Begin typing your search above and press return to search.

ఆ ఆర్మీ ఆఫీసర్ కు సుప్రీంలో చుక్కెదురు.. మత విశ్వాసాలు సరికాదని సూచనలు

ఆర్మీకి సంబంధించిన ఒక కీలక కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

By:  Tupaki Political Desk   |   25 Nov 2025 5:00 PM IST
ఆ ఆర్మీ ఆఫీసర్ కు సుప్రీంలో చుక్కెదురు.. మత విశ్వాసాలు సరికాదని సూచనలు
X

దేశంలో మతం, రాష్ట్రం, క్రమశిక్షణ ఈ మూడు అంశాలు ఎప్పుడు చర్చలోకైనా వస్తే, ఆ సంభాషణలు తీవ్రమవుతాయి. ప్రత్యేకంగా ఆర్మీ గురించి మాట్లాడితే, అక్కడ లౌకికతపై, క్రమశిక్షణపై రాజీకి అవకాశం లేదన్నది తరతరాలుగా ఉన్న ప్రమాణం. ఆ విలువలను మరోసారి అత్యున్నత న్యాయస్థానం ముందుకు తెచ్చింది. ఆర్మీకి సంబంధించిన ఒక కీలక కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

గర్భగుడిలోకి ప్రవేశానికి నిరాకరణ..

ఒక ఆలయ కార్యక్రమంలో గర్భగుడిలోకి ప్రవేశించేందుకు నిరాకరించిన ఒక హిందూయేతర ఆర్మీ అధికారిని విధుల నుంచి తొలగించారు. ఇది సాధారణ క్రమశిక్షణ చర్య అని అనిపించినా, దాని వెనుక వ్యక్తిగత మత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులు, ఆయా ఆదేశాల నేపథ్యం అన్నీ కలిసి సున్నితమైన ప్రశ్నలకు ప్రాణం పోసుకున్నాయి. తన మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉందని భావించిన ఆ అధికారి శామ్యూల్ కమలేశన్ ఉన్నతాధికారుల ఆదేశాలను తిరస్కరించారు. ఈ ధిక్కరణను ఆర్మీ ‘క్రమశిక్షణారాహిత్యం’గా పరిగణించి విధుల నుంచి తొలగించింది.

కోర్టుకు వెళ్లిన కమలేశన్..

ఈ నిర్ణయాన్ని కమలేశన్ కోర్టులో సవాల్ చేశారు. ముందుగా ఢిల్లీ హైకోర్టు, ఇప్పుడు సుప్రీంకోర్టూ ఒకటే అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఆర్మీ నిబంధనలు ఒకసారి పాటించేందుకు అంగీకరించిన తర్వాత వ్యక్తిగత విశ్వాసాలకంటే క్రమశిక్షణకే ప్రాధాన్యం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘ఒకసారి యూనిఫాం ధరించాక వ్యక్తిగత అభిప్రాయాలు, విశ్వాసాలను ప్రాధాన్యం ఇవ్వడం సైన్యంలో అంగీకారించబడదు. ఇది పూర్తిగా క్రమశిక్షణారాహిత్యం’ అని కోర్టు కఠినంగా పేర్కొంది.

ఆసక్తికర వ్యాక్యలు చేసిన లాయర్..

కోర్టులో కమలేశన్ తరఫున న్యాయవాది చేసిన వాదనలు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి. తన క్లయింట్ పండగల్లో పాల్గొనడం, ఇతర మతాల వ్యక్తులను గౌరవించడం, రెజిమెంటల్ కేంద్రాల్లోని ‘సర్వ ధర్మ స్థలం’ వ్యవస్థ ఉన్నదన్న వివరాలు అన్నీ ఆయన స్వభావాన్ని చెబుతాయని న్యాయవాది వాదించారు. పంజాబ్‌లో మమున్ కేంద్రంలో గుడి, గురుద్వారా మాత్రమే ఉండడం.. గర్భగుడిలోకి వెళ్లాలన్న అంశమే నిజమైన సమస్య అని వివరించారు. ‘ఆర్మీలో చేరిన తర్వాత మతపరమైన హక్కులను పూర్తిగా వదులుకునేలా చేయలేం’ అని ఆయన వాదించారు.

తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం..

అయితే ఈ వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆర్మీ పనిచేసే పరిసరాలు, సైనిక క్రమశిక్షణ, యూనిఫాం ధరించిన తరుణంలో వ్యక్తిగత అభిప్రాయాలకున్న పరిమితులు అన్నీ ఇవి అత్యున్నత న్యాయస్థానం నిర్ణయానికి పునాది వేశాయి. సైనిక దళాల్లో వ్యక్తిగత విశ్వాసాలకు స్థలం ఉండవచ్చుగానీ, అవి విధుల నిర్వర్తనను ప్రభావితం చేసే స్థాయికి రావడం అంగీకారించదగినది కాదని కోర్టు అభిప్రాయపడింది.

ఈ తీర్పు ఒక పెద్ద ప్రశ్నను మన ముందుంచుతుంది. మత స్వేచ్ఛ, వృత్తి క్రమశిక్షణ మధ్య గీత ఎక్కడ గీయాలి? రాజ్యాంగం ఇచ్చిన హక్కులు వ్యక్తిగతంగా ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు? ముఖ్యంగా ఆర్మీ వంటి శక్తిసంపన్న సంస్థల్లో వ్యక్తిగత అభిప్రాయాలకు పరిమితులు అవసరమా? అని. వీటన్నింటికీ సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన సందేశం ఏంటంటే ఆర్మీకి మతంతో సంబంధం లేదు. యూనిఫాం అంటే బాధ్యత, కట్టుబాటు, రాజ్యాంగ బద్ధత, సెక్యులరిజం. అక్కడ స్వేచ్ఛ ఉన్నా.. అవి క్రమశిక్షణకు విరుద్ధంగా మారకూడదు. ఈ కేసు ఒక వ్యక్తి మాత్రమే కాకుండా, భవిష్యత్తులో ఆర్మీ నిర్మాణాన్ని, దాని లౌకికతను ప్రభావితం చేసే ఒక ప్రామాణిక తీర్పుగా చరిత్రలో నిలిచిపోనుంది.