మాజీ నిఘా చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీం షాక్
బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న సంచలన ఆరోపణలు.. తదనంతర పరిణామాలు.. విచారణ ఎపిసోడ్ గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు.
By: Garuda Media | 15 Oct 2025 5:24 PM ISTబీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న సంచలన ఆరోపణలు.. తదనంతర పరిణామాలు.. విచారణ ఎపిసోడ్ గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై అప్పటి నిఘా చీఫ్ ప్రభాకర్ రావుపై పెద్ద ఎత్తున ఆరోపణలు..విమర్శలు వెల్లువెత్తిన వైనం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఆయన ఐఫోన్ ను ఇవ్వాలని విచారణ సంస్థలు కోరగా.. ఏడాది లోపున్న తన మనమడు ఆడుకుంటూ ఐఫోన్ ను కిందపడేయటంతో అది పూర్తిగా పగిలిపోయిందని.. పాస్ వర్డ్ అడిగితే మర్చిపోయినట్లుగా ప్రభాకర్ రావు చెబుతున్నట్లుగా పేర్కొంటూ సుప్రీంలో జరిగిన తాజా విచారణలో ప్రభుత్వం తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన డేటాను డిలీట్ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు.. ఉద్దేశపూర్వకంగానే ఐఫోన్ ఇవ్వట్లేదన్న వాదన వినిపించారు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో ప్రభాకర్ రావు తన ఐక్లౌడ్ పాస్ వర్డ్ ను రీసెట్ చేసి దర్యాప్తు అధికారులకు అందించాలని పేర్కొంటూ సుప్రీం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ డేటా డిలీట చేసిట్లుగా గుర్తిస్తే మాత్రం ఆయన పిటిషన్ ను డిస్మిస్ చేస్తామని స్పష్టం చేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ నిఘా చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోవటం.. ఆయనపై కేసు నమోదు కావటం తెలిసిందే. ముందస్తు బెయిల్ ఇస్తేనే భారత్ కు వస్తానని ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. అందుకు హైకోర్టు నో చెప్పింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆయనకు.. మధ్యంతర రక్షణ కల్పించింది. దీంతో భారత్ కు వచ్చిన ఆయన.. సిట్ విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో విచారణకు ప్రభాకర్ రావు ఏ మాత్రం సహకరించటం లేదన్న విషయాన్ని ప్రస్తావించటంతో పాటు ఆయన ఐఫోన్లు విచారణకు ఇవ్వాలని పేర్కొంటే.. అందుకు ఫోన్ పని చేయట్లేదన్న ప్రభాకర్ రావు వాదనకు ప్రతిగా ఆయన ఐక్లౌడ్ అకౌంట్ పాస్ వర్డ్ ను రీసెట్ చేసి సిట్ కు అందజేయాలని సుప్రీం చెప్పిన వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త మలుపులకు అవకాశం ఇస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.
