Begin typing your search above and press return to search.

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

వీఐపీల పర్యటనలప్పుడే రోడ్లు శుభ్రం చేస్తారా? సామాన్యుల కోసం ఎందుకు పట్టించుకోరంటూ బాంబే హైకోర్టు ముంబై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రిన్స్ విలియం, కేథరిన్ పర్యటన సందర్భంగా బాలార్డ్ ఎస్టేట్‌ను శుభ్రం చేసిన అధికారులు, కాంజూర్‌మార్గ్ డంపింగ్ యార్డును పట్టించుకోవడం లేదని మండిపడింది. చెత్త సమస్యపై డిసెంబర్ 7లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

By:  A.N.Kumar   |   20 Nov 2026 12:00 AM IST
వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?
X

ప్రముఖుల పర్యటన ఉందంటే చాలు.. రోడ్లు మెరిసిపోవాలి.. చెత్త మాయమవ్వాలి.. పరిసరాలు కొత్త పెళ్లికూతురిలా ముస్తాబవ్వాలి. అదే సామాన్యులు నిత్యం తిరిగే రోడ్ల విషయానికి వస్తే మాత్రం అధికారులకు అంత శ్రద్ధ ఎందుకు ఉండదు? వీఐపీల కోసం చూపించే హడావుడిని ప్రజల కోసం కూడా చూపించాలంటూ బాంబే హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ముంబై పాలనా వ్యవస్థకు గట్టిగానే చురకలు అంటించాయి. మున్సిపల్ యంత్రాంగం ‘కుంభకర్ణ నిద్ర’లో ఉందంటూ పరోక్షంగా గడ్డిపెట్టింది.

బ్రిటన్ యువరాజు విలియం, యువరాణి కేథరిన్ ముంబై పర్యటనకు వచ్చారంటే చాలు.. దక్షిణ ముంబైలోని బాలార్డ్ ఎస్టేట్ ప్రాంతానికి ఎక్కడలేని అందం వచ్చేసింది. అప్పటిదాకా దుమ్ము.. చెత్తతో కళకళలాడిన రోడ్లను అధికారులు ఏకంగా షాంపూలు పెట్టి కడిగినంత పనిచేశారు. పరిసరాలను చూస్తుంటే ముంబై కాదు.. ఏదో లండన్ వీధుల్లో తిరుగుతున్నామా అన్నంత భ్రమ కలిగింది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన జస్టిస్ గిరీష్ కులకర్ణి, జస్టిస్ నీలా గోఖలేల ధర్మాసనం.. అధికారుల తీరుపై గట్టిగానే సెటైర్లు వేసింది. " వీఐపీలు వస్తేనే మీకు ఇంత శ్రద్ధ వస్తుందా? మరి ఏడాది పొడవునా పన్నులు కడుతూ ఇక్కడే చచ్చే సామాన్యుల కోసం ఆ మాత్రం శుభ్రం చేయడానికి మీ చేతులకు ఏమైంది? అంటూ నిలదీసింది.

బాలార్డ్ ఎస్టేట్‌కు మేకప్ వేసిన అధికారులు.. కాంజూర్‌మార్గ్ చెత్త డంపింగ్ యార్డ్ వైపు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. నవంబర్ 17న స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించిన న్యాయమూర్తులు.. అక్కడి ప్లాస్టిక్ కొండలు.. భరించలేని దుర్వాసన చూసి ముక్కున వేలేసుకున్నారు. వీఐపీల కోసం రాత్రికి రాత్రే రోడ్లకు కొత్త పెళ్లికూతురిలా అలంకరణ చేసే యంత్రాంగానికి.. ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఈ చెత్తకుప్పలను కరిగించడం మాత్రం చేతకావడం లేదు.

స్వచ్ఛ భారత్ అంటూ చీపుర్లు పట్టుకుని ఫోటోలకు పోజులివ్వడంలో ఉండే ఉత్సాహం.. రోజువారీ చెత్త సేకరణలో మాత్రం కనిపించడం లేదని కోర్టు అభిప్రాయపడింది. కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసం ప్లాస్టిక్ భూతాన్ని వదిలేస్తే.. భవిష్యత్తులో ముంబై నగరం చెత్త కుప్పల కింద సమాధి కావడం ఖాయమని హెచ్చరించింది. కాంజూర్‌మార్గ్ దుర్గంధంపై ఆడిట్ నిర్వహించి డిసెంబర్ 7 లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

నిజానికి ఇది ఒక్క ముంబై కథే కాదు.. దేశంలోని ప్రతి నగరంలోనూ ఇదే తంతు.. ఏదైనా అంతర్జాతీయ సదస్సు ఉంటేనే రోడ్లకు తారు పడుతుంది, గోడలకు రంగులు అంటుకుంటాయి. అతిథులు విమానం ఎక్కగానే.. మన నగరాలు మళ్లీ పాత ‘చెత్త’ అవతారంలోకి మారిపోతాయి. బహుశా సామాన్యులకు కూడా మంచి రోడ్లు.. స్వచ్ఛమైన గాలి దక్కాలంటే.. ఇకపై ప్రతి గల్లీలోనూ ఓ వీఐపీని అద్దెకు తెచ్చి తిప్పాలేమో..