మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్.. సుప్రీంకోర్టు తీవ్ర రచ్చ!
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల విలువైన మద్యం అక్రమాలకు సంబంధించి.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పార్టీయువనేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
By: Garuda Media | 11 Oct 2025 1:06 PM ISTవైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల విలువైన మద్యం అక్రమాలకు సంబంధించి.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పార్టీయువనేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు తేల్చి చెప్పింది. నిజానికి రెండు రోజుల కిందట.. హైకోర్టు మోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను రద్దు చేసింది. దీంతో ఆగమేఘాలపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో ఆయనకు ఉపశమనం దక్కింది.
హోరా హోరీ వాదనలు..
సుప్రీంకోర్టులో మోహిత్ రెడ్డి పిటిషన్ విచారణకు వచ్చిన సమయంలో హోరా హోరీ వాదనలు జరిగాయి. ముఖ్యంగా ఈ సమ యంలో న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్ ఏపీ ప్రభుత్వం తరఫున విచారణకు హాజరైన న్యాయవాదులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ''దేశంలో ఎక్కడ అక్రమార్కులు ఉన్నా.. వారి తరఫున మీరు వాదిస్తుంటారే!'' అని వ్యాఖ్యానించడంతో న్యాయవాదులు.. ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూథ్రా, సిద్ధార్థ్ అగర్వాల్ చిన్నబుచ్చుకున్నారు. దీంతో న్యాయమూర్తి మరోసారి జోక్యం చేసుకుని.. ''ఇది మీ వృత్తి ధర్మం. నాకు తెలుసు.'' అని అనడంతో వారు నవ్వేశారు.
అనంతరం.. ఇరు పక్షాల తరఫున వాదనలు కొనసాగాయి. మోహిత్ రెడ్డి తరఫున.. వాదనలు వినిపించిన లాయర్.. ఈ కేసులో మోహిత్ రెడ్డి ప్రమేయం లేదన్నారు. కేవలం ఆయన కారులో నగదును తరలిస్తుండగా.. దానిని పోలీసులు స్వాధీనం చేసుకు న్నారని.. దీంతో మోహిత్ పై కేసు పెట్టారని తెలిపారు. ఇది ఉద్దేశ పూరితంగా పెట్టిన కేసుగా పేర్కొన్నారు. దీనికి చట్టం అనుమ తించదని తెలిపారు. ఇప్పటికే ఆయన తండ్రి(భాస్కరరెడ్డి)ని అక్రమంగా అరెస్టు చేసి విజయవాడ జైల్లో పెట్టారని తెలిపారు. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఇది అత్యంత కీలకమైన కేసుగా ఉందన్నారు.
అనేక మంది ఆరోగ్యాన్ని నాశనం చేసి.. వారి జేబులు కొల్లగొట్టారని వ్యాఖ్యానించారు. వైసీపీ హయాం తర్వాత.. ఇప్పుడు నూతన మద్యం విధానం అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ సమయంలోనూ.. న్యాయమూర్తి..జస్టిస్ విక్రమ్ నాథ్ జోక్యం చేసుకుని.. ``రాష్ట్రంలో మద్యం కోసం.. సూక్ష్మ, చిన్న తరహా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేశారా?`` అని వ్యాఖ్యానించారు. దీంతో న్యాయవాదులు అలాంటిదేమీ లేదని.. అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్న విధానాల కంటే మెరుగైన విధానం అమలు చేస్తున్నారని తెలిపారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు మరికొంత గడువు కావాలని కోరారు.
