పిల్లల పెంపకం, తల్లుల ప్రవర్తన... హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
వివరాళ్లోకి వెళ్తే... కోయంబత్తూరుకు చెందిన ఓ మహిళ భర్తతో విడిపోయి 14ఏళ్ల కుమార్తెతో జీవిస్తోంది.
By: Raja Ch | 29 Dec 2025 12:08 PM ISTమన సంస్కృతిలో తల్లికి అధిక ప్రాధాన్యం ఉందని.. పిల్లలను సురక్షితంగా, గౌరవంగా, క్రమశిక్షణతో పెంచడం తల్లి బాధ్యత అని.. పవిత్రమైన అలాంటి బాధ్యతను ఆమె విస్మరిస్తే ఆ కుటుంబమే కాకుండా సమాజం కూడా తన పునాదిని కోల్పోతుందని.. తల్లుల అనైతిక ప్రవర్తన కారణంగా వారి పిల్లల జీవితాలపై ఘోరమైన ప్రభావాలు పడుతున్నాయని తాజాగా మద్రాసు హైకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు ఏమిటి.. హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడానికి గల బలమైన కారణం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దామ్..!
అవును... పిల్లల పెంపకం విషయంలో తల్లి పాత్ర.. వారి పెరుగుదలపై తల్లి ప్రభావం.. వారి మనసులపై ఆమె ముద్ర ఏ స్థాయిలో ఉంటుందనేది తెలిసిన విషయమే. పిల్లలను సంరక్షించే విషయంలో తల్లి పక్షి, తల్లి జంతువు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని, శత్రువు కంటపడకుండా కాపలా కాస్తుంటుంది. ఈ క్రమంలో.. అలాంటి తల్లే కుమార్తె విషయంలో నిర్లక్ష్యం వహిస్తే.. తన స్వార్ధం కోసం ఆమెనే బ్లాక్ మెయిల్ చేస్తే... ఈ నేపథ్యంలోనే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
వివరాళ్లోకి వెళ్తే... కోయంబత్తూరుకు చెందిన ఓ మహిళ భర్తతో విడిపోయి 14ఏళ్ల కుమార్తెతో జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు స్థానికంగా ఉంటున్న ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే ఈ బంధం 14 ఏళ్ల బాలికకు శాపంగా మారింది. తన తల్లి సుఖం, ఆమెకు దుఃఖానికి కారణమైంది! 2017లో కుమార్తెపై తల్లి ప్రియుడు కన్నేశాడు.. ఉచ్చనీచాలు మరిచాడు.. కూతురులాంటి, కూతురు వయసున్న బాలికను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు.
తన పిల్లలను కాకి వచ్చి పొడుస్తుంటే.. కోడి అంతెత్తున లేచి, రాబందులా మారి కాకిని పరుగెత్తిస్తుంది.. తన పిల్లలను రెక్కల కింద దాచి కాపాడుతుంది! కానీ ఈ కేసులో తల్లి అలా కాదు! ఈ విషయాన్ని కూతురు తనకు చెప్పినా... ఈ విషయం ఎవరికైనా చెబితే ఆత్మహత్య చేసుకుంటానని రివర్స్ లో బెదిరించింది. దీంతో... ఆ వ్యక్తి బాలికపై తరచూ వేధింపులను కొనసాగించాడు. ఈ వేదనను భరించలేని బాలికకు వెంటనే నాన్న గుర్తొచ్చారు.. ఆయనకు ఈ విషయం చెప్పింది!
దీంతో.. తన కుమార్తెతో కలిసి కోయంబత్తూర్ ఉమెన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కేసును విచారించిన కోయంబత్తూరు పోక్సో కోర్టు.. బాలిక తల్లి, ఆమె ప్రియుడికి జీవితఖైదు శిక్ష విధిస్తూ 2020లో తీర్పునిచ్చింది. దీంతో.. ఈ శిక్షను సవాల్ చేస్తూ ఆ ఇద్దరూ హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ పిటిషన్ ను న్యాయమూర్తులు జస్టిస్ వేల్ మురుగన్, జస్టిస్ జ్యోతిరామన్ ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా స్పందించిన న్యాయమూర్తులు... ఈ ఆరోపణలను పోలీసులు రుజువు చేశారని.. పోక్సో కోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని ఉత్తర్వులు జారీ చేస్తూ.. పిటిషన్ ను కొట్టివేశారు. ఈ నేపథ్యంలోనే... తల్లుల అనైతిక ప్రవర్తన కారణంగా వారి పిల్లలపై ఇలాంటి లైంగిక దాడులు జరుగుతున్నాయని.. మన సంస్కృతిలో తల్లికి అధిక ప్రాధాన్యం ఉందని.. పిల్లలను జాగ్రత్తగా పెంచడం తల్లి బాధ్యత అని.. ఈ పవిత్రమైన బాధ్యతను ఆమె విస్మరిస్తే ఆ కుటుంబమే కాకుండా సమాజమే తన పునాదిని కోల్పోతుందని అభిప్రాయపడ్డారు న్యాయమూర్తులు!
