ఆలయాల్లో అనుమతిపై సుప్రీంకోర్టులో తాజాగా ఏం జరిగింది?
అత్యంత కీలకమైన కేసులు.. సున్నితమైన కేసులకు సంబంధించిన వివరాల్ని ప్రజలకు అందించే విషయంలో అప్రమత్తత చాలా అవసరం.
By: Garuda Media | 10 April 2026 4:48 PM ISTఅత్యంత కీలకమైన కేసులు.. సున్నితమైన కేసులకు సంబంధించిన వివరాల్ని ప్రజలకు అందించే విషయంలో అప్రమత్తత చాలా అవసరం. ఇలాంటి అంశాలపై సుదీర్ఘ వాదనలు కోర్టు జరిగినప్పుడు దాన్నిరిపోర్టు చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే.. ఏదో చెప్పబోయి.. మరేదో చెప్పినట్లు అవుతుంది. అంతేకాదు.. ఆయా అంశాల్ని ఎవరికి వారు తమకు అర్థమైన రీతిలో చదువుకొని.. అపార్థం చేసుకునే ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే.. అత్యంత కీలకమైన.. మతంతో ముడిపడిన అంశాల్ని రిపోర్టు చేసేటప్పుడు వీలైనంత వరకు వ్యాఖ్యల కంటే కూడా జరిగిన విషయాన్నిజరిగినట్లుగా చెప్పుకోవటం మంచి పని. నిజానికి ఈ తీరు ప్రజలకు కచ్ఛితమైన సమాచారాన్ని అందించినట్లు ఉంటుంది.
అందుకు భిన్నంగా జరిగిన మొత్తం అంశాన్ని క్లుప్తంగా చెప్పే ప్రయత్నంలో కొన్నిసార్లు విషయానికి సంబంధించిన ‘ఆత్మ’ను మిస్ అయ్యే ముప్పు పొంచి ఉంటుంది. ఆలయాల్లో అందరికి అనుమతి అంశంపై కొద్ది రోజులుగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి గురువారం (ఏప్రిల్ 9న) ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 4.30 గంటల వరకు వాదనలు జరిగాయి.
ఈ సందర్భంగా ఆలయాల్లో అందరికి అనుమతి అన్న అంశంపై విభేదించే న్యాయవాదులు తమ వాదనల్ని వినిపించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తుల్లో కొందరు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనికి కొనసాగింపుగా సదరు న్యాయవాదులు కూడా తమ వాదనల్ని వినిపించారు. ఇంత సుదీర్ఘంగా సాగిన వాదనల్ని కొద్దిమాటల్లో చెప్పటం.. అది కూడా కొన్ని అంశాల్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని వివరాలు ఇవ్వటం వల్ల ప్రజలను మరింత గందరగోళానికి గురి చేసే అవకాశం ఉంటుంది. అందుకే.. ఆ వివరాల్ని వీలైనంత ఎక్కువ వివరాలతో ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఇప్పటివరకు చెప్పినట్లు.. మేం ఒక ప్రయోగం చేస్తున్నాం. వివరాల్ని ఒకవైపు మొగ్గు చూపకుండా జరిగిన అంశాల్ని జరిగినట్లుగా క్లుప్తంగా ఇస్తున్నాం. అదే సమయంలో ముందే చెప్పినట్లు.. అసలు గురువారం మొత్తం విచారణలో ఏం జరిగిందన్న విషయాన్ని చెప్పే క్రమంలో ఆత్మ మిస్ కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అంతేకాదు.. ఈ కేసుకు ఉన్న ప్రాధాన్యత.. సున్నితత్త్వాన్ని పరిగణలోకి తీసుకొని.. ఆసక్తికర వాదనలు వినిపించిన ఒకరిద్దరు న్యాయవాదుల వాదనలకు సంబంధించి వేర్వేరు కథనాల్లో పేర్కొనటం ద్వారా.. వీలైనంత ఎక్కువ సమాచారం.. ఆసక్తికరంగా.. వాస్తవాలకు అనుగుణంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం.
గురువారం జరిగిన వాదనల క్రమాన్ని టైం లైన్ రూపంలో ఇస్తే..
