు వేయకూడదని నిర్ణయించుకుంటే (లేదా నోటా నొక్కాలనుకుంటే), అది అతని వ్యక్తిగత ఇష్టం. ఓటు వేయలేదని అతన్ని పోలీసులు అరెస్టు చేయాలని కోర్టు ఎలా ఆదేశిస్తుంది..? అని ప్రశ్నించారు. కోట్లాది మంది ఓటర్లు ఉన్న దేశంలో, ఓటు వేయని లక్షలాది మందిపై కేసులు పెట్టడం లేదా వారి పథకాలు నిలిపివేయడం అనేది ఆచరణాత్మకంగా అసాధ్యం, జ్యాంగ విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది.

హక్కా? బాధ్యతా? లేక విధినా..

భారత రాజ్యాంగం ప్రకారం ఓటు వేయడం అనేది ఒక చట్టబద్ధమైన హక్కు. ఇది ప్రాథమిక విధి కాదు. ప్రజలకు ఓటు విలువ తెలిసేలా అవగాహన కల్పించాలి కానీ, భయపెట్టి ఓటువేయించకూడదు. అవగాహన ద్వారా వచ్చే మార్పు శాశ్వతంగా ఉంటుంది ఒక పౌరుడికి ఓటు వేసే హక్కు ఉన్నట్లే, ఓటు వేయకుండా ఉండే హక్కు కూడా ప్రజాస్వామ్యంలో భాగంగానే ఉంటుందని న్యాయస్థానం పరోక్షంగా సూచించింది. అందుకే 'నోటా' అనే ఆప్షన్ కూడా మనకు అందుబాటులో ఉంది.

చట్టసభల పరిధిలో నిర్ణయం

ఓటును నిర్బంధం చేయాలా వద్దా అనేది కోర్టులు నిర్ణయించే విషయం కాదని, అది కేంద్ర ప్రభుత్వం లేదా పార్లమెంటు పరిధిలోని అంశమని ధర్మాసనం పేర్కొంది. ఏదైనా కొత్త చట్టాన్ని తీసుకురావాలంటే అది ప్రజల ప్రతినిధులు చర్చించి నిర్ణయించాలి. ఆస్ట్రేలియా వంటి కొన్ని దేశాల్లో నిర్బంధ ఓటింగ్ అమల్లో ఉంది. అయితే మన దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అది ఎంత వరకు సరిపోతుందనేది శాసన వ్యవస్థ నిర్ణయించాల్సి ఉంటుంది.

పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతంపై ఆందోళన

తీర్పు పిటిషన్‌కు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉండటంపై సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. సెలవు దినంగా భావించి విహారయాత్రలకు వెళ్లే వారి వల్ల పోలింగ్ శాతం దెబ్బతింటోందని గతంలోనూ కోర్టు వ్యాఖ్యానించింది. దీన్ని అధిగమించడానికి ఎన్నికల కమిషన్ మరిన్ని వినూత్న ప్రచారాలు నిర్వహించాలని, వ్యవస్థాగత లోపాలను సరిదిద్దాలని సూచించింది.

అజయ్ గోయెల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. ప్రజాస్వామ్య పునాదులను మరోసారి బలపరిచింది. భయం ద్వారా ఓటు వేయించడం వల్ల ఓట్ల శాతం పెరగవచ్చు కానీ, ప్రజల నిజమైన ఆకాంక్షలు ప్రతిబింబించవు. ఓటరు తన బాధ్యతను గుర్తించి స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడే ప్రజాస్వామ్యం నిజంగా వర్ధిల్లుతుంది. ఓటు వేయకపోవడం వల్ల కలిగే నష్టాన్ని ప్రజలకు వివరించాలే తప్ప, వారిని జైల్లో పెడతామని హెచ్చరించడం సరైన పద్ధతి కాదని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది.