కోర్టుకెక్కిన హెయిర్ కట్.. ఏకంగా 25 లక్షలు జరిమానా?
ఈ ఫిర్యాదును విచారించిన కన్జూమర్ కమిషన్ 2021లో ఏకంగా రూ. 2 కోట్ల భారీ పరిహారాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
By: Madhu Reddy | 7 March 2026 8:00 PM ISTఒక హెయిర్ కట్ వల్ల రూ. 25 లక్షల జరిమానా పడుతుందని ఎవరైనా ఊహిస్తారా? ముంబైలోని ఒక ప్రముఖ హోటల్ సెలూన్‌లో జరిగిన చిన్న పొరపాటు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక మోడల్ తన హెయిర్ స్టైలింగ్ సరిగా చేయలేదని ఏకంగా కోర్టు మెట్లు ఎక్కిన ఈ వింత ఘటన, చివరకు సుప్రీంకోర్టు వరకు చేరి భారీ పరిహారంతో ముగిసింది. అసలు ఒక జుట్టు కత్తిరింపు వ్యవహారం ఇన్ని లక్షల జరిమానాకు ఎలా దారితీసిందో ఇప్పుడు మనము తెలుసుకుందాం..
సెలూన్ చేసిన తప్పు.. మోడల్ పడ్డ కష్టం:
2018లో ఈ వివాదం ముంబైలోని ఐటీసీ (ITC) హోటల్ సెలూన్‌లో మొదలైంది. ఒక ప్రముఖ మోడల్ తన కెరీర్ కోసం హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్లగా, అక్కడి స్టైలిస్ట్ ఆమె కోరిన విధంగా కాకుండా హెయిర్ కట్ చేసేశాడు. ఇక మోడలింగ్ రంగంలో ఉన్న వారికి రూపమే పెట్టుబడి. కానీ, సెలూన్ చేసిన పొరపాటు వల్ల ఆమె లుక్ పూర్తిగా మారిపోయింది. ఇక దీంతో తాను మానసిక వేదనకు గురయ్యానని, తన ఆత్మవిశ్వాసం దెబ్బతిని అనేక మోడలింగ్ అవకాశాలు, ఇంటర్వ్యూలు కోల్పోయానని ఆమె కన్జూమర్ ఫోరంలో ఫిర్యాదు చేసింది. సెలూన్ల నిర్లక్ష్యం వల్ల వృత్తిపరంగా ఎంత నష్టం జరుగుతుందో ఈ కేసు కళ్లకు కట్టింది.
కోట్ల నుంచి లక్షలకు.. సుప్రీంకోర్టు తీర్పు:
ఈ ఫిర్యాదును విచారించిన కన్జూమర్ కమిషన్ 2021లో ఏకంగా రూ. 2 కోట్ల భారీ పరిహారాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ ఐటీసీ హోటల్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం, పరిహారం మొత్తాన్ని రివైజ్ చేసింది. ఇక మోడల్ ఎదుర్కొన్న మానసిక ఇబ్బందులు, కెరీర్ పరంగా జరిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని, రూ. 25 లక్షలు చెల్లించాలని ఐటీసీకి ఆదేశాలు జారీ చేసింది. న్యాయ చరిత్రలో ఒక హెయిర్ కట్ విషయంలో ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడం ఒక అరుదైన విషయంగా నిలిచిపోయింది.