ఉదయం 10.30 - 11.30 గంటలు
సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్
రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం శబరిమల భక్తులు తమ ప్రత్యేక మతపరైమన తెగ. వారికి తమ ఆచారాల్ని నిర్వహించుకునే పూర్తి హక్కు ఉంది. శబరిమల లాంటి ఆలయాలు ప్రభుత్వ నిర్వహనణలో ఉన్నంత మాత్రాన అవి ప్రభుత్వ సంస్థలు అయిపోవు. అవి.. కేవలం భక్తుల కోసం నిర్వహించే మతపరమైన ఆస్తులు. కాబట్టి.. అక్కడ మతపరమైన హక్కులకే ప్రాధాన్యత ఉండాలి. ఆర్టికల్ 26 ప్రకారం తెగల హక్కులు వర్సెస్ ఆర్టికల్ 25 వ్యక్తిగత హక్కులకు సంబంధించిన వాదనల్ని వినిపించారు.
తన వాదనల్లో భాగంగా న్యాయస్థానాలు పాత తీర్పులను తిరగరాయాలని చూస్తున్నాయని పేర్కొనగా.. జస్టిస్ అరవింద్ కుమార్ స్పందిస్తూ.. అంత తీవ్రస్థాయికి వెళ్లకండి.. మేం చట్టాన్ని విశ్లేషిస్తున్నామంటూ మందలింపు ధోరణిలో వ్యాఖ్యానించారు.
ఉదయం 11.30 - మధ్యాహ్నం 1.15 గంటలు
సీనియర్ న్యాయవాది తొంభైయ్యో పడిలో ఉన్న కె. పరాశరన్ వాదనలు
శబరిమల అయ్యప్ప స్వామి 'నైష్ఠిక బ్రహ్మచారి'. ఆ మూర్తి స్వభావాన్ని గౌరవించడం భక్తుల ప్రాథమిక హక్కు. అర్థనారీశ్వర రూపం సమానత్వానికి ప్రతీక అయితే.. ధ్యాన ముద్రలో ఉన్న దైవానికి కొన్ని నియమాలు ఉంటాయి. రాజ్యాంగంలని ఆర్టికల్ 14లో పేర్కొన్న సమానత్వం 'అర్ధనారీశ్వర' రూపం లాంటిది. శబరిమల నియమం 'ధ్యాన ముద్ర'లో ఉన్న దైవానికి వర్తించే నియమం లాంటిది. ఆర్టికల్ 15(2) వర్తింస్తుంది. ఆలయం అనేది దుకాణం/ హోటల్ లాంటి పబ్లిక్ ప్రదేశం కాదు. కాబట్టి.. లింగ వివక్ష నిబంధనలు ఇక్కడ వర్తించవు.
మహిళలను నెలకు మూడు రోజులు అంటరానివారుగా చూడటం వారి గౌరవానికి భంగం కాదా? అని జస్టిస్ బి.వి. నాగరత్న ప్రశ్నించగా, ఇది కేవలం నమ్మకమే తప్ప వివక్ష కాదని పరాశరన్ బదులిచ్చారు.
మధ్యాహ్నం 2.15 - 3.45గంటలు
సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (కేంద్రం వాదనలు)
2018 తీర్పులో మహిళల ప్రవేశంపై ఆంక్షలను అంటరానితనంతో పోల్చటం తప్పు. అది కేవలం కుల వివక్షకు మాత్రమే వర్తిస్తుంది. మతపరమైన ఆచారాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదు. ఇది రాజ్యాంగ నైతికత పేరుతో సంప్రదాయాల్ని దెబ్బ తీయటమే. రాజ్యాంగం ఆర్టికల్ 17లో పేర్కొన్న అంటరానితనం దీనికి వర్తించదు.
