Begin typing your search above and press return to search.

తండ్రి భారత్ - తల్లి రష్యన్.. బిడ్డ కస్టడీపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

చిన్నారి కస్టడీ కేసు కోర్టులో పెండింగ్ ఉన్న నేపథ్యంలో వీసా కాలపరిమితిని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చారు.

By:  Garuda Media   |   2 Nov 2025 9:39 AM IST
తండ్రి భారత్ - తల్లి రష్యన్.. బిడ్డ కస్టడీపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
X

సున్నితమైన కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చిన్నారి కస్టడీ ఉదంతానికి సంబంధించిన ఈ కేసులో భారత్ - రష్యా సంబంధాలు దెబ్బ తినే ఏ తరహా ఆదేశాల్ని తాము ఇవ్వలేమని పేర్కొంది. భర్త నుంచి విడిపోయిన ఒక మహిళ.. దొంగచాటుగా రష్యాకు వెళ్లిపోయిన ఈ ఉదంతంలోకి వెళితే.. భర్త భారత్ కు చెందిన వ్యక్తి కాగా.. భార్య రష్యన్ మహిళ. వారికి ఒక చిన్నారి ఉన్నారు. ఆ రష్యన్ మహిళ 2019 నుంచి దేశంలో ఉన్నారు. ఆమె ఎక్స్ 1 వీసా పరిమితి ఎప్పుడో తీరిపోయింది.

చిన్నారి కస్టడీ కేసు కోర్టులో పెండింగ్ ఉన్న నేపథ్యంలో వీసా కాలపరిమితిని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే.. ఆమె అధికారుల కళ్లుగప్పి రష్యాకు వెళ్లిపోయారు. చిన్నారిని వారంలో మూడు రోజులు తల్లి వద్ద.. మిగిలిన రోజులు తండ్రి కస్టడీలో ఉండేలా మే 22న కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. తన బిడ్డ (కొడుకు)ను కోర్టు ఆదేశాలకు తగ్గట్లు కస్టడీకి అప్పగించలేదని.. వారిద్దరి జాడ తెలియటం లేదని బాధిత తండ్రి కోర్టును ఆశ్రయించారు.

దీంతో వారి ఆచూకీ వెంటనే కనుగొనాలని జులై 17న కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె దేశం విడిచి వెళ్లినట్లుగా కోర్టుకు సమాచారం ఇచ్చారు పోలీసులు. ఇది తీవ్రమైన ధిక్కరణ చర్యగా ఉందంటూ పోలీసుల తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. దొంగచాటుగా భారత్ నుంచి రష్యాకు సదరు మహిళ వెళ్లిపోయిన అంశాన్ని విదేశాంగ శాఖ అక్టోబరు 17న భారత రాయబార కార్యాలయం ద్వారా రష్యన్ అధికారులకు తెలియజేశారు.

నేపాల్.. యూఏఈ మీదుగా సదరు మహిళ రష్యాకు వెళ్లినట్లుగా గుర్తించారు. ఇందులో ఢిల్లీలోని రష్యా ఎంబసీ అధికారులు సైతం సాయం చేసినట్లుగా ధర్మాసనం గుర్తించింది. ఈ అంశంలో రష్యా అధికారులకు ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపినా సరైన ఫలితం రాలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ - రష్యా సంబంధాలను దెబ్బ తీసే ఏ ఉత్తర్వును తాము ఇవ్వదలుచుకోలేదంటూ సుప్రీం ధర్మాసనం (జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి) స్పష్టం చేసింది.

ఈ అంశం ఒక బిడ్డకు సంబంధించిందని.. తల్లితో ఉన్న ఆ చిన్నారి క్షేమంగా.. ఆరోగ్యంగా ఉన్నాడని మాత్రమే తాము ఆశించగలమని.. ఇది మానవ అక్రమ రవాణా కేసు కాకూడదని తాను ఆశిస్తున్నట్లుగా ధర్మాసనం పేర్కొంది. అదే సమయంలో విదేశాంగ శాఖ, ఢిల్లీ పోలీసులతో చర్చలు జరిపి.. తీసుకోవాల్సిన చర్యల్ని సూచనలు చేయాలని అదనపు సొలిసిటర్ జనరల్ కు ధర్మాసనం రెండు వారాలు గడువు ఇచ్చింది.