వంట బాలేదనే దంపతుల కేసు... హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
వైవాహిక బంధానికి సంబంధించిన కేసుల్లో ఇటీవల ఉన్నత న్యాయస్థానాలు, సర్వోన్నత న్యాయస్థానాలు వెలువరిస్తున్న తీర్పులు ఎంతో ఆసక్తికరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
By: Raja Ch | 9 Aug 2025 4:06 PM ISTవైవాహిక బంధానికి సంబంధించిన కేసుల్లో ఇటీవల ఉన్నత న్యాయస్థానాలు, సర్వోన్నత న్యాయస్థానాలు వెలువరిస్తున్న తీర్పులు ఎంతో ఆసక్తికరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ముంబై హైకోర్టు ఓ ఆసక్తికరమైన తీర్పు ఇచ్చింది. ఇందులో భాగంగా... వంట బాలేదని, దుస్తులు బాగా ధరించడం లేదని అంటున్నారని భార్య చేసిన ఆరోపణలపై మరింత ఆసక్తికర కామెంట్లు చేసింది.
అవును... తాజాగా ఓ జంటకు సంబంధించిన కేసులో ముంబై ఉన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వివరాళ్లోకి వెళ్తే... 2022 మార్చిలో ఓ జంటకు వివాహమైంది. అయితే.. ఏడాది తర్వాత ఆమె భర్త నుంచి దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో... తనను భర్త, అత్తమామలతో పాటు భర్త తరుపు బంధువులు వేధిస్తున్నారంటూ గృహహింస కేసు పెట్టింది.
వివాహం జరిగిన నెల నుంచే తాను అత్తింట్లో వేధింపులు ఎదుర్కొన్నానని.. వంట బాగా చేయడం లేదని, దుస్తులు సరైనవి ధరించడం లేదని భర్త సూటిపోటి మాటలతో వేధించాడని.. అతనికి శారీరక, మానసిక సమస్యలు ఉన్న విషయం దాచారని.. ఇంటి కొనుగోలు కోసం రూ.15 లక్షలు తేవాలని అతని కుటుంబ సభ్యులు, బంధువులు హింసించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
ఈ క్రమంలో ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ముంబై హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్.. శుక్రవారం తీర్పు వెల్లడించింది. ఈ సందర్భంగా.. "దుస్తులు సరిగా వేసుకోలేదని.. వంట సరిగా చేయలేదని తిడుతుంటాడని కొందరు భార్యలు భర్తలపై ఫిర్యాదు చేస్తుంటారు.. అయితే వీటిని మేం తీవ్రమైన క్రూరత్వంగా, వేధింపులుగా పరిగణించలేం" అని జస్టిస్ విభా కంకన్ వాడి, జస్టిస్ సంజయ్ ఏ దేశ్ ముఖ్ లతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా... వివాహానికి ముందు భర్త మానసిక, శారీరక ఆరోగ్య స్థితి గురించి తనకు చెప్పలేదని ఆమె ఆరోపిస్తుంది కానీ... ఇద్దరి మధ్య జరిగిన చాట్ రికార్డులు అసలు విషయాన్ని బయటపెట్టాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇదే క్రమంలో... ఇల్లు కొనుగోలు కోసం డబ్బు కోసం వేధించారని చెబుతోంది కానీ, అప్పటికే అతనికి ఓ ఇల్లు ఉందని.. అలాంటప్పుడ ఇంటి కోసం వేధించాల్సిన అవసరం ఆ భర్తకు ఏముందని ప్రశ్నించింది.
ఇక... వివాహ సంబంధం బలహీనపడినప్పుడే వంట బాగాలేదు, దుస్తులు బాగోలేవనే.. అతిశయోక్తులు జోడించబడతాయని.. ఇలాంటి సందర్భాల్లో కేసులు వేయడం అంటే.. చట్టాన్ని అడ్డుపెట్టకుని భర్త, అతని కుటుంబాన్ని వేధించడమే అవుతుంది అని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే భర్తపై నమోదైన ఎఫ్.ఐ.ఆర్.ను కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.
ఈ సందర్భంగా ఆమెకు ఇది రెండో వివాహం అనే విషయాన్ని ప్రస్థావించిన ధర్మాసనం... 2013లో విడాకులు తీసుకుని, 2022లో మరో వ్యక్తిని వివాహం చేసుకున్న పిటిషనర్... పెళ్లైన నెలకే వైవాహిక జీవితంలో వేధింపులు ఎదుర్కొన్నానని చెబుతుండటం చూస్తుంటే.. ఆమె ఆరోపణలు అతిశయోక్తితో కూడినవని తెలిపింది.
