ఎన్నాళ్లు రైతులపై పడి ఏడుస్తారు? : సుప్రీంకోర్టు ఆగ్రహం
దేశ రాజధానిలో గత నాలుగు మాసాలుగా వాయుకాలుష్యం పెరుగుతోంది. దీంతో సాధారణ జనజీవనంతో పాటు.. అన్ని వ్యవస్థ లూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
By: Garuda Media | 2 Dec 2025 4:00 AM ISTకేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ''ఎన్నాళ్లు రైతులను బూచిగా చూపిస్తారు? ఎన్నాళ్లు వారిని అడ్డు పెట్టుకుని మీరు తప్పుకొంటారు? ఎన్నాళ్లు రైతులపై పడి ఏడుస్తారు? '' అంటూ.. తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు గుప్పించింది. ఇప్పటికైనా మీరు చేయాల్సిన పనిని చేయకపోతే.. మేమే రంగంలోకి దిగాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుబట్టింది.
ఏం జరిగింది?
దేశ రాజధానిలో గత నాలుగు మాసాలుగా వాయుకాలుష్యం పెరుగుతోంది. దీంతో సాధారణ జనజీవనంతో పాటు.. అన్ని వ్యవస్థలూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఏ రోజుకు ఆరోజు.. వాయు కాలుష్యం పెరుగుతుండడం.. పరిస్థితిలో మార్పు లేకపోవడం పై రెండు రోజుల కిందట సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేస్తోంది. శనివారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఏం చేయాలో అర్ధం కావడం లేదన్నారు. ఇది వ్యవస్థీకృత లోపమని..తాము ఆదేశాలు ఇచ్చినంత మాత్రాన ఏం జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే.. సోమవారం నాటి విచారణలో మాత్రం జస్టిస్ సూర్యకాంత్ నిప్పులు చెరిగారు. దీనికి కారణం.. కేంద్రం ఇచ్చిన వివరణే. రైతులు తగుల బెడుతున్న పంట పొలాల వ్యర్థాలతోనే కాలుష్యం పెరుగుతోందని కేంద్రం వివరణ ఇచ్చింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. కరోనా సమయంలో కూడా రైతులు పెద్ద ఎత్తున పంటపొలాలను దగ్ధం చేశారని.. కానీ, అప్పట్లో కూడా ఇంత కాలుష్యం లేదని అన్నారు. అయినా.. ప్రతిదానికీ రైతులను వంకగా చూపడం కేంద్రానికి అలవాటుగా మారిందని వ్యాఖ్యానించా రు. నిర్దేశిత చర్యలు తీసుకోకుండా.. ఏదో ఒక వంకతో అఫిడవిట్ వేసి చేతులు దులుపుకొంటున్నారని అన్నారు.
కరోనా సమయంలో కూడా లేని కాలుష్యం ఇప్పుడు ఎందుకు వస్తోందని ప్రశ్నించిన ధర్మాసనం.. రెండు వారాల్లోగాదీనికి పరి ష్కారం కనుగొనేలా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అంతా అయిపోయాక.. చర్యలు తీసుకుంటారా? అని ఈ సందర్భంగా కేంద్రాన్ని ప్రశ్నించింది. వాయు కాలుష్యం ప్రమాదకర రీతిలో పెరిగితే.. సాధారణ ప్రజల ప్రాణాలకు ఎవరు బాధ్యులని ప్రశ్నించిం ది. లేనిపోని కారణాలు చెప్పి.. తప్పించుకునే ప్రయత్నాలు చేయొద్దని కేంద్రాన్ని ఆదేశించింది. దీనికి నిర్దేశిత గడువులోగా చర్యలు తీసుకోవాలని సూచించింది.