ఒక ఆచారం హేతుబద్ధమా? కాదా? అని కోర్టులు తేల్చకూడదు. ఆ ఆచారం ఆ మతంలో అంతర్భాగమా? కాదా? అన్నది మాత్రమే చూడాలి. శబరిమల నియమం అయ్యప్ప స్వామి 'నైష్ఠిక బ్రహ్మచర్యం' అనే నమ్మకంపై ఆధారపడి ఉంది. దానికి తర్కంతో సంబంధం లేదు. 2018 తీర్పులో మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడాన్ని అంటరానితనంతో పోల్చడం ఏ మాత్రం సరికాదు. "అంటరానితనం అనేది చారిత్రక కారణాల వల్ల ఒక వర్గం పట్ల చూపిన వివక్ష. శబరిమలలో మహిళలకు ఉన్న ఆంక్షలు కేవలం ఆ దేవత స్వభావం వల్ల ఏర్పడినవి. ఈ రెండింటినీ ఒకటి చేయడం రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశాన్ని కించపరచడమే" అని వాదనలు వినిపించారు.
రాజ్యాంగ నైతికత అనే అస్పష్టమైన పదం పేరుతో మతపరమైన సంప్రదాయాలను దెబ్బ తీయకూడదు. ఇది ఒకరకమైన పాశ్చాత్య భావజాలం. మత గ్రంథాల హేతుబద్ధతను నిర్ణయించే అధికారంలో.. నైపుణ్యం లౌకిక కోర్టులకు ఉండదు. మతం తనను తాను సంస్కరించుకోవాలే తప్ప.. న్యాయవ్యవస్థ బలవంతంగా మార్పులు చేయకూడదు. రాజ్యాంగ నైతికత పేరుతో ప్రజలు మతపరమైన విశ్వాసాల్లోకి కోర్టులు వెళ్లకూడదు. లేదంటే.. ప్రతి చిన్న ఆచారం కోర్టు మెట్లు ఎక్కుతుంది.
సాయంత్రం 3.45 - 4.30 గంటలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన తొమ్మిది మంది రాజ్యాంగ ధర్మాసనం తుది వ్యాఖ్యలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్
మేం కేవలం శబరిమల గురించి మాత్రమే ఆలోచించడం లేదు. ఈ కేసు ద్వారా మేమిచ్చే తీర్పు మసీదుల్లో మహిళల ప్రవేశం, పార్సీ మహిళల హక్కులు, మరియు దావూదీ బోహ్రా వర్గంలో మత బహిష్కరణ వంటి అనేక ఇతర మతపరమైన అంశాలకు మార్గదర్శకంగా మారుతుంది. అందుకే మేం చాలా జాగ్రత్తగా రాజ్యాంగ ప్రశ్నలను రూపొందించాం.
జస్టిస్ బీవీ నాగరత్న
ఆలయాల్లోకి అందరికీ ప్రవేశం కల్పిస్తే మతం బలహీనపడదు.. పైగా అది మరింత సమ్మిళితంగా మారుతుంది. హిందూ ధర్మం ఎప్పుడూ మార్పులను ఆహ్వానిస్తుంది.
జస్టిస్ అరవింద్ కుమార్ & జస్టిస్ విక్రమ్ నాథ్
ఆర్టికల్ 25(2)(బి) లోని హిందూ మత సంస్థలు.. హిందువులలోని అన్ని తరగతులు అనే పదాలకు ఉన్న చట్టపరమైన అర్థాన్ని విశ్లేషించి.. ఒక ఆలయం ప్రభుత్వ నిధులతో నడుస్తున్నప్పుడు.. అక్కడ వివక్ష కు తావు ఉండకూడదన్న కోణంలో ప్రశ్నలు వేశారు.
ధర్మాసనం ఉమ్మడి అభిప్రాయం
మత స్వేచ్ఛ.. సమానత్వ హక్కు మధ్య ఉన్న వైరుధ్యాన్ని పరిష్కరించటమే మా ముందున్న అతి పెద్ద సవాలు. వ్యక్తిగత హక్కుల కంటే సమాజంలోని ఒక తెగ హక్కులు ఎప్పుడు పైచేయి సాధిస్తాయో తెలుస్తాం.
ఈ కేసుకు సంబంధించిన ఒక కీలకసమాచారాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంది. ఏప్రిల్ 7 నుంచి 9 వరకు మహిళల ప్రవేశంపై ఆంక్షలను సమర్థించే వారి వాదనల్ని సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం వినగా.. దీనికి సంబంధించిన తదుపరి విచారణ ఏప్రిల్ 14-18 వరకు జరుగుతుంది. అప్పుడు 2018నాటి తీర్పును సమర్థించే వాదనల్ని వింటారు.
