పోస్ట్ చేశామన్నది కాదు.. ఏ దేశ చట్టాల్లో ఉన్నామన్నదే ముఖ్యం!
ఫేస్‌బుక్‌లో చేసిన ఒక చిన్న కామెంట్ ఏకంగా ఒక యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. శ్రీలంకకు చెందిన 24 ఏళ్ల అనోజన్ శివరస ప్రస్తుతం సౌదీ అరేబియాలో మరణశిక్షను ఎదుర్కొంటున్నాడు
By: Madhu Reddy | 7 Oct 2026 3:53 PM ISTఫేస్‌బుక్‌లో చేసిన ఒక చిన్న కామెంట్ ఏకంగా ఒక యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. శ్రీలంకకు చెందిన 24 ఏళ్ల అనోజన్ శివరస ప్రస్తుతం సౌదీ అరేబియాలో మరణశిక్షను ఎదుర్కొంటున్నాడు. "నా కొడుకును క్షమించి మా వద్దకు పంపండి" అంటూ ఆ తల్లి కన్నీరుమున్నీరుగా వేడుకుంటున్న దృశ్యం అందరినీ కలచివేస్తోంది. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? పోస్ట్ డిలీట్ చేసినా ఎందుకు శిక్ష పడింది? అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
అసలు గొడవ ఎక్కడ జరిగింది?:
ఈ మొత్తం వివాదానికి మూలం మనకు పక్కనే ఉన్న శ్రీలంక దేశం. అక్కడ ఒక హిందూ యాత్ర జరుగుతున్న సమయంలో, భక్తుల వెంట వస్తున్న ఒక కుక్కను ముస్లిం వ్యక్తి కాలితో తన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రెండు వర్గాల మధ్య ఆన్‌లైన్‌లో తీవ్ర వాదనలు మొదలయ్యాయి. ఇక ఆ వీడియో కింద మరో ముస్లిం వ్యక్తి హిందూ దేవతలను తిడుతూ కామెంట్ పెట్టాడు. దానికి స్పందనగా శ్రీలంకకు చెందిన హిందూ యువకుడు అనోజన్ ప్రవక్త ముహమ్మద్‌ను అవమానిస్తూ తమిళంలో రిప్లై పోస్ట్ చేశాడు.
ఇతను ఎక్కడ ఉంటున్నాడు? శిక్ష ఎక్కడ పడింది?:
శ్రీలంకలో ఈ వివాదం నడిచినప్పటికీ, అనోజన్ మాత్రం ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాడు. అతను ప్రస్తుతం సౌదీ అరేబియాలో వలస కార్మికుడిగా పనిచేస్తున్నాడు. .శ్రీలంకలో జరిగిన ఆన్‌లైన్ గొడవకు సంబంధించిన ఆధారాలను అతని యజమాని సౌదీ పోలీసులకు అందించడంతో, అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. దాంతో సౌదీ అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. సౌదీ అరేబియాలోని అత్యంత కఠినమైన మతపరమైన దూషణల చట్టాల కింద అప్పీలేట్ కోర్టు అతనికి మరణశిక్ష ఖరారు చేసింది.
పోస్ట్ డిలీట్ చేసినా ఎందుకు శిక్ష పడింది?:
తన తప్పును గ్రహించిన అనోజన్ వెంటనే ఆ కామెంట్‌ను డిలీట్ చేయడంతో పాటు క్షమాపణ చెబుతూ ఒక వీడియో కూడా పోస్ట్ చేశాడు. అయినప్పటికీ చట్టం ముందు అది పనిచేయలేదు. సౌదీ లాంటి దేశాలలో మతపరమైన నిబంధనలు అత్యంత కఠినంగా ఉంటాయి. ఆధారాలు అప్పటికే అధికారుల చేతికి చిక్కడంతో, క్షమాపణలు చెప్పినా ప్రయోజనం లేకపోయింది.
దౌత్యపరమైన ప్రయత్నాలు మరియు ఆందోళన:
తన కొడుకు ప్రాణాలు కాపాడాలని కుటుంబం వేడుకుంటుంది. ఈ ఘటన శ్రీలంకలో తీవ్ర కలకలం రేపింది. పలు పౌర సంఘాలు, రాజకీయ పార్టీలు రంగంలోకి దిగి ఆయనకు క్షమాభిక్ష పెట్టాలని దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే సౌదీ అరేబియాలో ఉరిశిక్షల విషయంలో ముందస్తు సమాచారం ఇచ్చే పద్ధతి ఉండదు. సెప్టెంబర్ 28 నుంచి ఆ కుటుంబానికి ఎలాంటి సమాచారం అందకపోవడంతో ఆందోళన మరింత పెరిగింది.
మొత్తానికి చూస్తే, ఈ ఘటన ప్రపంచానికి ఒక పెద్ద గుణపాఠం. మనం ఏ దేశంలో ఉన్నామనేది ముఖ్యం కాదు, ఏ దేశ చట్టాల పరిధిలో ఉన్నామనేదే అసలు విషయం. ఇక సోషల్ మీడియాలో క్షణికావేశంలో చేసే కామెంట్లు, గొడవలు జీవితాలను ఎలా నాశనం చేస్తాయో అనోజన్ ఉదాహరణ స్పష్టం చేస్తోంది. ఇక విదేశాలలో ఉండే ప్రవాసులు అక్కడి చట్టాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఈ విషాద ఘటన హెచ్చరిస్తోంది.
