Begin typing your search above and press return to search.

ఎందుకు అరెస్టు చేస్తున్నారో తప్పనిసరిగా చెప్పాలి: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

దేశంలో అరెస్టు విధానాలపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన సంచలన తీర్పును వెలువరించింది.

By:  A.N.Kumar   |   7 Nov 2025 3:00 PM IST
ఎందుకు అరెస్టు చేస్తున్నారో తప్పనిసరిగా చెప్పాలి: సుప్రీంకోర్టు సంచలన తీర్పు
X

దేశంలో అరెస్టు విధానాలపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన సంచలన తీర్పును వెలువరించింది. ఒక వ్యక్తిని ఎందుకు అరెస్టు చేస్తున్నారో పోలీసులు లేదా దర్యాప్తు సంస్థలు తప్పనిసరిగా అతనికి రాతపూర్వకంగా తెలియజేయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నిబంధన ఇండియన్ పీనల్ కోడ్ (IPC) తో పాటు అన్ని చట్టాల కింద నమోదైన కేసులకు వర్తిస్తుందని ధర్మాసనం తేల్చి చెప్పింది.

రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు మైలురాయి

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం ప్రతి వ్యక్తికి తన అరెస్టుకు గల కారణాలను వీలైనంత త్వరగా తెలుసుకునే హక్కు ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ హక్కు వ్యక్తిగత స్వేచ్ఛ , జీవించే హక్కు (ఆర్టికల్ 21)లో భాగమని, ఇది కేవలం ఒక విధానపరమైన అంశం మాత్రమే కాదని, ఇది ఒక తప్పనిసరి రాజ్యాంగపరమైన రక్షణ అని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.

ముంబైకి చెందిన మిహిర్ రాజేష్ షా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ మరియు జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక తీర్పు ఇచ్చింది.

అరెస్టు చేసిన వ్యక్తికి, తనను ఎందుకు అరెస్టు చేశారో, ఏ చట్టాల కింద కేసు నమోదు చేశారో అతనికి అర్థమయ్యే భాషలో రాతపూర్వకంగా ఇవ్వాలి.కారణాలు తెలియజేయడంలో విఫలమైతే, ఆ అరెస్టు , తదనంతరం రిమాండ్‌కు చట్టబద్ధత ఉండదు. అలాంటి వ్యక్తిని విడుదల చేయాల్సి ఉంటుంది.

మౌఖికంగా చెప్పినా రాతపూర్వకంగా ఇవ్వాలి

కొన్ని అసాధారణ పరిస్థితుల్లో (ఉదాహరణకు, నేరం జరుగుతున్నప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నప్పుడు) వెంటనే రాతపూర్వకంగా ఇవ్వడం సాధ్యం కాకపోతే, మొదట మౌఖికంగా తెలియజేయాలి. అయితే, రిమాండ్ కోసం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు కనీసం రెండు గంటల ముందు ఆ కారణాలను రాతపూర్వకంగా అందించాలి.

అరెస్టుకు గల కారణాలను తెలియజేయడం వల్ల నిందితుడు త్వరగా న్యాయవాదిని సంప్రదించి బెయిల్ లేదా ఇతర చట్టపరమైన పరిష్కారాలను వెతుక్కోవడానికి అవకాశం ఉంటుంది.

దుర్వినియోగానికి అడ్డుకట్ట

సాధారణంగా పోలీసులు అరెస్టు చేసే సమయంలో 'కేసు ఉంది' అని మాత్రమే చెప్పి సరైన కారణాలను స్పష్టంగా తెలియజేయడం లేదు. ఈ పద్ధతి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుందని, భవిష్యత్తులో అధికార దుర్వినియోగం చేసే పోలీస్ చర్యలకు ఈ తీర్పు అడ్డుకట్ట వేస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిరాధారమైన లేదా అక్రమ అరెస్టుల నుంచి పౌరులకు ఈ తీర్పు బలమైన రక్షణ కవచంగా నిలవనుంది.

ఈ తీర్పును తక్షణం అమలు చేసేందుకు గాను దీని ప్రతిని అన్ని రాష్ట్రాల హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్స్‌కు మరియు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పంపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.